ఆంధ్రప్రదేశ్‌

భారత్‌తోనే ప్రపంచ శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 4: ప్రపంచంలో శాంతి, సుస్థిరత భారతదేశం ద్వారానే సాధ్యమవుతుందని, ప్రపంచ అగ్రరాజ్యాలు సమస్యల వలయంలోకి జారుకుంటున్న తరుణంలో అన్ని దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత ప్రతినిధి రవికుమార్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. గీతం డీమ్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ గాంధియన్ స్టడీస్ ఆధ్వర్యంలో జరిగిన గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం రక్షణ, ఆర్థిక, అంతరిక్ష, అణుశక్తి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తోందన్నారు. ప్రజాస్వామ్యం, అభివృద్ధి సమపాళ్లలో ముందుకు సాగుతున్నది ప్రపంచంలో ఒక్క భారత్‌లోనే అన్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన భారతీయ మేథావుల మీద వివిధ దేశాల ప్రగతి ఆధారపడి ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో భారతదేశం తన మేథస్సుతో ప్రపంచాన్ని ఏలుతుందని, చైనా వంటి దేశాలు ఎన్ని కుతంత్రాలు చేసినా భారత్ ముందు నిలవలేవన్నారు. భారతదేశానికి రెండువేల ఏళ్ల సంస్కృతి ఉందని, భారతదేశ మేథావులు గణిత శాస్త్రాన్ని కనిపెట్టిన మూలపురుషులని కొనియాడారు. స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ, భారతదేశాన్ని సముచిత స్థాయికి తీసుకువెళ్లారన్నారు. భారతదేశాన్ని అగ్రరాజ్యంగా చూడాలనేది ప్రపంచంలోని పలు దేశాల ఆకాంక్షగాని, తద్వారా విశ్వశాంతి సాధ్యపడుతుందన్న నమ్మకం ఉందన్నారు. కార్యక్రమంలో గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ గౌతమ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

నేడు డయల్ యువర్ ఈఓ రద్దు
తిరుపతి, జూలై 4: పరిపాలనాపరమైన కారణాల వల్ల శుక్రవారం నిర్వహించాల్సిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు టీటీడీ పిఆర్వో రవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు ఈవిషయాన్ని గమనించాలని ఆయన కోరారు.
కుప్పకూలిన భారీ వృక్షం
మహిళ మృతి
ఏలూరు, జూలై 4: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో వందేళ్ల నాటి భారీ రావి చెట్టు (పెరుగు చెట్టు) గురువారం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందింది. వివరాలిలావున్నాయి... ఏలూరు అగ్రహారంలో సుమారు వందేళ్లుగా ఒక భారీ రావిచెట్టు ఉంది. గతంలో ఏలూరు పరిసర ప్రాంతాల నుండి పలువురు చిరువ్యాపారులు పెరుగు, పాలు తెచ్చి, ఇక్కడ విక్రయించేవారు. ఆవిధంగా పెరుగు చెట్టు సెంటర్‌గా ఆ ప్రాంతం ప్రాచుర్యం చెందింది. ఏం జరిగిందో ఏమో గురువారం ఒక్కసారిగా భారీ వృక్షం కుప్పకూలింది. అదే సమయంలో అక్కడ చిత్తు కాగితాలు ఏరుకుంటున్న రమణమ్మ అనే మహిళపై చెట్టు పడటంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అయితే ఈ చెట్టు కూలిపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జడ్పీ ప్రత్యేకాధికారులుగా కలెక్టర్లు
* ఉత్తర్వులు జారీ

విజయవాడ, జూలై 4: రాష్ట్రంలోని వివిధ జిల్లా ప్రజా పరిషత్‌లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ల పదవీ కాలం గురువారంతో ముగియడంతో ప్రత్యేకాధికారులుగా ఆయా జిల్లాల కలెక్టర్లను నియమించింది. శుక్రవారం నుంచి ఆరు నెలల పాటు ప్రత్యేకాధికారుల పాలనను విధించింది.
తలనీలాల విక్రయం ద్వారా
టీటీడీకి రూ.6.01 కోట్ల ఆదాయం
తిరుపతి, జూలై 4: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు సమర్పించిన తలనీలాల్లో 76,500 కిలోలు గురువారం ఈ-వేలం ద్వారా అమ్ముడుపోవడంతో టీటీడీకి రూ. 6.01 కోట్ల ఆదాయం లభించింది. ఇందులో మొదటిరకం తలనీలాల్లో బి కేటగిరికి చెందిన 200 కిలోలు అమ్ముడుపోగా రూ. 36.66 లక్షలు ఆదాయం లభించింది. రెండోరకం తలనీలాల్లో ఏ కేటగిరికి చెందిన 1500 కిలోలు అమ్ముడుపోయి రూ. 267.21 లక్షలు, బి కేటగిరిలో 2,100 కిలోలు అమ్ముడై రూ.180.76 లక్షలు ఆదాయం సమకూరింది. మూడోరకంలో ఏ కేటగిరికి చెందిన 1400 కిలోలు అమ్ముడుపోయి రూ. 84.65 లక్షలు, నాలుగో రకంలో 300 కిలోలు అమ్ముడుపోయి రూ. 5.40 లక్షలు, ఐదోరకం తలనీలాలు 71వేల కిలోలు అమ్ముపోయి రూ. 27 లక్షలు ఆదాయం లభించింది.
డ్రోన్ కెమెరాల నిఘాలో
సీఎం జగన్ నివాసం

విజయవాడ, జూలై 4: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాహ గృహానికి సందర్శకుల తాకిడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తాడేపల్లిలోని నివాస గృహం వద్ద భద్రతను గణనీయంగా పెంచారు. ప్రధానంగా సందర్శకుల రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ నివాసం పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రోజూ వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో అర్జీదారులు వస్తున్నారు. సీఎం కాన్వాయ్ వెలుపలకు వెళ్లే సమయంలో పరిసరాల్లో వివిధ సమస్యలపై ఆందోళనకారులు నినాదాలు చేస్తుండటాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని డ్రోన్ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. పోలీసులు సీఎం నివాసం చుట్టూ 200 మీటర్ల ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాలతో పహరా కాస్తున్నారు.
మళ్లీ సొంత జిల్లాలకు తహశీల్దార్లు

విజయవాడ, జూలై 4: సాధారణ ఎన్నికల నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా పొరుగు జిల్లాలకు బదిలీ అయిన దాదాపు 700 మంది తహశీల్దార్లను తిరిగి వారి వారి జిల్లాలకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎం అంజిప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డాక్టర్ మన్మోహన్‌సింగ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
వంద కోట్ల మొక్కలు
నాటడం లక్ష్యం
* 12,751 పంచాయతీల్లో నర్సరీలు * సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్

ఖమ్మం, జూలై 4: తెలంగాణలో హరితహారం ఐదవ విడతలో భాగంగా రాష్ట్రంలో వందకోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో 12,751గ్రామ పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. గురువారం ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నర్సరీలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీల పెంపకంపై సంతృప్తి వ్యక్తం చేసి మాట్లాడుతూ వర్షాలు ప్రారంభం కాగానే మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మన ఊరు - మన నర్సరీ పేరుతో ఈ ఏడాది నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీని పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, ఈ నర్సరీలలో వందకోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో భాగస్వామ్యులై మొక్కలు నాటాలన్నారు. కాగా ఈ మొక్కలలో గృహ అవసరాలకు అవసరమైన మొక్కలతో పాటు రైతులకు అవసరమైన మొక్కలు కూడా ఉన్నాయన్నారు. సింగరేణితో పాటు అన్ని శాఖలను సమన్వయం చేసి మొక్కలు నాటడమే కాకుండా అవి పెద్దవయ్యేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ సంవత్సరం నర్సరీలలో పెంచుతున్న మొక్కలలో పూర్తిగా ఎదగని వాటిని వచ్చే సంవత్సరం హరితహారం కార్యక్రమంలో నాటేందుకు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రాష్టవ్య్రాప్తంగా అన్నిచోట్ల నర్సరీలలో మొక్కలు చాలా బాగున్నాయని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. వర్షాలు ప్రారంభం కాగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేసారి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, డిఎఫ్‌ఓ ప్రవీణ, డీఆర్‌డీఏ పీడీ ఇందుమతి పాల్గొన్నారు.