ఆంధ్రప్రదేశ్‌

కొత్త చరిత్ర లిఖించిన జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 23: వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కొత్త చరిత్ర లిఖించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరపున జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఎవరూ ఊహించని ప్రభంజనం వీచింది. ఓట్లు వెల్లువెత్తాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా ఆ కుటుంబం నుండి ఇంతకుముందు పోటీచేసిన వారి ఆధిక్యతలను అధిగమించారు. జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలను తొలిసారిగా ఒకే పార్టీ గెలుచుకుంది. గతంలో ఎప్పుడూ జిల్లాలోని అన్ని స్థానాలను ఒకే పార్టీ గెలుచుకోలేదు. పులివెందుల నుంచి పోటీచేసిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 90,543 ఓట్ల భారీ ఆధిక్యతతో తన సమీప ప్రత్యర్థి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డిపై ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో 1,80,663 ఓట్లు పోలవ్వగా అందులో 90,543 ఓట్ల ఆధిక్యత రావడం అసాధారణమే. గతంలో 1994లో వైఎస్ వివేకానందరెడ్డి ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి 71,580 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, 2012 ఉప ఎన్నికల్లో జగన్ తల్లి వైఎస్ విజయమ్మ 81,373 ఓట్ల ఆధిక్యత సాధించారు. 2014 ఎన్నికల్లో జగన్ 75,243 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఈ అధిక్యతలన్నింటినీ అధిగమించి ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ 90 వేల పైచిలుకు మెజార్టీ సాధించడం ఓ చరిత్రే. కాగా ఇదే నియోజకవర్గం నుండి వైఎస్ రాజశేఖరరెడ్డి చిన్నాన్న అయిన వైఎస్ పురుషోత్తమరెడ్డి 1991 ఉప ఎన్నికల్లో 97,448 ఓట్ల ఆధిక్యతతో శాసన సభ్యునిగా ఎంపికయ్యారు. ఈ ఆధిక్యతను మాత్రం జగన్ అధిగమించలేకపోయారు.
జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలను గెలుచుకున్న చరిత్ర ఇంతవరకు ఏ పార్టీకి లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా 2004 ఎన్నికల్లో జిల్లాలోని కమలాపురం, రాయచోటి నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకుంది. 2009 ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ పరమైంది. 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ హయాంలో కూడా రాజంపేట నియోజకవర్గాన్ని టీడీపీ వశపరుచుకుంది. ఈ 2019 ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఖాతా తెరవలేకపోవడం అటుంచి, భారీ తేడాలతో అనూహ్యమైన ఓటమి పాలైంది. కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అంజద్‌బాషా 52,532 ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం అభ్యర్థి అమీర్‌బాబును ఓడించారు. ఆ తర్వాత స్థానంలో ఎవరూ ఊహించని విధంగా జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థి డా.మూలె సుధీర్‌రెడ్డి 52,035 ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం అభ్యర్థి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డిపై ఘన విజయం సాధించారు. బద్వేలు (ఎస్సీ) నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి డా.వెంకటసుబ్బయ్య, తెలుగుదేశం అభ్యర్థి డా.ఓ.రాజశేఖర్‌పై దాదాపు 47 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రైల్వేకోడూరు (ఎస్సీ) నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, తెలుగుదేశం అభ్యర్థి నరసింహప్రసాద్ పై 38 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఇక ప్రొద్దుటూరు నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి 43,200 ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం అభ్యర్థి మల్లెల లింగారెడ్డిని ఓడించారు. మైదుకూరు నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, తెలుగుదేశం అభ్యర్థి పుట్టాసుధాకర్ యాదవ్‌ను 27,798 ఓట్ల తేడాతో ఓడించారు.
రాజంపేటలో వైసీపీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి 27,465 ఓట్ల ఆధిక్యంతో తెలుగుదేశం అభ్యర్థి బత్యాల చెంగల్రాయులును ఓడించారు. కమలాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పి.రవీంద్రనాధరెడ్డి 27 వేల పైచిలుకు ఓట్లతో తెలుగుదేశం అభ్యర్థి పుత్తానరసింహారెడ్డిపై గెలుపొందారు. రాయచోటి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి 20,677 ఓట్ల ఆధిక్యత సాధించి తెలుగుదేశం అభ్యర్థి ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డిని ఓటమి పాలుచేశారు.
ఊహించని ప్రభంజనం
రాష్టవ్య్రాప్తంగా చెలరేగిన ప్రభంజనం, వైఎస్ జగన్ సొంత జిల్లాలో మరింత ఉధృతంగా వీచి, తెలుగుదేశం అభ్యర్థులు భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఎవరు తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారని తరచి చూసుకోవాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఏర్పడింది. జిల్లాలో అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయిన రాయచోటి అభ్యర్థి ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డిపై గెలుపొందిన గడికోట శ్రీకాంత్‌రెడ్డికి 20 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యత రావడం గమనార్హం. జమ్మలమడుగు నియోజకవర్గంలో చిరకాల ప్రత్యర్థులైన మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి ఓకే పార్టీలో ఉండి కలిసి పనిచేసినా, తొలిసారి ఎన్నికల బరిలో దిగిన యువకుడు డాక్టర్ మూలె సుధీర్‌రెడ్డి చేతిలో రామసుబ్బారెడ్డి 52 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోవడం ఆ పార్టీ ఊహకందని అంశం.