ఆంధ్రప్రదేశ్‌

టీడీపీపై బురద జల్లడమే వైకాపా లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 11: ఒకవైపు దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడటం, మరో వైపు టీడీపీపై బురద చల్లడమే లక్ష్యంగా అధికార వైకాపా పని చేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఉండవల్లి ప్రజావేదికలో ఎమ్మెల్సీలతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వదంతులు ఎన్నో వ్యాపింప చేస్తారని, కావాలని తప్పుడు కేసులు బనాయిస్తారన్నారు. అన్నింటినీ ఎదుర్కొనాలని, మనం ఏ తప్పూ చేయలేదని, భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఆధిపత్య ధోరణిలో వ్యవహరించడం, బెదిరించడం, దౌర్జన్యాలకు పాల్పడటం, పార్టీపై, నాయకులపై బురద చల్లడం చేస్తున్నారని ఆరోపించారు. అప్పుడు వివిధ శాఖల్లో ఏయే అధికారులు పని చేశారో, ఇప్పుడు వారిచేతే పని చేయిస్తున్నారన్నారు. అవినీతి బయటపెడితే సన్మానాలు చేస్తామంటున్నారన్నారు. తొలుత 6 నెలల సమయం ఇద్దామనుకున్నానని, కానీ కార్యకర్తలను భయపెట్టడం, దాడులకు పాల్పడుతుంటే వౌనంగా ఉండలేమన్నారు. వాళ్లు ఎంత ఆధిపత్య ధోరణితో వెళ్తే, ప్రజల్లో మనకంత మద్దతు వస్తుందన్నారు. పార్టీపై, నాయకులపై, అవినీతి బురద జల్లితే తిప్పికొట్టాలని, దాడులను, దౌర్జన్యాలను ఎదుర్కోవాలన్నారు. కార్యకర్తల్లో నాయకుల్లో నైతిక బలం పెంచాలని, పార్టీని మరింత సమర్థవంతంగా పని చేయించడమే అందరి లక్ష్యం కావాలని దిశానిర్దేశం చేశారు. శాసన సభకు, లోక్‌సభకు పోటీ చేసిన అభ్యర్థులంతా ఈ నెల 15న నిర్వహించే వర్కుషాపునకు హాజరు కావాలని ఆదేశించారు. దాడులు, దౌర్జన్యాల సమాచారంతో అభ్యర్థులందరూ వర్క్‌షాప్‌నకు రావాలన్నారు. దాడులు, దౌర్జన్యాలపై జిల్లా పార్టీ నాయకత్వాలు స్పందించాలని సూచించారు. బాధితులకు అండగా ఉండాలన్నారు. ప్రజాస్వామ్యంలో అరాచాలకు తావులేదని, వాళ్లు ఎప్పుడు వచ్చినా దాడులు చేయడం రివాజుగా పెట్టుకున్నారన్నారు.
నియోజకవర్గంలో పార్టీ నేతలు బాధితులకు అండగా ఉండాలని కోరారు. వైకాపా దాడులను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. ఎక్కడిక్కడ సంఘీభావ ర్యాలీలను నిర్వహించాలని, ప్రతి కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకుడిదేనని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు గ్రామాలకు వెళ్లాలని, కార్యకర్తలతో అనుసంధానం కావాలన్నారు. ప్రజలతో నిరంతర సంబంధాలు పెంచుకోవాలని, పార్టీ కోసం త్యాగాలు చేసిన వారిని మరింత సమున్నతంగా నిలబెట్టేందుకు సవాల్‌గా తీసుకోవాలన్నారు. శాసన సభలో టీడీపీ బలం 23 ఉంటే, శాసన మండలిలో 35 ఉందన్నారు. శాసన మండలిలో అధిక్యతలో ఉన్నామని, అక్కడ మరింత క్రియాశీలం కావాలన్నారు. ప్రతి శాఖలో జరిగే కార్యక్రమాలను అధ్యయనం చేయాలని, జీవోలను క్షుణ్ణంగా విశే్లషించాలన్నారు. మన విమర్శలు సహేతుకంగా ఉండాలని, నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నామని, ఏది పడితే అది విమర్శించడం సరికాదన్నారు. సమాజానికి, పార్టీకి మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రజలను ప్రభావితం చేసే నాయకత్వాన్ని ప్రతి నియోజకవర్గంలోనూ ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కళా వెంకటరావు, నారా లోకేష్, యనమల రామకృష్ణుడు, ఫరూక్, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, పోతుల సునీత, దువ్వారపు రామారావు పాల్గొన్నారు.

చిత్రం... టీడీపీ ఎమ్మెల్సీల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు