ఆంధ్రప్రదేశ్‌

సస్పెన్షన్లతో పోరాటాన్ని ఆపలేరు: అచె చన్నాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 23: సస్పెన్షన్లతో ప్రజా పోరాటాన్ని ఆపలేరని, ఎన్ని రోజులు సస్పెండ్ చేసినా పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామే తప్ప విరమించబోమని టీడీఎల్పీ ఉపనేత, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశానంతరం మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. జగన్ తాను అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక నోరు మెదపడం లేదని ఆరోపించారు. తమ ప్రశ్నలకు సమాధానం అడిగితే చెప్పలేక ఆవుకథలు చెప్తున్నారన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సీఎం జగన్ శాసనసభలో వీడియో క్లిప్పింగ్స్ ప్రదర్శించి కొత్త సాంప్రదాయాన్ని తెస్తున్నారని దుయ్యబట్టారు.
తాము కూడా సీఎం జగన్ ఇచ్చిన హామీలపై పెన్‌డ్రైవ్ తెచ్చి క్లిప్పింగ్స్ ప్రదర్శించాలని అడిగామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. జగన్మోహనరెడ్డి హామీల గురించి ప్రశ్నించిన తనతో పాటు తనకు సహకరించిన బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడులను కూడా శాసనసభ నుండి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలకు అర్థంకాని మేనిఫెస్టోను తయారు చేసి దానే్న అమలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని, తాము తెచ్చిన పెన్‌డ్రైవ్‌ను ప్రదర్శిస్తే ప్రజలను వైసీపీ ఎంత దగా చేస్తుందో అర్థమవుతుందన్నారు. తమ ప్రశ్నలకు సరైన సమాధానం కోసం నిరసన వ్యక్తం చేస్తూ సాంప్రదాయబద్ధంగా వాకౌట్ చేయాలనుకుంటే ఆ అవకాశం ఇవ్వకుండానే తమను సస్పెండ్ చేశారని అచ్చెన్నాయుడు ఆక్షేపించారు. ఈ సమావేశాల వేదికను శాసనసభ అనే కంటే రాష్ట్ర వైసీపీ కార్యాలయం అంటే బాగుంటుందని పేర్కొన్నారు.
సస్పెన్షన్‌కు కారణం చెప్పాలి: గోరంట్ల
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికే ఎక్కువ అవకాశం ఇవ్వాలని, కానీ ఈ రోజు శాసనసభ అపహాస్యం పాలైందని టీడీఎల్పీ ఉపనేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆవేదన వ్యక్తంచేశారు. తమను సస్పెండ్ చేయడానికి గల కారణాలను కూడా సభాముఖంగా చెప్పాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత మాటతప్పి, మడమ తిప్పి అడిగిన దానికి సమాధానం చెప్పలేక వైసీపీ పారిపోతోందన్నారు. శాసనసభలో నిరసన తెలిపే హక్కు సభ్యులందరికీ ఉంటుందని, కానీ కేవలం ముగ్గురిని సస్పెండ్ చేస్తే మిగిలిన 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సైనికులుగా పోరాడతారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు బూతులు తిడుతుంటే వారిని నియంత్రించలేక ప్రశ్నించిన తమను సస్పెండ్ చేస్తారా అని నిలదీశారు. గత ఐదేళ్లలో ఏ రోజు కూడా శాసనసభలోకి మార్షల్స్ రాలేదని, అయితే ప్రస్తుత సీఎం వీరిని గెంటేయండి, తోసేయండి అనే ఆదేశాలు ఇవ్వడం శాసనసభకు పట్టిన దౌర్భాగ్యంగా బుచ్చయ్యచౌదరి అభివర్ణించారు.
ఇది అసెంబ్లీనా? లోటస్ పాండా: రామానాయుడు
ఈ రోజు శాసనసభ జరిగిన తీరు చూస్తుంటే మనం శాసనసభలో ఉన్నామా, వైసీపీ కార్యాలయంలో ఉన్నామా, లేక లోటస్‌పాండ్‌లో ఉన్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. సభ నుంచి సస్పెండ్ చేసిన తరువాత అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సగం సమయాన్ని ప్రతిపక్షానికి కేటాయించడం సభా సాంప్రదాయమన్నారు. అయితే దీన్ని విస్మరించి శాసనసభ వైసీపీ సొంతసభ మాదిరిగా వారికి కావాల్సిన క్లిప్పింగ్స్ మాత్రమే ప్రదర్శిస్తూ, టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధం లేని అవాస్తవాలను చూపిస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు పర్చండి అని అడిగితే దాటవేస్తున్నారన్నారు. మేనిఫెస్టో అన్నది ఏ పార్టీకైనా ఓ పవిత్ర గ్రంథం వంటిదని, అయితే వైసీపీ మాత్రం మేనిఫెస్టోలో ఒక విధంగా, పార్టీ ప్రచార కరపత్రాల్లో మరోవిధంగా, ప్రజలకు చేసేది ఇంకో విధంగా ఉందని విమర్శించారు.
చిత్రం...అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు
అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు