ఆంధ్రప్రదేశ్‌

హామీలు నిలబెట్టుకోవాలని అడిగితే సస్పెన్షనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 23: ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రశ్నిస్తే వారిని సస్పెండ్ చేస్తారా అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. మంగళవారం మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ పాదయాత్రలో 255 హామీలతో పాటు మేనిఫెస్టోలో మరో 65 జోడించి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని టీడీపీ ఉపనేతలు ప్రశ్నిస్తే వారిని సస్పెండ్ చేసి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం బీసీలపై కపట ప్రేమ వొలకబోస్తుందని, బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే బడ్జెట్‌లో ఎందుకు నిధులు తగ్గించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లలో బీసీలకు 4,800 కోట్లు కేటాయించామని, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తీరని అన్యాయం జరిగిందని, చివరకు ఫెడరేషన్‌కు కుర్చీలు కూడా ఇవ్వలేదన్నారు. బీసీలు ఎప్పుడూ టీడీపీకి వెనె్నముక అని, బీసీల కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. టీడీపీ హయాంలోనే పుట్టస్వామి, మంజునాథ కమిషన్‌లు తీసుకువచ్చామని గుర్తుచేశారు. అన్నింటా రిజర్వేషన్లు అంటూ మాయమాటలు చెప్తున్నారని, దేవాదాయ శాఖలో రిజర్వేషన్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచామని, తమ హయాంలో ఇసుక కోసం ఎవరి దయా దాక్షిణ్యాలపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు గడవకముందే విపరీతంగా ధరలు పెరిగాయన్నారు. ట్రాక్టర్ ఇసుక ధర 1600 నుండి 6 వేలకు పెరిగిందని, దీంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కరవై రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల వేధింపులు అధికమయ్యాయని, ఆశావర్కర్లు, అంగన్‌వాడీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. హత్యా రాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్రంలో భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌వన్నీ తప్పుడు విధానాలేనని, రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. 24 వేల కోట్ల రుణమాఫీ చేసి తాము రైతులకు భరోసా కల్పించామని, జగన్ ప్రభుత్వం రుణమాఫీ విడుదల చేయకుండా రైతులకు అన్యాయం చేసిందన్నారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే రోజుకు ఐదారు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇది చూసి కూడా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దురదృష్టకరమన్నారు. వైసీపీ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే సభలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు