ఆంధ్రప్రదేశ్‌

అప్పుల్లో ఉన్నాం.. ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: దాదాపు రెండున్నర లక్షల కోట్ల అప్పులో ఉన్న రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారని ఏపీ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ప్రధాన మంత్రి సానుకూలత చూపలేదనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. జగన్ చెప్పింది చూస్తుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పుడిప్పుడే లభించకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర అంశాలపై దాదాపు గంటపాటు చర్చలు జరిపిన అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఏపీకి 97వేల కోట్ల రూపాయల అప్పులుంటే ఈ ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు దాన్ని ఏకంగా రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లకు తీసుకుపోయారని.. దాని గురించి ప్రధానికి వివరించానని అన్నారు. అప్పులపై వడ్డీ 20వేల కోట్ల రూపాయలు, తిరిగి చెల్లింపులు 20వేల కోట్లు మొత్తం 40వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితి గురించి ప్రధానికి వివరించాను.. కేంద్ర సహాయం ఎంతో అవసరమని చెప్పానని అన్నారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందజేయాలని మోదీకి విజ్ఞప్తి చేశానని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వవలసిన అవసరం గురించి ప్రధానికి వివరించాను.. రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్ మీద బతుకుతున్న విషయాన్ని ప్రధానికి వివరించానని ఆయన చెప్పారు. రాష్ట్రానికి మీ నుండి అన్ని రకాల సహాయ, సహకారాలు కావాలని మోదీని కోరినట్లు జగన్ చెప్పారు. ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం కూడా తనతో ఉన్నారని అన్నారు. రాష్ట్రాన్ని ఆదుకునే విషయంలో నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారని తాను భావిస్తున్నానని జగన్ చెప్పారు.
ప్రత్యేక హోదా రావటం కష్టమే
రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించటం కష్టమేనని జగన్‌మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. ప్రత్యేక హోదా అడిగినప్పుడు ప్రధాని ఏ విధంగా స్పందించారనే ప్రశ్నకు జగన్మోహన రెడ్డి బదులిస్తూ ఎన్‌డీఏకు 250 సీట్లు మాత్రమే వచ్చి ఉంటే బాగుండేది.. ఆర్థిక సహాయం, ప్రత్యేక హోదాకోసం ప్రధానిని ఆభ్యర్థించవలసిన అవసరం ఉండేది కాదు.. కేంద్రంపై ఆధారపడవలసిన అవసరం ఉండేది కాదని అన్నారు. ఎన్‌డీఏకు 250 కంటే ఎక్కువ సీట్లు రాకూడదని భవగవంతుడ్ని ఎంతో ప్రార్థించాను.. కానీ ఏం చేద్దాం.. మన కర్మకొద్దీ వాళ్లకు భారీ మెజారిటీ లభించందని కాబోయే ముఖ్యమంత్రి వాపోయారు. వాళ్లకు మన సహాయం అవసరం లేదు.. మనకు వాళ్ల సహాయం అవసరమని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వారు బలంగా ఉన్నారు.. ఆయన ప్రధాన మంత్రి.. నేను ముఖ్యమంత్రిని.. రాష్ట్రాన్ని బాగా నడపాలంటే కేంద్రం నుండి సహాయాన్ని అర్థించక తప్పదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన మంత్రిని కలిసిన ప్రతిసారీ ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతా.. రానున్న ఐదేళ్లలో కనీసం యాభైసార్లయినా కలుస్తాను.. కలిసిన ప్రతిసారీ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తూనే ఉంటానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఎన్‌డీఏకు 250 సీట్లు మాత్రమే వచ్చి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సంబంధించిన ఫైలుపై సంతకం చేసిన తరువాతే ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితిలో ఆ పార్టీ ఉండి ఉండేదని అన్నారు. దురదృష్టం కొద్దీ అది జరగలేదు.. వారికి మన అవసరం లేదు కాబట్టి ప్రయత్నం చేస్తూనే పోవాలన్నారు. ప్రత్యేక హోదా ఫైలుపై సంతకం చేస్తానని ప్రధాని చెప్పారా అంటే మనం ప్రయత్నం చేస్తూనే పోవాలని జగన్ వెల్లడించారు. ప్రత్యేక హోదా రాష్ట్రం హక్కు.. రాష్ట్రాన్ని విడదీసే సమయంలో విధించిన ముందస్తు షరతు ప్రత్యేక హోదా ఇవ్వటం.. దీనిని మనం వదిలేస్తే ఆ తరువాత ఎప్పుడూ కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వరని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే సమస్య కాదు.. ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి.. రాష్ట్రం ముందుకు సాగాలంటే కేంద్ర సహాయం అవసరమని జగన్మోహన్ రెడ్డి వాపోయారు. ప్రత్యేక హోదాకోసం కేంద్రంపై వత్తిడి తీసుకురావటం కొనసాగుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను వదిలే ప్రసక్తే లేదని అన్నారు.