ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం బ్యారేజీ వద్ద బోటు తొలగింపు పనులు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 24: కర్నాటక, మహారాష్ట్ర నుంచి భారీగా వచ్చిన వరదను ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలామన్న సంతృప్తి, ప్రశాంతత జలవనరుల శాఖ ఇంజనీర్లకు లేకుండాపోయింది. బ్యారేజీ 68వ గేటు వద్ద చిక్కుకుపోయిన ఇనుప బోటు ఆరు రోజులుగా వారికి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. నాలుగు రోజులు గేట్లన్నింటినీ పూర్తిగా పైకెత్తి గరిష్టంగా 8లక్షల క్యూసెక్కుల వరకు వరద నీటిని సాఫీగా సముద్రంలోకి వదిలారు. వరద తగ్గముఖం పట్టిన తర్వాత గేట్లన్నింటినీ క్రమేణా దించుతూ పూర్తిగా మూసివేస్తుండగా 68వ గేటు మాత్రం మూతపడలేదు. ఒక ఇనుప పడవ కొట్టుకొచ్చి సరిగ్గా ఆ గేటు వద్ద చిక్కుకుపోయినట్లు గుర్తించారు. దాంతో ఆరు రోజులుగా 5,600 క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది. ఐదారు రోజులు మొత్తంపై 300 టీఎంసీల నీరు బ్యారేజీ నుంచి సముద్రంలోకి పోయింది. అయినా కృష్ణా జిల్లాలో ఆయకట్టు చివరి భూములకు సాగునీరందక రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో అధికారులు కాలువలన్నింటికీ కలిపి ప్రస్తుతం 16,500 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. దీంతో బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 నుంచి 11.8 అడుగులకు పడిపోయింది. వరిపంటకు మున్ముందు మరింతగా నీటిని సరఫరా చేయాల్సి ఉంది.
భవిష్యత్‌లో వర్షాలు లేకపోతే పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని భావించిన ఇంజనీర్లు పట్టిసీమ ఎత్తిపోతల వద్ద శనివారం ఉదయం 21 మోటార్లు ఆన్‌చేసి గోదావరి జలాలను దిగువకు పంపారు. సాయంత్రానికి విజయవాడ సమీపంలోని వెలగలేరు రెగ్యులేటర్ వద్దకు 2వేల క్యూసెక్కులు చేరాయి. దాన్ని బ్యారేజీకి తరలిస్తుంటే మరోవైపు 68వ గేటు మూతపడక 5,600 క్యూసెక్కులు వృథాగా సముద్రంలోకి పోతోంది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు భారీ క్రేన్లు తెచ్చి బోటును తొలగించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇంజనీర్లకు ఇదో పెద్ద చిక్కు సమస్యగా మారింది. ఈ బోటును ఎలా తీయాలి? గేటు ఎలా మూయాలో తెలియక బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారు. ఎలాంటి సమస్య వచ్చినా ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాల్సిన బ్యారేజీ నిర్వహణ యాజమాన్యం క్రస్ట్‌గేటులో ఇరుక్కున్న పడవను మాత్రం తీయలేకపోతున్నారు. గేటును పూర్తిగా మూయలేకపోతున్నారు.
గుర్తుతెలియని వృద్ధుడు మృతి
ఇదిలావుంటే, భారీ క్రేన్లతో గేటు వద్ద జరుగుతున్న పనులను తిలకించేందుకు పెద్దసంఖ్యలో సందర్శకులు బ్యారేజీ పైకి వస్తున్నారు. పనులను దగ్గరగా చూద్దామని ఆఫ్రాన్ వద్ద నీటిలో దిగిన గుర్తుతెలియని వృద్ధుడు వరద ఉరవడికి కొట్టుకుపోయాడు. అతన్ని కాపాడటానికి నాటు పడవలు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది పరుగులు తీసినా ఫలితం లేకపోయింది.
పనులు పరిశీలించిన మంత్రి
జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌తో కలిసి శనివారం బోటు తొలగింపు పనులను పర్యవేక్షించారు. జలాలు దిగువకు వృథాగా వెళుతున్నందున యుద్ధప్రాతిపదికన బోటు తొలగింపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రాజమండ్రికి చెందిన రాజా టీమ్ వారు సముద్రంలో మునిగిన వాటిని సైతం పైకి తీయగలిగిన సామర్థ్యం కలిగినవారని, బళ్లారి, భైరవవానితిప్ప, పోలవరం, పులిచింతలకు చెందిన నిపుణులనూ జలవనరుల శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ బోటు తొలగించే పనులు చేస్తున్నారని తెలిపారు. పనుల పర్యవేక్షణలో జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ సతీష్‌కుమార్, సూపరింటెండింగ్ ఇంజనీర్ కేవీఎల్‌ఎన్‌పీ చౌదరి, కేసీ డివిజన్ ఈఈ రాజాస్వరూప్‌కుమార్ పాల్గొన్నారు.