ఆంధ్రప్రదేశ్‌

రాజధానిపై సభలో రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 22: రాజధాని అమరావతిపై శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. రాజధానికి రుణం మంజూరు చేసే ప్రతిపాదనను ప్రపంచబ్యాంకు ఉపసంహరించుకున్న అంశంపై అధికార పక్ష సభ్యులు చర్చ లేవనెత్తారు. దీనిపై ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడుతూ అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఫిర్యాదులు చేసిందని, రాజధానిలో పచ్చని పంట పొలాలు తగులబెట్టారని, అవినీతి జరుగుతోందని దుష్ప్రచారం చేశారంటూ ప్రపంచ బ్యాంక్‌కు వైకాపా పంపిన ఫిర్యాదు ప్రతులను సభలో ప్రదర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. పెట్టుబడులు వెనక్కు తగ్గటానికి వైకాపాయే కారణమన్నారు. దీంతో వివాదం చోటు చేసుకుంది. దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి వివరణ ఇచ్చారు. సభ్యులు పరస్పర ఆరోపణలకు దిగారు.
రాజధానిలో ప్రతి పనిని ప్యాకేజీగా వర్గీకరించి కట్ట కట్టుకుని దోచేశారని ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. 10 శాతం ఎక్కువగా కోట్ చేసిన నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి గంప గుత్తగా కాంట్రాక్ట్ అప్పగించారని, అందువల్లే ప్రపంచ బ్యాంక్ రుణ ప్రతిపాదనను ఉప సంహరించుకుందని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాదు కిలోమీటర్ రోడ్డుకు రూ. 32 కోట్లు అంచనావేసి ప్రజాధనం కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. ప్రపంచంలో ఏ నగరాన్ని అప్పుచేసి నిర్మించలేదని తెలిపారు. స్వతహాగా పారిశ్రామిక, విద్య, వైద్య రంగాల్లో ప్రగతి ద్వారా నగర స్వరూప, స్వభావాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని పేరుతో భూములు కాజేసి ప్రపంచ బ్యాంక్ రుణాలు, కేంద్ర నిధులు సేకరించి పెద్దఎత్తున అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. ప్రపంచ బ్యాంక్ ముందు నుంచే దీన్ని గుర్తించి పెట్టుబడికి వెనుకంజ వేసిందన్నారు. ఈ పరిస్థితుల్లో అమరావతి బాండ్ల పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం మరో దోపిడీకి తెరదించిందని ఆరోపించారు.
అన్ని ప్యాకేజీలు ఒకే ధరకు కట్టబెట్టటాన్ని కూడా ప్రపంచ బ్యాంక్ ఆక్షేపించిందని వివరించారు. అప్పుచేసి మరీ దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందిస్తూ తనకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. మంత్రి వివరణ ఇచ్చిన తరువాత మరోసారి మాట్లాడే వీలుండదని స్పీకర్ తేల్చి చెప్పి, సభలో బిల్లులు ప్రవేశపెట్టాల్సిందిగా మంత్రులకు సూచించారు. మంత్రులు శంకర్ నారాయణ, గుమ్మనూరు జయరాం వరుసగా బిల్లులను ప్రతిపాదిస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ఆరోపణలపై స్పందించాల్సిన అవసరంలేదా అని ప్రశ్నించారు. ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది శాసనసభా.. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయమా అంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్షం నోరు నొక్కుతున్నారంటూ ఆందోళనకు దిగారు. కొందరు ఎమ్మెల్యేలు స్పీకర్ కుర్చీ పక్కన, మరికొందరు పోడియం వద్దకు చేరుకుని నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.