ఆంధ్రప్రదేశ్‌

పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: కడప జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెన్నానది పరవళ్లు తొక్కుతోంది. పెన్నా ఉపనదుల్లో ఒకటైన కుందు (కుముద్వతి) ఉరకలు వేస్తోంది. జిల్లాలోని కడప, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లలో ఆది, సోమవారాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా మైదుకూరు, ప్రొద్దుటూరు,
జమ్మలమడుగు ,పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లో వాగులు, వంకలు ఒడ్లు వొరుసుకుంటూ ప్రవహిస్తున్నాయి. కొన్నిచోట్ల గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. జిల్లాలో 20 యేళ్ల తర్వాత ఇటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 20 యేళ్ల నుండి వాగులు, వంకలు, నదులు ప్రవహించకపోవడంతో అన్నీ ఆక్రమణలకు గురై పంట పొలాలుగా, నివాసాలుగా మారిపోయాయి. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు నీళ్లు ఊర్లలోకి, పంటపొలాల్లోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో పెన్నా, కుందు పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వర్షం కారణంగా జిల్లాలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రొద్దుటూరు నుంచి రామేశ్వరం మీదుగా థర్మల్ పవర్ ప్రాజెక్టుకు వెళ్లే దారిలో పెన్నా ప్రవాహం కారణంగా రాకపోకలు నిలిపివేశారు. రాజుపాలెం మండలం టంగుటూరు గ్రామం వద్ద కుందునది ఉధృతం వల్ల కర్నూలు-చిత్తూరు రహదారిపై దాదాపు ఒకటిన్నర కిలోమీటరు వరకు నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దువ్వూరు మండలం నేలటూరు గ్రామాన్ని కుందునీరు చుట్టుముట్టింది.
అదే మండలంలో పెద్ద జొన్నవరం గ్రామంలోకి కుందు ప్రవాహం చొరబడింది. కమలాపురం నుండి ఖాజీపేటకు వెళ్లే మార్గంలో పెన్నా ప్రవాహం రాకపోకలకు ఆటంకం కలిగించింది. పులివెందుల-ముద్దనూరు రహదారిలో వంక రోడ్డుపై ప్రవహిస్తూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. ఎర్రగుంట్ల మండలంలోని అనేక వంకలు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. దువ్వూరు, చాపాడు మండలాల్లో కేసీ కెనాల్ ఆయకట్టు కింద సాగుచేసిన వరినారు నీట మునిగింది. కుందూ వరద ఎగదట్టడంతో నీళ్లన్నీ పంట పొలాల్లోకి ప్రవహించాయి. జొన్నవరం, ఈలాపురం, చీపాడు, గుంత చీపాడు, కుచ్చుపాప గ్రామ పొలాలన్నీ వరదనీటితో నిండిపోయాయి. జూన్ 1 నుండి సెప్టెంబర్ 15 వరకు జిల్లాలో 340.7 మిమీ సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా ఇంతవరకు 258.5 మిమీ మాత్రమే నమోదైంది. అదికూడా ఈ సెప్టెంబర్ మాసంలోనే అధికంగా కురిసింది.
కొట్టుకుపోయిన బోల్తా: ముగ్గురు గల్లంతు
ప్రొద్దుటూరు మండలం కామనూరు గ్రామ సమీపంలో వంక ఉధృతంగా కాజ్‌వేపైనుంచి ప్రవహిస్తుండటంతో సోమవారం రాత్రి ఓ ఆటో నీళ్లలో కొట్టుకుపోయి ముగ్గురు గల్లంతైనట్లు సమాచారం. ఈ సంఘటన అర్థరాత్రి జరగడంతో పూర్తి వివరాలు పోలీసులకు కూడా తెలియడం లేదు. పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆటోలో ప్రయాణిస్తున్నవారి వివరాలు తెలియాల్సి ఉంది.

*చిత్రాలు.. కడప జిల్లా కమలాపురం-ఖాజీపేట నడుమ ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నా నది
* ప్రొద్దుటూరు నుండి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు వెళ్లే దారిలో పెన్నా ప్రవాహం