ఆంధ్రప్రదేశ్‌

యూపీఏ అవినీతి పాలన వల్లే బీజేపీకి అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూలై 20: యూపీఏ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడంతో దేశంలో మంచి పరిపాలన కావాలనుకుని ప్రజలు బీజేపీకి అవకాశం ఇచ్చారని ఆ పార్టీ జాతీయ మహిళా మోర్చా ఇన్‌ఛార్జి దగ్గుపాటి పురంధ్రీశ్వరి అన్నారు. శనివారం ఆమె బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వచ్చారు. ఈ సందర్భంగా కిరాణా మర్చంట్ అసోసియేషన్ బిల్డింగ్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. యూపీఏ పాలనలో భారతదేశం అవినీతి మయంగా మారిందని, అందుకే ప్రజలు బీజేపీకి అవకాశం ఇచ్చారని అన్నారు. 2014 నుంచి 2019 వరకూ ప్రధాని నరేంద్ర మోదీ పాలన చూసి దేశ ప్రజలంతా పూర్తి నమ్మకంతో తిరిగి 2019లో బీజేపీకి అత్యధిక స్థానాలతో కేంద్రంలో అధికారం అప్పగించారన్నారు. 2014లో దేశంలో ఉన్న ప్రతీ పేదవానికీ సంక్షేమ ఫలాలు అందించి, అవినీతి రహిత పాలన ద్వారా మోదీ ప్రజాభిమానాన్ని, విశ్వాసాన్ని పొందారన్నారు. మోదీ పాలనపై పూర్తి విశ్వాసంతోనే ఈ రోజు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బీజేపీ సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం అడ్డుగోలుగా ఎలా విభజన చేసిందో ప్రతి ఒక్కరూ చూశారన్నారు. అయితే 2014లో బీజేపీకి మిత్ర పక్షమైన టీడీపీ ఏపీలో అధికారంలో ఉండగా ప్రధాని మోదీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని, అయితే దానికి తగ్గట్టుగా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి నిధులు ఇస్తామని చెప్పడంతో అప్పట్లో చంద్రబాబునాయుడు దానికి సమ్మతించారని గుర్తుచేశారు. అయితే చంద్రబాబునాయుడు నిధులు తీసుకుని రెండేళ్లు గడిచిన తరువాత తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై నెపం నెట్టి మాట మార్చారన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నీ లెక్కచెప్పమంటే తన అవినీతి ఎక్కడ బయట పడుతుందోనని బీజేపీపై ఎదురుదాడికి దిగారని, ఇది రాష్ట్ర ప్రజలంతా గమనించి ఆయనను గద్దె దించారన్నారు. బీజేపీ ప్రభుత్వం మాట తప్పని పార్టీ అని, అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెబుతున్నారని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని, దానికి తగ్గట్టుగా రాష్ట్భ్రావృద్ధి కోసం ప్రత్యేక నిధులు ఇవ్వడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గమనించాలన్నారు. గత ముఖ్యమంత్రిలా రానిదానికోసం పట్టుపట్టేకంటే వచ్చిన నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలని పురంధ్రీశ్వరి హితవు పలికారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావం తీవ్రతరంగా ఉన్నందున గోదావరి జలాలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే ముందు ఏపీ రాష్ట్రంలో రైతులు, ప్రజాభిప్రాయాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుని ఉంటే బాగుండేదన్నారు. విశాఖపట్నంలో ఒక వ్యక్తి రాసిన ఉత్తరాన్ని ఆధారంగా చేసుకుని అక్కడ పోలీసులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ప్రశాంతమైన వాతావరణం ఉన్న విశాఖపట్నంలో ఇటువంటి మత కల్లోలాలు రేపి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయడం సరైన పద్ధతి కాదన్నారు. అనంతరం అమలాపురం పురపాలక సంఘం పరిధిలో 23 వార్డుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పురంధ్రీశ్వరి పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఏ మాలకొండయ్య, రాష్ట్ర కార్యదర్శి మానేపల్లి అయ్యాజీ వేమా, వేటుకూరి సూర్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్వీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...విలేఖర్లతో మాట్లాడుతున్న పురంధ్రీశ్వరీ