ఆంధ్రప్రదేశ్‌

లోకాయుక్తగా లక్ష్మణరెడ్డి ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 15: ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జస్టిస్ పల్లేటి లక్ష్మణరెడ్డి చేత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకున్న జస్టిస్ లక్ష్మణరెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి జీఏడీ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ఆర్పీ సిసోడియా, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ స్వాగతం పలికారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి, జస్టిస్ లక్ష్మణరెడ్డి స్వాగతం పలికారు. లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణరెడ్డి నియామకానికి సంబంధించిన గవర్నర్ ఉత్తర్వులను గవర్నర్ అనుమతితో సిసోడియా చదివి వినిపించారు. గవర్నర్ బిశ్వభూషణ్ ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా లక్ష్మణరెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించారు. లక్ష్మణరెడ్డిని గవర్నర్, ముఖ్యమంత్రి పుష్పగుచ్ఛాలిచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, గవర్నర్ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా, జాయింట్ సెక్రటరీ అర్జునరావు, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు.
పల్లేటి లక్ష్మణరెడ్డి 1945 ఏప్రిల్ 18న వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం, పైడిపాలెం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన ప్రాథమిక, ఉన్నత విద్యను కొండపావురం, సింహాద్రిపురంలో అభ్యసించారు. బీఎస్సీ డిగ్రీని కడప పట్టణంలో, ఎల్‌ఎల్‌బీ బెంగళూరులోని బీఎంఎస్ లా కళాశాలలో అభ్యసించారు. హైదరాబాద్ లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారిగా, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా, సేల్స్‌టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా, ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రార్ జనరల్‌గా పలు పదవులు నిర్వహించారు. 2005లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు జడ్జీగా, 2006లో హైకోర్టు శాశ్వత జడ్జీగా నియమితులయ్యారు. 2007 నుండి 2010 ఏప్రిల్ వరకు హైదరాబాద్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, డీజీపీ నియామకాల్లో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన వాటిని రద్దు చేశారు.
*చిత్రం...లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ లక్ష్మణరెడ్డిని అభినందిస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్