ఆంధ్రప్రదేశ్‌

సీమలో వర్ష బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 17: కర్నూలు జిల్లాలో వరుసగా రెండవ రోజు కురిసిన కుంభవృష్టి నంద్యాల రెవెన్యూ డివిజన్‌ను అతలాకుతలం చేసింది. డివిజన్‌లోని తొమ్మిది మండలాల్లో మంగళవారం తెల్లవారుజాము వరకు కురిసిన అతి భారీ వర్షం గ్రామాలు, పంట పొలాలను ముంచెత్తింది. డివిజన్‌లో సుమారు 25 గ్రామాలకు రాకపోకలకు అవకాశం లేనంతగా వర్షపునీరు చుట్టుముట్టింది. ప్రముఖ శైవక్షేత్రమైన మహానంది ఆలయంలోకి సైతం వర్షపు నీరు చేరింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ఒకవైపు పంట పొలాలు, మరోవైపు నివాస గృహాలు నీట మునగడంతో పేదలు కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. ఆదివారం రాత్రి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. రాత్రి పొద్దుపోయిన తరువాత ప్రారంభమైన వర్షం క్రమేణా కుంభవృష్టిగా మారింది. తెల్లవారే సమయానికి వర్షపు నీరు వరదలా పారుతూ పంట పొలాలను ముంచెత్తి గ్రామాల వైపు పరుగులు తీసింది. ఉదయం వర్షం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు పంట పొలాల వైపు పరుగులు తీశారు. ఎక్కడ చూసినా నీరే ఉండటంతో పొలాల్లోని నీరు బయటకు వెళ్లలేని దుస్థితి వారికి కనిపించింది. అంతేగాకుండా పొలాలకు వెళ్లే రహదారుల్లో కూడా చిన్నచిన్న వాగులు, కాలువల్లో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో నిస్సహాయస్థితిలో పడ్డారు. ఇక గ్రామాల్లో ఇళ్ల ముందుకు వచ్చిన నీటిని దిగువకు పంపే ఏర్పాటు చేసినా ఫలించలేదు.
పరిస్థితి ఇలా ఉండగా సోమవారం రాత్రి మరో మారు వరుణుడు విరుచుకుపడటంతో గ్రామాలు నీట మునిగాయి. లోతట్టు కాలనీలతో పాటు దాదాపు అన్ని వీధుల్లో నీరు చేరి ఇళ్లలోకి ప్రవహించింది. దాంతో గ్రామీణులు దుర్భరస్థితిని ఎదుర్కొన్నారు. ఆకస్మికంగా వచ్చిన కుంభవృష్టితో నంద్యాల, గోసుపాడు, బండి ఆత్మకూరు, మహానంది, శిరువెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు మండలాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుంభవృష్టి కారణంగా నష్టపోయిన గ్రామాలకు వెళ్లేందుకు అధికారులు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లలో ప్రయాణిస్తున్నారు. అన్ని గ్రామాల్లో వరద సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వ్యాధులు ప్రబలకుండా అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. గ్రామాల్లో నీరు బయటకు వెళ్లిన తరువాత పారిశుద్ధ్యం చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వరద బీభత్సం గురించి తెలుసుకుని వ్యక్తిగత సెలవులో ఉన్న కలెక్టర్ వీరపాండియన్ తన సెలవులను రద్దు చేసుకుని విధుల్లో చేరారు. ప్రస్తుతం ఇన్‌చార్జి కలెక్టర్‌గా ఉన్న రవి పఠాన్‌శెట్టితో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరద వివరాలను తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన తక్షణ సహాయం అందించి వారికి అన్ని విధాలుగా తోడ్పాటునందించాలని సీఎం ఆదేశించారు.
కుందూ, పాలేరు విశ్వరూపం
నల్లమల అడవి తీరప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో నంద్యాల డివిజన్‌లోని ప్రధానమైన కుందూనది, పాలేరువాగు పొంగిపొర్లుతున్నాయి. కుందూనదికి ఇప్పటికే కేసీ కాలువ నుంచి నీరు విడుదల చేయడం, భారీ వర్షం కారణంగా వచ్చిన నీటితో గ్రామాలను, పంట పొలాలను ముంచెత్తుతూ కుందూనది, పాలేరు వాగులు ప్రవహిస్తున్నాయి. దీని కారణంగా కుందూ, పాలేరు పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలు జలదిగ్భందంలో ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కారణంగా అనేక రహదారులు తెగిపోయాయి. కాలువలు, వాగులు, వంకలు ఏకమై ప్రవహిస్తూ రహదారులను చిన్నాభిన్నం చేశాయి.
దెబ్బతిన్న రైల్వే లైను
మహానంది మండలం గాజులపల్లె, దిగువమెట్ల గ్రామాల మధ్య రైల్వేలైను దెబ్బ తినడంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. గుంటూరు వైపు వెళ్లే రైళ్లను నంద్యాల, పాణ్యం, గాజులపల్లె రైల్వే స్టేషన్లలో నిలిపివేయగా నంద్యాల వైపు వచ్చే రైళ్లను దిగువమెట్ట, గిద్దలూరు స్టేషన్లలో నిలిపివేశారు. దీంతో గుంతకల్లు, గుంటూరు మధ్య తిరిగే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ముఖ్యమైన రైళ్లను నెమ్మదిగా పంపుతున్నారు. రైల్వేలైనుకు శాశ్వత మరమ్మతులు చేపట్టేంతవరకు పలు రైళ్లను దారి మళ్లిస్తున్నారు.

*చిత్రం...ఉధృతంగా ప్రవహిస్తున్న కుందూనది