ఆంధ్రప్రదేశ్‌

ఇంగ్లీషు మీడియం ప్రభావంపై అధ్యయనం ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 16: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పిల్లలపై ఇంగ్లీషు మీడియం ప్రభావం ఎలా ఉందన్న అంశంపై అధ్యయనం ఏదైనా చేశారా అని ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. రాష్ట్ర శాసన మండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో బోధనా మాధ్యమంగా ఇంగ్లీషును ప్రవేశపెట్టనున్నారా అని సభ్యులు విఠపు బాల సుబ్రహ్మణ్యం, కేఎస్ లక్ష్మణరావు, చిక్కాల రామచంద్రరావు ప్రశ్న వేశారు. దీనిపై విఠపు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారి సంఖ్య 39 లక్షలు కాగా, అందులో 11.37 లక్షల మంది పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుతున్నారని తెలిపారు. మిగిలిన 29 లక్షల మంది విద్యార్థులూ తెలుగు మీడియంలో చదువుతున్నారని గుర్తు చేశారు. మొత్తం పాఠశాలలను ఇంగ్లీషు మీడియంగా మారుస్తారా? తెలుగు మీడియం ఉండదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చదువుతున్న పిల్లలపై ఏదైనా అధ్యయనం చేశారా అని ప్రశ్నించారు. ఒక అధ్యయనం ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 10 మందిలో 9 మందికి ఇంగ్లీషు చదవడం రాదని వైల్లడైందన్నారు.
బాగా ఉన్న తెలుగు మీడియం స్కూళ్ల కన్నా, బాగాలేని ఇంగ్లీషు మీడియం స్కూళ్లు సాధించిందేమీ లేదని మరో అధ్యయనంలో తేలిందని వివరించారు. రాష్ట్రంలో ప్రాథమిక విద్య తెలుగు మీడియంలో చేసి, దశల వారీగా ఇంగ్లీషు మీడియంలోకి తీసుకురావాలని సూచించారు. జిల్లా పరిషత్ ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని, ఇంగ్లీషు మీడియం కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించాలని, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయ బదిలీల్లో కలగాపులగం చేయకుండా చూడాలన్నారు. టీడీపీ సభ్యుడు ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం ఇంగ్లీషు మీడియంలో బోధనకు 30 వేల మంది ఉపాధ్యాయులు అవసరమని, ఇంగ్లీషును ఒక కమ్యూనికేషన్ సబ్జెక్ట్‌గా బోధించాలని, సంస్కృతం కూడా నేర్పాలన్నారు. బీజేపీ సభ్యుడు మాధవ్ మాట్లాడుతూ ఇంగ్లీషును బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయవద్దన్నారు. తెలుగును బతికించాలని, పరిపాలనా భాషగా మార్చాలన్నారు. నేరుగా పాఠశాల విద్యలో ఇంగ్లీషు మీడియం అమలు చేస్తే, అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని టీడీపీ సభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారుతున్న తరుణంలో ఇంగ్లీషు మీడియం లేకపోతే భవిష్యత్తు లేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఎలా అమలు చేయాలన్న అంశంపై చర్చిస్తున్నామన్నారు. జిల్లాకు 40 మంది ఉపాధ్యాయులకు సీఫెల్ వంటి సంస్థల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 50 శాతం ఉపాధ్యాయ ఖాళీలను గ్రాడ్యుయేషన్ వరకూ ఇంగ్లీషు మీడియంలో చదివిన వారితో భర్తీ చేయనున్నామన్నారు. 35 శాతం పాఠశాలల్లో తెలుగు మీడియం ఉందని, సమాంతరంగా రెండు మీడియాల్లో తరగతులు నిర్వహిస్తామన్నారు. ఇంగ్లీషును నిర్లక్ష్యం చేయలేమని, ప్రభుత్వ పాఠశాలల్లో దీని వల్ల ప్రవేశాలు పెరిగాయని గుర్తు చేశారు.