ఆంధ్రప్రదేశ్‌

నిర్లక్ష్యపు నీడలో కడప ఆకాశవాణి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: కడప ఆకాశవాణి కేంద్రం క్రమక్రమంగా నిర్వీర్యమవుతోంది. ఆకాశవాణిపై జిల్లా నాయకులకు ఏమాత్రం అవగాహన లేకపోవడంతో దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదనిపిస్తోంది. రాజకీయ నిర్లక్ష్యానికి గురైన కడప ఆకాశవాణి కేంద్రం క్రమక్రమంగా మసకబారుతోంది. ఒకప్పుడు కళాకారులు, సాహిత్యకారులు, 120 మంది ఉద్యోగులతో కళకళలాడిన ఆకాశవాణి కేంద్రం ఇప్పుడు నిర్మానుష్యంగా ఈసురోమంటోంది. తాజాగా ప్రసారభారతి ప్రారంభించిన ఆన్‌లైన్ మొబైల్ యాప్‌లో కడప ఆకాశవాణి కేంద్రాన్ని పక్కనపెట్టారు. దీని తర్వాత ప్రారంభమైన అనేక చిన్నచిన్న కేంద్రాలను యాప్‌లో చేర్చి కడప ఆకాశవాణిని విసిరికొట్టడం విస్మయం కలిగిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్, విజయవాడ ఆకాశవాణి కేంద్రాల తర్వాత ప్రారంభమైన కేంద్రం కడప. 1963 జూన్ 17న దీన్ని ప్రారంభించారు. విశాఖపట్టణం ఆకాశవాణి కేంద్రం కడప తర్వాత 1963 ఆగస్టు 4న ప్రారంభమైంది. కడప ఆకాశవాణి కేంద్రం ఫ్రీక్వెన్సీని 1963 నుంచి పెంచుతూ స్టాప్‌ను పెంచి గ్రేడ్ కూడా పెంచారు. 1993 నాటికి ఇక్కడ రేడియో స్టేషన్ డైరెక్టర్ కాక 120 మంది స్ట్ఫా ఉండేవారు. వీరిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒకరు, ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూటివ్స్ 9 మంది, పాడి పంటలకు సంబంధించిన ఫామ్ ఆఫీసర్ ఒకరు, అనౌన్సర్లు ఐదుగురు, నిలయ విద్వాంసులు ఆరుగురు, గ్రూప్ డీ పోస్టులు 21, ఒక డీఈ, నలుగురు ఏఈలు ఇతర స్ట్ఫా ఉండేవారు. ఇప్పుడు 40 మంది కూడా లేరు. గత 15 యేళ్ల నుండి రెగ్యులర్ స్టేషన్ డైరెక్టర్ లేరు. సీనియర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌నే ఇన్‌ఛార్జి స్టేషన్ డైరెక్టర్‌గా కొనసాగిస్తూవస్తున్నారు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ ఒకరు లేదా ఇద్దరు ఉంటున్నారు. శాశ్వత అనౌన్సర్లు లేరు. విభజన సమయంలో కడప ఆకాశవాణి కేంద్రాన్ని రాష్ట్ర ప్రసారభారతి కేంద్రంగా మార్చి దూరదర్శన్ విభాగాన్ని ఏర్పాటుచేయాలని ఇక్కడి రచయితలు, కళాకారులు డిమాండ్ చేశారు. వారి డిమాండ్ అరణ్యరోదనే అయింది. కడప ఆకాశవాణి నుంచి స్వయంగా వార్తాప్రసారాలు చేసే స్థాయి కల్పించాలని ఎప్పటి నుండో డిమాండ్ ఉన్నా, విశాఖపట్టణం ఆకాశవాణికి 2017లో ఆ ప్రతిపత్తి కల్పించారు. కడపను క్రమక్రమంగా నిర్లక్ష్యం చేస్తూనే వస్తున్నారు. తొలినుండి కోస్తాంధ్రప్రాంత వాసులే ప్రసారభారతిలో పెత్తనం చెలాయిస్తూ, కడపను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇక్కడ పోస్టులు కూడా రద్దయ్యేందుకు కారకులయ్యారనే విమర్శలున్నాయి. తాజాగా ఆకాశవాణి కేంద్రాల కార్యక్రమాలను మొబైల్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతలు వినేందుకు కల్పించిన సౌకర్యానికి కూడా కడప ఆకాశవాణిని దూరం చేశారు. దేశవ్యాప్తంగా 92 ఆకాశవాణి కేంద్రాలకు ప్రసారభారతి ఆన్‌లైన్ యాప్‌ను రూపొందించింది. ఆ 92 ఆకాశవాణి కేంద్రాల ప్రసారాలను ఒకే యాప్ ద్వారా విశ్వవ్యాప్తం అయ్యే అవకాశాలు కల్పించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, విశాఖపట్టణం, హైదరాబాద్ కేంద్రాలతోపాటు, కడప ఆకాశవాణి తర్వాత మూడు దశాబ్దాల అనంతరం ఏర్పాటైన తిరుపతి, కర్నూలు, అనంతపురం, ఆదిలాబాద్, వరంగల్ కేంద్రాలకు ఆన్‌లైన్ యాప్‌లో స్థానం కల్పించారు. విజయవాడ, విశాఖపట్టణం కేంద్రాలకు సాధారణ ప్రసారాలతోపాటు వాటి ఎఫ్‌ఎం కేంద్రాలకు కూడా యాప్ సౌకర్యం కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతలు తమ మొబైల్ ద్వారా ఈ రేడియో ప్రసారాలను లైవ్‌లో వినవచ్చు. కడప ఆకాశవాణి కేంద్రం 56 యేళ్లుగా వినూత్న కార్యక్రమాలకు పేరుగాంచింది. జానపద గేయాల ప్రసారం, నాటకాల రూపకల్పన ప్రసారాల్లో జాతీయ స్థాయి అవార్డులు పొందింది. 100 మెగావాట్ల సామర్థ్యంతో రెండు తెలుగురాష్ట్రాలకే కాకుండా ఢిల్లీ వంటి సుదూర ప్రాంతాలకు ప్రసారాలు అందించే కేంద్రంగా ఎదిగింది. కడప జిల్లా నుండి వేలాదిమంది గల్ఫ్‌దేశాలకు వలసవెళ్లిన వారికి ఆన్‌లైన్ యాప్ సౌకర్యం కల్పిస్తే ఆకాశవాణి కేంద్రం కార్యక్రమాలు వినే సౌకర్యం కలుగుతుంది. ఇప్పటికైనా ప్రసారభారతి ఉన్నతాధికారులు, చరిత్ర కలిగిన కడప ఆకాశవాణి కేంద్రానికి మొబైల్ యాప్‌లో స్థానం కల్పించాలని ఇక్కడి రచయితలు, కళాకారులు, రేడియో అభిమానులు కోరుతున్నారు.
చిత్రం... కడప ఆకాశవాణి కేంద్రం