ఆంధ్రప్రదేశ్‌

కోడెల కథ కంచికేనా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 8: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గత ఎన్నికల్లో ఓటమి తరువాత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ఆయన పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. అయితే స్పీకర్‌గా గత ఐదేళ్ల పదవీకాలంలో మునుపెన్నడూ లేనివిధంగా కుటుంబ సభ్యులు చేసిన తప్పిదాలకు నేడు టీడీపీలో ఆయన కథ కంచికి చేరిందా అనిపించేలా ఒకవైపు కేసులు, మరోవైపు తీవ్రమైన ఆరోపణలు రేగుతున్నాయి. టీడీపీకి అన్నివేళలా వెన్నుదన్నుగా నిలిచిన కోడెల నేడు అదే పార్టీలో ఏకాకిగా మిగిలే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 37ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు చవిచూసిన కోడెల నేడు మాత్రం అంతకుమించిన విమర్శలను అటు అధికార పార్టీ, ఇటు సొంత పార్టీ నుండే ఎదుర్కొంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాభవంతో ఇప్పటికే కుంగిపోయి ఉన్న టీడీపీ అధిష్టానానికి కోడెల కుంటుంబంపై ప్రతీరోజు వస్తున్న ఆరోపణలను ఖండించటం, ఆయనను వెనకేసుకు రాలేని పరిస్థితి ఏర్పడింది. స్పీకర్‌గా పనిచేసిన ఐదేళ్ల కాలంలో తన నియోజకవర్గం సత్తెనపల్లిని అన్నివిధాలా అభివృద్ధి చేసినప్పటికీ కుమారుడు శివరామ్, కుమార్తె పాల్పడిన దందాలు, అవినీతి కారణంగా నేడు సొంత పార్టీ నేతలు కూడా ఆయనతో కలిసిరాని పరిస్థితి నెలకొంది. ఎన్నికల ఫలితాల అనంతరం కోడెల కుటుంబంపై సత్తెనపల్లి నియోజకవర్గంతో పాటు పక్క నియోజకవర్గాల నుండి, ఇతర పార్టీలు సహా సొంత పార్టీ కార్యకర్తల నుండి కూడా ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువలా చుట్టుముడుతున్నాయి. ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గంలో సమీక్షించుకునే పరిస్థితి కూడా లేని స్థితికి కోడెల వ్యక్తిగత ఇమేజ్ దిగజారింది. కోడెల పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తే తాము వచ్చేదే లేదంటూ టీడీపీ నేతలు భీష్మించుక్కూర్చున్నారంటే సొంత నియోజకవర్గంలోనే ఆయన పరిస్థితి ఎలా మారిందో ఇట్టే అర్థమవుతుంది.
ఇక కోడెల కుంటుంబాన్ని మొదటి నుండి టార్గెట్ చేస్తూ వస్తున్న వైసీపీ గత ఎన్నికల్లో గెలిచిన నాటి నుండి ఆరోపణలకు మరింత పదును పెట్టడంతో పాటు కోడెల కుటుంబం వల్ల బాధితులుగా మారిన ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తూ వారితో పోలీసు కేసులు కూడా పెట్టిస్తోంది. తనపై, కుటుంబంపై ఒక్కొక్కటిగా చుట్టుకొస్తున్న ఆరోపణలు, కేసులపై తానొక్కడినే సమాధానం చెప్పుకునే పరిస్థితి కోడెలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టీడీపీలో అత్యంత సీనియర్ నేతగా ఉన్న కోడెలకు అటు పార్టీ అధిష్టానం గానీ, సహచర సీనియర్ నేతలు గానీ అండగా నిలవటం లేదు. కోడెలను స్పీకర్ పదవి వరించిన నాటి నుండే ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రమైన ఆరోపణలు వచ్చిన సందర్భంలో స్పందించిన టీడీపీ నేతలు, నాయకులు ప్రస్తుతం వౌనవ్రతం దాల్చారు. సార్వత్రిక ఎన్నికలపుడు టిక్కెట్ల కేటాయింపు సందర్భంలోనూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విషమ పరీక్షను ఎదుర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కోడెలకు సత్తెనపల్లి అసెంబ్లీ టిక్కెట్టు కేటాయించ వద్దంటూ పెద్దఎత్తున నియోజకవర్గ నేతలు చంద్రబాబును కలవడంతో పాటు ఆందోళనలు కూడా చేశారు. సత్తెనపల్లిలోని వాస్తవ పరిస్థితులు అధినేతకు తెలిసనప్పటికీ సీనియర్ నేతగా కోడెలపై ఉన్న అభిమానంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులను కాదని ఆయన టిక్కెట్ కేటాయించారు. సత్తనపల్లి టిక్కెట్‌పై బాబు పలు దఫాలుగా ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ కోడెల పట్టుబట్టి మరీ పోటీకి దిగారు. అప్పటికే నియోజకవర్గంలో విసిగిపోయి ఉన్న ప్రజలు, సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కోడెలకు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఓటమి చెందిన కోడెల స్థాయి ఎన్నికల ఫలితాల అనంతరం మరింతగా దిగజారిపోయింది. ప్రస్తుతం సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే కోడెల కుటుంబంపై కేసులు పెట్టే పరిస్థితికి వచ్చింది. కుమార్తె, కుమారుడి అక్రమాలు తెలిసి కూడా నిలువరించక పోవడంపై ఇప్పుడు టీడీపీలో తీవ్రమైన చర్చ సాగుతోంది. పైగా వారి అక్రమాలను సమర్ధించి వెనకేసుకు రావడంపై పార్టీ అధినేత కూడా గుర్రుగా ఉన్నారు. తనకు అత్యంత పట్టున్న సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో ప్రస్తుతం కోడెలను పలకరించేవారే కరవయ్యారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న టీడీపీ అధిష్టానం ఇప్పటికే కోడెలకు పార్టీలో ప్రాధాన్యత తగ్గించింది. పొమ్మనక ఆయనకు పొగబెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.