ఆంధ్రప్రదేశ్‌

ప్రజా ఉద్యమంతోనే ప్రత్యేక హోదా సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జూన్ 24: నవ్యాంద్రప్రదేశ్‌కు ఎంతో ముఖ్యమైన ప్రత్యేక హోదా సాధన ప్రజాఉద్యమాలతోనే సాధ్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా అనేది ఏపీ ప్రజల హక్కుగా తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ప్రజా ఉద్యమాలు ప్రారంభం కావాల్సిన అవసరం వచ్చిందన్నారు. ప్రజాఉద్యమం మొదలైతే దానిని ముందుకు తీసుకెళ్లడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. నవ్యాంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు మాట మార్చినా హోదా డిమాండ్‌కు ఆది నుండి కట్టుబడి ఉన్న ఒకే ఒక పార్టీ జనసేన మాత్రమే అన్నారు. హోదాపై మాటలు మార్చుతున్న నాయకులపై ప్రజలే ఎదురుతిరగాలన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వానికి ఇచ్చినట్లే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి కూడా కొంత సమయం ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ప్రజలకు సత్పలితాలు ఇచ్చే పథకాలు ప్రవేశపెడితే కచ్చితంగా హర్షిస్తానన్నారు. అలాగే ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటే ఏ స్థాయిలోనైనా పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన విధానంపై ప్రజలకు వివరణ తప్పకుండా ఇవ్వాలన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సున్నితమైన పరిష్కారించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నారు. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని క్షేత్ర స్థాయిలో అందరితో మాట్లాడి పార్టీ కార్యచరణ, ప్రణాళికతో కొద్ది నెలల్లో ముందుకు వస్తానన్నారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో అక్రమ కట్టడాలు కూల్చేయడం మంచి పరిణామమే, అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమకట్డడాలన్నింటిని కూల్చి వేయాలని పవన్‌కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇలా చేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సి ఉంటుందన్నారు. ఫలితాలు వచ్చి ఒక నెల రోజులు కూడా గడవక ముందే పార్టీలు మారడం దురదృష్ట కరమన్నారు. పరిస్థితులు ఎమిటో అంచనా వేయడం కష్టంగా ఉన్నాయన్నారు. అది ఆయా పార్టీల ఇష్టమన్నారు. తన పార్టీ నుండి నేతలు మారుతున్నారనే సమాచారం తన వద్ద లేదన్నారు. నాయకులు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది తనతో పార్టీ నేతలతో చర్చించవచ్చనన్నారు. పార్టీలో చేరడం వేరు...్ఫరాయింపులు వేరు అని తెలిపారు. జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామన్నారు. జమిలి ఎన్నికలు వస్తే తమ పార్టీ సిద్ధంగానే ఉందన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కావడానికి ఇదే అనువైన సమయమన్నారు. ఇందుకోసమే రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసినట్లు పవన్‌కళ్యాణ్ వివరించారు.
పార్టీకి సేవ చేసిన అందరినీ త్వరలోనే కలుస్తా
ప్రధానమైన ఏడు కమిటీల ఏర్పాటు
పదవులను ఆశించకుండా...పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరితోనూ త్వరలోనే భేటీ కానున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. పార్టీకి అపారమైన క్యాడర్ ఉన్నప్పటికీ అందులో అనుభవం ఉన్న వారు తక్కువగా ఉన్నారన్నారు. అభిమానులే పార్టీకి బలం అన్నారు. వారిలోని ఉద్వేగాన్ని పార్టీకి ఉపయోగపడేలా మార్చు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఓటమి తరువాత వస్తున్న నిందాపూర్వక విమర్శలను అందరూ ముక్తకంఠంతో తిప్పికొట్టాలని సూచించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం పార్టీ ముఖ్యనేతలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పార్టీలో అనుభవం ఉన్న వారు తక్కువగా ఉండటంతోనే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయలేదన్నారు. అనుభవం ఉన్న వారు ఇప్పుడు తోడు కావడంతో పార్టీకి పూర్తి స్థాయి కమిటీలను నియమిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు అందరూ కష్టపడి పని చేయాలన్నారు.
పార్టీ ఏర్పాటు చేయడమే తనకు ఒక తపస్సు లాంటిదని, కడవరకు పార్టీని ముందుకు తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన అది పూర్తి అయిన తరువాత స్థానిక కమిటీల నిర్మాణం చేపడతామాన్నరు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను ఒక్కసారి కూడా ప్రచారం చేయకపోయినా, తనకు సంతృప్తిని ఇచ్చే రీతిలో ఓట్లు వచ్చాయన్నారు. పార్టీ నిర్మాణ సమయంలో పాటు దానిని ముందుకు తీసుకు వెళ్లడం ఎంత కష్టమో అందరికీతెలుసన్నారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనేతలు వారి వారి అభిప్రాయాలను పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌తో పంచుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని ఇదే సమయంలో జనసేన పార్టీ రాష్ట్రానికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రజా సమస్యలపై ప్రణాళికా బద్ధమైన పోరాటాన్ని జనసేన పార్టీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో బలోపేతానికి తామంతా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు.
పార్టీ ముఖ్య కమిటీల ఏర్పాటు
జనసేన పార్టీకి సంబంధించిన అతి ముఖ్యమైన పార్టీ కమిటీలను పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. పార్టీకి సంబంధించి ఏడు కమిటీలను ఏర్పాటు చేసిన పవన్‌కళ్యాణ్ కమిటీల చైర్మన్‌లను ప్రకటించారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కమిటీ చైర్మన్‌గా తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ పి రామ్మోహన్‌రావు, కమిటీ ఫర్ మైనారిటీస్ చైర్మన్‌గా విద్యావేత్త అర్హంఖాన్‌ను, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా దళిత ఉద్యమనేత అప్పికట్ల భరత్‌భూషణ్‌ను ఎంపిక చేశారు. మహిళా సాధికారిత కమిటీ చైర్‌పర్సన్‌గా కర్నూలుకు చెందిన రేఖాగౌడ్‌ను నియమించారు. ప్రస్తుతం ఆమె వీర మహిళా విభాగం చైర్మన్‌గా ఉండగా ఆ బాధ్యతల నుండి మార్పు చేశారు. పార్టీ నిర్వహణ కమిటీ చైర్మన్‌గా జనరల్ సెక్రటరీ తోట చంద్రశేఖర్‌ను నియమించారు. పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ చైర్మన్‌గా చింతల పార్థసారధిని నియమించారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కమిటీ సభ్యులుగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పంతం నానాజీ, తాడేపల్లి గూడెంకు చెందిన బొలిశెట్టి శ్రీనివాస్, ధర్మవరానికి చెందిన చిలకం మధుసూదన్‌రెడ్డి, ముమ్మడివరానికి చెందిన పితాని బాలకృష్ణ, నరసరావుపేటకు చెందిన సయ్యద్ జిలాని, యలమంచిలికి చెందిన విజయ్‌కుమార్, కడపకు చెందిన సుంకర శ్రీనివాస్, పెడనకు చెందిన అంకెం లక్ష్మీశ్రీనివాస్, పలాసకు చెందిన కోత పూర్ణచంద్రరావు, జగ్గంపేటకు చెందిన పాటంశెట్టి సూర్యచంద్ర, ఒంగోలుకు చెందిన షేక్ రియజ్, పోలసపల్లి సరోజ, రాజమండ్రికి చెందిన వై శ్రీను, ఎచ్చెర్లకు చెందిన బాడన వెంకట జనార్ధన్, ప్రొద్దుటూరుకు చెందిన ఇంజా సోమశేఖర్‌రెడ్డిలను పవన్‌కళ్యాణ్ నియమించారు. మరికొన్ని కమిటీలను, ఆయా కమిటీలకు చెందిన సభ్యుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని పవన్‌కళ్యాణ్ పార్టీ నేతలకు వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, పి రామ్మహన్‌రావు, తోట చంద్రశేఖర్, వివి లక్ష్మీనారాయణ, చింతల పార్థసారథి, హరిప్రసాద్, పాలవలస యశస్వీనితో పాటు నేతలు పాల్గొన్నారు.