ఆంధ్రప్రదేశ్‌

ఎంపీల ఫిరాయింపుపై న్యాయ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 22: రాజ్యసభలో ఎంపీల ఫిరాయింపుపై న్యాయ పోరాటానికి దిగాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న దాడులను నియంత్రించాల్సిందిగా డీజీపీకి ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కక్ష సాధింపు ధోరణి, ప్రజావేదిక స్వాధీనం, కార్యకర్తలపై దాడులు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్ హాజరు కావటం తదితర పరిణామాలపై పార్టీ నేతలు శనివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి వివరించారు. అనంతరం ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ రాజ్యసభలో బీజేపీకి తగిన మెజారిటీ లేనందునే ఇలాంటి కుతంత్రాలకు పాల్పడుతోందని ఆక్షేపించారు. మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఏ విధంగా చూసినా నలుగురు ఎంపీల విలీనం అనైతికం, అప్రజాస్వామిక మన్నారు. దీనిపై న్యాయపోరాటానికి అవసరమైన అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మాజీ సీఎం చంద్రబాబుకు సంబంధించిన సామగ్రిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రజావేదిక నుంచి బయటకు విసిరివేయటం దుర్మార్గమన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతిపక్ష నేత పట్ల ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగటం మంచి సాంప్రదాయం కాదన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండవల్లిలోని ప్రజావేదికను వినియోగించుకునేందుకు చంద్రబాబు రాసిన లేఖపై కనీసం సమాధానం ఇవ్వకుండా స్వాధీనం పరచుకోవటం వేధింపుల్లో భాగమే అన్నారు.
నీతివంతమైన పాలన అందిస్తామని ప్రజలను మభ్యపెడుతున్న బీజేపీ.. టీడీపీ ఎంపీలను పార్టీలో చేర్చుకోవటాన్ని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తప్పు పట్టారు. పార్టీలో చేర్చుకున్న రోజే వెబ్‌సైట్‌లో ఫిరాయింపు సభ్యులను బీజేపీ సభ్యులుగా మార్చటం బీజేపీ నైజానికి నిదర్శనమన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడినందునే చంద్రబాబును ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలుచేసిన రుణమాఫీ మిగిలిన కిస్తీలను వైకాపా ప్రభుత్వం విడుదల చేయాలని యనమల డిమాండ్ చేశారు. ప్రభుత్వం మారినా తమ ప్రాధామ్యాలను నెరవేర్చుతూనే గత ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను కొనసాగించాలనేది ఆనవాయితీగా వస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలను తిప్పికొట్టాలని మాజీమంత్రి కొల్లు రవీంద్ర కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు కలలుగంటున్నట్లుగా టీడీపీ మునిగిపోయే పడవ కానే కాదన్నారు. వైకాపా అధికారం చేపట్టిన తరువాత టీడీపీ కేడర్‌పై దాడులను ప్రేరేపిస్తోందని గ్రామాల్లో పార్టీ నాయకులపై కక్షసాధింపులు అధికమయ్యాయని ఈ అంశాలపై డీజీపీని కలసి ఫిర్యాదు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అగ్రవర్ణ వైకాపా నేతలు దళితులపై సాగిస్తున్న దాడులను టీడీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ఖండించారు. విపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ఎలా కడతారో చూస్తామంటూ జలదీక్ష చేసిన సీఎం జగన్ నేడు అదే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి హాజరు కావటం ఆయన నిబద్దతకు నిదర్శనమని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, మద్దాలి గిరి, ఎమ్మెల్సీలు వీవీవీ చౌదరి, బాబూ రాజేంద్రప్రసాద్, అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేశ్, శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...సమావేశంలో పాల్గొన్న టీడీపీ ముఖ్య నేతలు