ఆంధ్రప్రదేశ్‌

‘భరోసా’కు మరో వెయ్యి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 14: వైఎస్సార్ రైతు భరోసా పథకం పేరులో ప్రధానమంత్రి ప్రస్తావనతో పాటు ఈ పథకం కింద ఏడాదికి చెల్లించే నగదును మరో 1000 రూపాయల మేర పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పథకం పేరును ‘వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్’గా ప్రచారంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో వ్యవసాయ మిషన్‌పై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏటా రైతులకు రూ.12,500 చొప్పున ఇచ్చేలా రైతు భరోసా పథకాన్ని అమలు చేయాల్సి ఉంది. నాలుగేళ్లపాటు ఈ పథకాన్ని కొనసాగించాలని అప్పట్లో నిర్ణయించారు. తాజా సమావేశంలో రూ.13,500 ఆర్థిక సాయం అందించనున్నారు. ఐదేళ్ల పాటు ఈ పథకం కింద అర్హత పొందిన రైతులకు రూ.67,500 సహాయం అందుతుంది. కాగా ఏడాదికి ప్రకటించిన రూ. 13,500 కూడా మూడు కిస్తీలుగా చెల్లించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని మంగళవారం నెల్లూరు జిల్లా కాకుటూరులో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. వ్యవసాయ మంత్రి కన్నబాబు, రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, మార్కెటింగ్, మత్స్య, పశు సంవర్థక శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ, వ్యవసాయ మిషన్ వైస్‌చైర్మన్ నాగిరెడ్డి , వ్యవసాయ నిపుణుడు పాలగుమ్మి సాయినాథ్ తదితర ప్రముఖులు హాజరైన ఈ సమీక్షా సమావేశంలో సీఎం జగన్ రైతులకు మరింత భరోసానిచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. రైతు భరోసా పథకం కింద లబ్ధిదారుల ఎంపిక విధానంపై ఆరా తీశారు. మిషన్ సభ్యులుగా కొనసాగుతున్న రైతు ప్రతినిధులు వ్యవసాయ రంగంలో తాజా పరిస్థితులను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదైనప్పటికీ సకాలంలో కురవలేదని, ఖరీఫ్ సాగు కూడా సాధారణ స్థాయికి మించలేదని వివరించారు. ఈ పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ హామీల అమలు, రైతు ప్రయోజనాల కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని, రైతు భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచాలని కోరారు. పంట ఇంటికి వచ్చే సంక్రాంతి సమయంలో కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించాలని ప్రతిపాదించారు. స్పందించిన ముఖ్యమంత్రి భరోసా కింద చెల్లించే మొత్తంలో వెయ్యి రూపాయలు పెంచడంతో పాటు ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలను సడలించాలని అధికారులను ఆదేశించారు. రైతు మరణిస్తే ఆ కుటుంబానికి అర్హత
ఉంటే రైతు భార్యకు భరోసా వర్తింప చేయాలన్నారు. ఉద్యోగుల తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటే వారికి కూడా భరోసా ఇవ్వాలని, ఆదాయపు పన్ను చెల్లించే వారి తల్లిదండ్రులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలని, నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకునే గడువు పొడిగించాలని అధికారులను ఆదేశించారు. రైతు భరోసా పెంపుతో మూడు విడతలుగా చెల్లించినా తమకు అభ్యంతరంలేదని రైతు సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. మే నెలలో, ఖరీఫ్ పంట కోత సమయంలో, రబీకి సిద్ధమవుతున్న సమయంతో పాటు సంక్రాంతికి వాయిదాల రూపంలో చెల్లించేందుకు సమావేశంలో సీఎం ఆమోదం తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే అనూహ్యంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని భరోసా సాయాన్ని పెంచామని సీఎం చెప్పారు. ఈ పథకాన్ని ఐదేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్రం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ రైతులు కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఎంత చేసినా సరిపోదని సీఎం వ్యాఖ్యానించారు. తమది రైతుల పక్షపాత ప్రభుత్వమన్నారు. రైతు భరోసా ద్వారా లబ్ధి పొందే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులకు కూడా తాజా ఉత్తర్వులు అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఏటా మే నెలలో రూ. 7500, పంట కోసే సమయం లేదా రబీలో రూ. 4,000, సంక్రాంతికి రూ. 2వేలు అందించాలని రైతు సంఘాలు చేసిన సూచనలకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. గత ప్రభుత్వం కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి 43 లక్షల మంది రైతులతో జాబితాను పంపించిందని సీఎంకు అధికారులు వివరించారు. అంతకంటే అధికంగా ప్రస్తుతం 51 లక్షల మంది రైతులను ఎంపిక చేశామని తెలిపారు. ఈ సారి మరో 3 లక్షల మంది భూములులేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకూ పథకం వర్తింప చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈనెల 15 తరువాత కూడా నెలరోజుల పాటు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలన్నారు. సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఇతర రాజ్యాంగ పదవులు నిర్వహించే వారిని పథకానికి అనర్హులుగా ప్రకటిస్తున్నారని వ్యవసాయ మిషన్ సభ్యులు సీఎం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన సీఎం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీలు మినహా మిగిలిన ప్రజా ప్రతినిథులకు ఈ పథకాన్ని వర్తింప చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆక్వా కల్చర్ కింద మార్పిడి చేసిన భూములు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే వారిని రైతు భరోసాకు అనర్హులుగా ప్రకటించామని అధికారులు తెలిపారు. మార్గదర్శకాలను తప్పనిసరిగా అందరికీ అందుబాటులో ఉంచి ఎవరెవరికి ఈ పథకం వర్తించదో ఆ వివరాలను ప్రదర్శించాలని ముఖ్యమంత్రి సూచించారు. అర్హులైన వారికి వర్తించలేదంటే వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. దీనికోసం వచ్చే విజ్ఞాపనలను పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను ఇందుకోసం వినియోగించుకోవాలన్నారు. రైతు మరణిస్తే అతని భార్యకు భరోసా ఇవ్వాలని, పిల్లలు ఉద్యోగులైనా వ్యవసాయం చేస్తుంటే వారికీ పథకాన్ని వర్తింప చేసే విధంగా మార్గదర్శకాలను సడలించాలన్నారు. ఆదాయపు పన్ను కడుతున్న వారికి తప్ప వ్యవసాయం చేస్తున్న వారి తల్లిదండ్రులను కూడా అర్హులుగా గుర్తించాలన్నారు. రైతుల భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని బ్యాంక్‌లు మినహాయించుకోకుండా అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాలకే నగదు జమ చేయాలని సూచించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు, తీసుకునే రుణాలు, గ్రాంట్లు అన్నీ కలిపితేనే బడ్జెట్ అని, ఈ విషయంలో ఇతరత్రా ఆలోచనలు తగవన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనంగా నిలుద్దాం.. దీనిపై కూడా చంద్రబాబు రచ్చ చేసే స్థాయికి వెళ్లడం దురదృష్ట కరమన్నారు.
వచ్చే ఖరీఫ్ నాటికి చిరుధాన్యాలపై ప్రమోషన్ స్కీంను అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అందుకు తగ్గట్టుగా విత్తనాలు సిద్ధం చేసుకోవాలన్నారు. చిరుధాన్యాలు, వరి బోర్డుల ఏర్పాటుకు వెంటనే ప్రయత్నాలు ప్రారంభించాలన్నారు. ఈ నెల 16న జరిగే కేబినెట్ భేటీ అజెండాలో వీటిని చేర్చాలని సూచించారు. నెలాఖరు కల్లా చైర్మన్ల నియామకం పూర్తి చేయాలన్నారు.
రాష్ట్రంలోని వ్యవసాయ కళాశాలల్లో పడిపోతున్న ప్రమాణాలపై మిషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాణాలులేని కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారు. కళాశాలల్లో నాణ్యమైన విద్యనందించకపోతే వ్యవసాయ రంగ మనుగడకే ప్రమాదకరమన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖలు, వ్యవసాయ విశ్వ విద్యాలయాల మధ్య సమన్వయం కొరవడిందని సభ్యులు తెలిపారు.
సహకార చక్కెర కర్మాగారాల పరిస్థితి కష్టంగా ఉందని గత ఐదేళ్లలో పట్టించుకోలేదని వచ్చే రెండేళ్లలోగా పరిస్థితిని చక్కదిద్దుతామని సీఎం హామీ ఇచ్చారు. చక్కెర ఫ్యాక్టరీలను పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చూడటంతో పాటు మార్కెటింగ్ అవకాశాలు కల్పించేలా తగిన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ధరల స్థిరీకరణకు బడ్జెట్‌లో కేటాయించిన రూ. 3 వేల కోట్లను వినియోగించాలని, ఫలితాలు రైతులకు అందాలని సీఎం ఆకాంక్షించారు. ఈ నెలాఖరులోగా వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకాలు జరపాలని ఆదేశించారు. టమోటా ధరలపై కూడా సమావేశంలో చర్చించారు. రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బెంగళూరు, చెన్నై మార్కెట్లలో ధరలను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలు స్థిరీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. టమోటా ప్రాసెసింగ్ యూనిట్లపై దృష్టి సారించాలన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొని పరిష్కరించాలన్నారు. పసుపు మార్కెటింగ్‌పై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు.
*చిత్రం...సచివాలయంలో సోమవారం వ్యవసాయ మిషన్‌పై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి