ఆంధ్రప్రదేశ్‌

విత్తన పంపిణీపై మండలిలో వాడివేడి చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 23: విత్తన పంపిణీపై రాష్ట్ర శాసన మండలిలో మంగళవారం వాడివేడి చర్చ జరిగింది. విత్తన పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ ఎమ్మెల్సీలు ఆరోపించగా, విత్తనాలు సక్రమంగా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర శాసన మండలిలో విత్తన పంపిణీపై లఘు చర్చ సందర్భంగా టీడీపీ సభ్యురాలు పోతుల సునీత మాట్లాడుతూ రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారని, కానీ రైతులకు విత్తనాల సరఫరాలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన విత్తనాలు తెలంగాణకు తరలిపోతున్నాయని విమర్శించారు. గత ప్రభుత్వ హయంలో విత్తనాల కోసం రైతులు రోడ్లమీదకు రాలేదని గుర్తు చేశారు. టీడీపీ సభ్యుడు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ విత్తనాల కోసం క్యూ లైన్లలో నిలబడి రైతులు మరణించిన సందర్భాలు తమ ప్రభుత్వ హయంలో లేవన్నారు. విత్తనాల సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, విత్తనాల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడి చనిపోతున్నారని ఆరోపించారు. టీడీపీ సభ్యురాలు శమంతకమణి మాట్లాడుతూ రామరాజ్యం అంటే రైతులు చనిపోవడమా అని ప్రశ్నించారు. ఇప్పటికీ విత్తన సరఫరా సక్రమంగా జరగడం లేదన్నారు. విత్తన పంపిణీపై చర్చకే ఇన్ని రోజుల సమయం పట్టిందని, ఇంక సకాలంలో రైతులకు విత్తనాలు ఏమి సరఫరా చేస్తారంటూ వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డి తనకు కలలో కనిపించారని, రైతుల గురించి మాట్లాడవేమి అంటే ఈ అంశాన్ని ప్రస్తావించానని తెలిపారు. టీడీపీ సభ్యుడు దీపక్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల పేరుతో గ్రామాల్లో తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలు అరికట్టకుంటే మరింత మంది రైతులు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
రైతుల వద్ద ఉన్న శనగలను ప్రభుత్వం ప్రకటించిన మేరకు కొనుగోలు చేయాలని, రైతుల ఆత్మహత్యలు, విత్తనాల సరఫరాపై సభా సంఘాన్ని వేయాలని టీడీపీ సభ్యుడు బిటి నాయుడు డిమాండ్ చేశారు. బీజేపీ సభ్యుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ రైతుల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలన్నారు. ఉత్తరాంధ్రలో వరివిత్తనాల కొరత ఉందన్నారు. విత్తనాలను అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని పీడీఎఫ్ సభ్యుడు కత్తి నర్సింహారెడ్డి కోరారు. శాసన మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఖరీఫ్‌కు విత్తనాల సేకరణ మేలో జరుగుతుందని, మేలో ఎన్నికల కారణంగా విత్తనాల సరఫరాలో ఇబ్బంది ఎదురైందన్నారు. విత్తన సర్ట్ఫికెట్ ఏజన్సీలు సరిగా పని చేయడ లేదని, వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. అనంతరం ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విత్తన సేకరణ ప్రక్రియ జనవరిలో ప్రారంభం అవుతుందని, తమ ప్రభుత్వం వచ్చి 50 రోజులైందని గుర్తు చేశారు. అయినా తాము అధికారంలో ఉండటంతో తమను అడుగుతున్నారన్నారు. క్యూలో నిలబడి ఒక రైతు చనిపోయాడని టీడీపీ సభ్యులు చెబుతున్నారని, కానీ ఆ రైతు మూడు బస్తాలు తీసుకువెళ్లి, మళ్లీ గంట తరువాత వచ్చి అక్కడ పడిపోయాడని వివరించారు. ఆసుపత్రికి తరలించగా, అక్కడ చనిపోయాడని తెలిపారు. గత బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్‌లో 10 వేల కోట్ల రూపాయలు అధికంగా కేటాయించామన్నారు. విత్తనాలు సరఫరా చేసిన సంస్థలకు గత ప్రభుత్వం 461 కోట్ల రూపాయల మేర బకాయి పండిందన్నారు. 210 కోట్ల రూపాయల రాయితీతో 7.51 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రబీలో 4.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేశామన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి విత్తనాలు, ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని వివరించారు.
తెలంగాణకు విత్తనాలు తరలిపోవడం లేదని, అక్కడి నుంచి అవసరమైతే కొనుగోలు లేదా విక్రయాలు చేస్తుంటామని తెలిపారు. విత్తన సరఫరా ఏజన్సీలు తెలంగాణలో ఉన్నాయన్నారు. విత్తన సరఫరాకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, తమ ఎమ్మెల్యేలు ఏ తప్పు చేయలేదని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడం, రైతులకు బ్యాంక్‌లు రుణాలు ఇవ్వకపోవడం, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడం వంటి కారణాలతో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వ హయంలో అటువంటి దయనీయ పరిస్థితి రానీయమన్నారు. రైతు భరోసా, సున్నా వడ్డీకి రుణం వంటివి ఇవ్వనున్నట్లు తెలిపారు.
బొత్స, లోకేష్ మధ్య వాగ్వాదం
గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కింద 10 వేల కోట్ల రూపాయలు బ్యాంక్‌లకు ఇవ్వాలని మంత్రి అంటున్నారని, ఏ బ్యాంక్ చెప్పిందో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ ప్రశ్నించారు. మంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. మంత్రి బొత్స మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు వడ్డీ లేని రుణాల కింద 10,400 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, 642 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించిందని తెలిపారు. దీనిపై లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏ బ్యాంక్ చెప్పిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సున్నా వడ్డీకి వేల కోట్ల రూపాయలు అవసరమనే ప్రభుత్వం, బడ్జెట్‌లో కేవలం 100 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించడాన్ని తప్పుపట్టారు.