ఆంధ్రప్రదేశ్‌

నాటి జన్మభూమి కమిటీలే నేటి వలంటీర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి : తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో పనిచేసిన జన్మభూమి కమిటీల మాదిరిగానే వైకాపా పాలనలో గ్రామ, సచివాలయ వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పేరుమార్పు తప్ప ఈ రెండు ప్రభుత్వాల విధానాలు ఒకటేనని విమర్శించారు. రాష్ట్రంలో వివిధ పథకాల అమలుకు కేంద్రం నిధులిస్తున్నా పేర్లు మార్చేసి తామే అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు.
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ పరిపాలన ఉన్నప్పటికీ లక్ష్యాలు ఒక్కటిగానే కొనసాగుతున్నాయన్నారు. కేంద్రం నుండి వచ్చే ప్రతీ పథకం పేరు మార్చేసి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు దగ్గరౌతున్నాయని, ఇది వారిని మోసగించడమేనని అన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నాయుడు కుటుంబం, బంధుప్రీతి, అరాచకం, అవినీతి పాలన సాగించారని కన్నా ఆరోపించారు. దీనిపై గత ఎన్నికల్లో ప్రచారం చేసి విజయం సాధించిన వైసీపీ కూడా గత ప్రభుత్వ తరహాలోనే విధానాలు రూపొందిస్తూ పథకాలు అమలు చేస్తోందని, రెండు ప్రభుత్వాలకు పెద్దగా తేడాలేదని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతోందని, ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నాటి జన్మభూమి కమిటీల మాదిరిగానే నేడు వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయం పేరుతో వలంటీర్లను ఎంపిక చేస్తోందని విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తూ నైతిక విలువలతో కూడిన పాలనను ప్రజలకు అందిస్తోందన్నారు.
అవినీతి రహిత పాలనే ప్రధాని మోదీ లక్ష్యమని, కులమతాలకు అతీతంగా దేశంలో పరిపాలన సాగిస్తోంది ఒక్క బీజెపీ మాత్రమేనని కన్నా వివరించారు.
2024లో మాదే అధికారం: సునీల్
2024 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రానుందని పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ సునిల్ దియోధర్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో ముఖ్యంగా కుల రాజకీయాలు, అవినీతి, కుటుంబ పాలన కొనసాగుతోందని, దీన్ని 5కోట్ల మంది ప్రజలు నిరసిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా ఏదోఒక కులానికి మాత్రమే న్యాయం జరుగుతోందని, 80శాతం మంది ఇతర కులాల వారికి అధికారం దక్కటం లేదన్నారు. అయితే బీజేపీ దేశంలోని 130కోట్ల మంది ప్రజల్ని కుటుంబ సభ్యులుగా చూస్తూ పాలన కొనసాగిస్తోందన్నారు.
నరేంద్ర మోదీ రెండుమార్లు ప్రధాని పీఠమెక్కినా ఆయన కుటుంబ సభ్యులెవరూ పార్టీలో, పరిపాలనలో జోక్యం చేసుకోలేదని ఉదహరించారు. అయితే గాంధీలు కుటుంబ పాలన సాగించి దేశ ప్రజల అభ్యున్నతిని విస్మరించారని విమర్శించారు.
ఏపీలో బాబు వస్తే జాబు వస్తుందని ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు కుమారునికి మాత్రమే ఉద్యోగమిచ్చి ప్రజలు, యువతను మోసగించారన్నారు. చివరకు నారా లోకేష్ ఉద్యోగాన్ని కూడా ప్రజలు ఊడగొట్టారని ఆయన ఎద్దేవా చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ.. ఇలా ప్రతి పదవిలోనూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పాలన ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతోందని విమర్శించారు. అసెంబ్లీ అభ్యర్థి ఎన్నికల సమయంలో 50కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నాడంటే అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆ సొమ్ము వారికి ఎక్కడి నుండి వస్తోందో ప్రజలు ప్రశ్నించాలని సూచించారు. కేంద్రం, రాష్ట్రం నుండి వచ్చే నిధులు, ఆదాయంలో కొంత ఖర్చుచేసి అధిక మొత్తం వారు అక్రమంగా దోచుకున్నదీ, లూటీ చేసి చేబుల్లో వేసుకున్నదేనని ఆరోపించారు. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ రానున్న కాలంలో ఏపీలో ప్రజాపాలన అందించనుందనే ధీమా వ్యక్తం చేశారు.
2014 ఎన్నికల్లో 17కోట్ల మంది తమ పవిత్రమైన ఓటు బీజేపీకి వేయగా, 2019 ఎన్నికల్లో 22కోట్ల మంది ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఓటేయటం పార్టీ బలానికి నిదర్శంగా చెప్పారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 25 లక్షల మందిని బీజెపీ కార్యకర్తలుగా చేర్పించటం లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సునిల్ దియోధర్ వివరించారు. అనంతరం రాష్ట్ర రేషన్ డీలర్ల అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి లీలామాధవరావు, తెనాలి ప్రాంత ప్రముఖ న్యాయవాది బొల్లిముంత విజయ్‌కుమార్, మరో 500 మంది పార్టీలో చేరగా పార్టీ కండువా కప్పి ఆయన సాదరంగా ఆహ్వానించారు.
కార్యక్రమంలో మహిళా మోర్చా జాతీయ ఇన్‌చార్జ్ పురంధ్రీశ్వరి, టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరావు, గుంటూరు పార్లమెంట్ ఇన్‌చార్జ్ వల్లూరి రాజేష్, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు యడ్లపాటి స్వరూపరాణి, పట్టణ అధ్యక్షుడు కాట్రగడ్డ విజయ్‌కుమార్, మండల అధ్యక్షుడు కొత్తపల్లి యోగానంద కిషోర్, జిల్లా ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు షేక్ బషీర్ పాల్గొన్నారు.

చిత్రం...తెనాలి సభలో మాట్లాడుతున్న బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ