ఆంధ్రప్రదేశ్‌

అమరావతిపై ప్రభుత్వ వైఖరి ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), జూలై 18: వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత రాజధాని నిర్మాణ పనులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయని తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు మద్దాల గిరి పేర్కొన్నారు. అసలు రాజధాని నిర్మాణం జరుగుతుందో లేదో....రాజధాని ఇక్కడ ఉంటుందో లేదో అనే అనుమానాలు, అపోహలు రాష్ట్ర ప్రజల్లో ప్రస్తుతం నెలకొన్నాయన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆరోరోజు గురువారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే గిరి రాజధాని ప్రాంతంలో సీఆర్‌డీఏ కార్యకలాపాలపై ప్రశ్నించారు. గత ప్రభుత్వం రాజధానిలో 35 వేల కోట్ల రూపాయల పనులను ప్రారంభించిందన్నారు. ఈ పనుల్లో వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని, ఎన్నికల ఫలితాల వరకు రాజధాని పనులు శరవేగంగా జరిగాయన్నారు. అయితే గత రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో పనులు ఎక్కడవి అక్కడే నిలిచిపోయాయని సభ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఆంధ్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజధాని నిర్మాణానికి కేవలం 500 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించడం దారుణమన్నారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని, ఇప్పుడు అది ప్రభుత్వ ఆస్తి అయ్యిందన్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం దాని విలువ సుమారు లక్ష కోట్లకు పైగానే ఉంటుదన్నారు. ఎక్కడో 600 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును చూసి వచ్చిన సీఎం జగన్ రాజధాని ప్రాంతంలో మాత్రం ఒక్కసారి కూడా పర్యటించలేదని, అలాగే పనులు పురోగతిని కూడా చూడలేదన్నారు. ఈ కారణాలతోనే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికి ఎన్నో అనుమానాలు, అపోహలు తలెత్తుతున్నాయన్నారు. దీనిపై తక్షణం స్పందించి ప్రభుత్వం అమరావతి నిర్మాణంపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ అంతర్జాతీయ రాజధాని నిర్మిస్తాను అంటూ చెప్పిన చంద్రబాబు రాజధాని నిర్మాణంలో అంతర్జాతీయ అవినీతి చేశారని ఆరోపించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయగా, వైసీపీ ఎమ్మెల్యేలు పోటీగా నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ తమ్మినేని.. ఎమ్మెల్యే శ్రీదేవి ప్రసంగాన్ని నిలిపి వేసి కూర్చోమన్నారు. అనంతరం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో రాజధానికి కేటాయించింది నామమాత్రపు నిధులే అంటూ చెప్పారు. మధ్యలో కలుగజెసుకున్న టీడీపీ సభ్యులు ఆర్కే ప్రసంగానికి అడ్డుతగులు సభలో రెండు విధాలైన నిబంధనలు పాటిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం కల్పించడం లేదు గానీ, అధికార పక్ష సభ్యులకు ఒకటికి రెండు సార్లు మాట్లాడే అవకశాం కల్పించడం ఎంత వరకు న్యాయమంటూ టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు స్పీకర్ తమ్మినేని దృష్టికి తీసుకువచ్చారు. మరో టీడీపీ శాసన సభ్యుడు జోగారావు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలంటూ సభలో నిల్చుంటూ నిరసన తెలిపారు. తాను ప్రశ్న వేసినందున తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని లేని పక్షంలో నిరసనగా తాను వాకౌట్ చేస్తానన్నారు. తప్పకుండా మాట్లాడే అవకాశం కల్పిస్తానంటూ స్పీకర్ తమ్మినేని సర్దిచెప్పారు. రాజధాని ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు అయినందున శ్రీదేవికి, ఆర్కేకు మాట్లాడే అవకాశం తన విచక్షణతో ఇచ్చానంటూ స్పీకర్ తమ్మినేని సమాధానం చెప్పుకున్నారు. చివరగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ మాట్లాడుతూ రాజధాని పరిధిలో సీఆర్‌డీఏ నేతృత్వంలో సుమారు 35 వేల కోట్ల రూపాయల పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. వివిధ దశలో ఉన్న పనుల్లో కేవలం 10 పనులు మాత్రం 50 శాతం, మరికొన్ని 25 శాతంగా ఉన్నాయన్న ఆయన అసలు కొన్ని పనులు ప్రారంభ కాలేదన్నారు. అయితే రాజధాని ప్రాంతం, సేకరించిన భూములపై మొదటి నుండి ఎన్నో ఆరోపణలు, అనుమానాలు ఉన్నాయన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సి ఉందన్నారు. దీనిలో భాగంగానే ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీతో పాటు టెక్నికల్ కమిటీని కూడా నియమించిందన్నారు.
ప్రస్తుతం కమిటీలు విచారణ జరుపుతున్నాయని, పూర్తి స్థాయిలో నిజాలు నిగ్గు తేలాల్సి ఉందన్నారు. రాజధాని ప్రాంతాన్ని సీఎం రోజూ చూస్తూనే ఉన్నారని, రాజధాని ప్రాంతంలో చెట్లు, పుట్టలు తప్పించి మరేవీ లేవన్నారు. ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో గర్వించదగ్గ రాజధానిని నిర్మిస్తామన్నారు. ఇందులో ఎవ్వరూ సందేహ పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజధాని కోసం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కేటాయించింది కేవలం 1105 కోట్లు మాత్రమేనన్నారు. గత ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 232 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. కానీ అభివృద్ది, సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఇప్పటి ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో 500 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు.