ఆంధ్రప్రదేశ్‌

పీఏసీ చైర్మన్ పదవి ఎవరికో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 17: రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీకి సంప్రదాయంగా లభించే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవికి టీడీపీలో చర్చ మొదలైంది. ఇప్పటికే టీడీఎల్పీ, మండలిలో విపక్ష నేత, పార్టీ విప్, పార్లమెంటరీ పార్టీ పదవులను ప్రకటించిన టీడీపీ అధినేత ఇప్పుడు పీఏసీ పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై విస్తృత కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయిదేళ్ల పదవీ కాలంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు ఇలా లెక్కలేసుకుని మరీ పదవుల పందారం చేపట్టిన చంద్రబాబు ఇప్పుడు అధికారం కోల్పోవడంతో సొంత అనుకున్న వారికే పదవులు కట్టబెడుతున్నారు. అందుకు ఊదాహరణే పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్ ఎంపికగా టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్లమెంటరీ పార్టీ నేత ఎంపిక విషయంలో అదేపార్టీ, అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఎంపీ బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక విపక్ష పార్టీకి లభించే పీఏసీ కమిటీ చైర్మన్ పదవి విషయంలో ఎటువంటి అసంతృప్తి బయటకు పొక్కకుండా అధినేత జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. కేబినెట్ ర్యాంకు హోదా కలిగిన పీఏసీ చైర్మన్ పదవి కోసం పార్టీలో పలువురు సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. సభా వ్యవహారాలపై అవగాహన, ప్రభుత్వం తీసుకునే ఆర్థిక నిర్ణయాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, తప్పొప్పులను ఎత్తి చూపే అవకాశం ఈ కమిటీకి ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పీఏసీ చైర్మన్ పదవి ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే సందర్భాలు కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో పీఏసీ చైర్మన్ పదవికి అనుభవజ్ఞుడైన ఎమ్మెల్యేను ఎంపిక చేయాలని అధినేత ఆలోచన. ప్రస్తుతం ఈ పదవి కోసం టీడీపీలో పలువురు పోటీ పడుతున్నప్పటికీ ప్రధానంగా రెండు సామాజిక వర్గాలతో పాటు బీసీ వర్గాల నుంచి ఎంపిక జరుగుతుందని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. సీనియర్ శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణ, పయ్యావుల కేశవ్ కమ్మ సామాజిక వర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఇప్పటికే పార్లమెంటరీ పార్టీలోనూ, టీడీఎల్పీలోనూ ఈ సామాజిక వర్గానికి పెద్దపీటే వేశారు. ఇక కాపు సామాజిక వర్గం నుంచి పదవి ఆశిస్తున్న వారిలో సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. ఒకసారి ఎంపీగా, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన గంటా దాదాపు ఎనిమిదేళ్ల కాలం మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఉంది. కాపు కోటాలో నిమ్మల రామానాయుడుకు టీడీఎల్పీలో పదవి లభించింది. ఇక బీసీ కోటాలో సీనియర్ ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు, పీజీవీఆర్ నాయుడు (గణబాబు) రేసులో ఉండగా, అచ్చెన్నాయుడు ఇప్పటికే టీడీఎల్పీలో పదవి పొందారు. ఇక మిగిలింది గణబాబు ఒక్కరే. గణబాబు కూడా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, ప్రభుత్వ విప్‌గా కూడా పనిచేశారు. అసెంబ్లీ నిబంధనలపై పూర్తి అవగాహన ఉన్న గణబాబుకు బీసీ కోటాలో పీఏసీ చైర్మన్ పదవి లభిస్తుందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. సమీకరణలు, ప్రాంతాల కూర్పులో ఎవరిని పీఏసీ పదవి వరిస్తుందన్నది త్వరలోనే తేలనుంది.