ఆంధ్రప్రదేశ్‌

జగన్‌తో చిరు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 14: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి, ఆయన సతీమణి భారతిని చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాను నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని చూడాల్సిందిగా హైదరాబాద్‌లో ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళసైని కలిసి చిరంజీవి కోరిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కూడా సైరా చిత్రం గురించి వివరించేందుకు చిరంజీవి కలుసుకున్నట్లు చెబుతున్నారు. జగన్‌ను కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్ కోసం చిరంజీవి కార్యాలయ ప్రతినిధులు సీఎంఓను కోరారు. ఈ మేరకు మధ్యాహ్న భోజనానికి హాజరు కావాల్సిందిగా చిరంజీవితోపాటు ఆయన సతీమణి సురేఖను ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి భారతి ఆహ్వానించారు. దీంతో సతీ సమేతంగా చిరంజీవి జగన్ ఇంటికి చేరుకున్నారు. సైరా నరసింహారెడ్డి చిత్ర విజయంపై ఇరువురు కొద్దిసేపు చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జగన్‌ను చిరంజీవి సత్కరించారు. అనంతరం చిరంజీవిని సత్కరించిన జగన్ జ్ఞాపిక బహూకరించారు. భారతి కూడా సురేఖను సాదరంగా ఆహ్వానించారు. చిరంజీవి సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో చిరంజీవి, జగన్ కలయిక అటు రాజకీయ, ఇటు సినీ వర్గాలతో పాటు ప్రధానంగా మెగా ఫ్యాన్స్‌లో కలకలం రేపుతోంది. ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం బెనిఫిట్‌షోలకు ఏపీలో అనుమతి నిరాకరించిన ప్రభుత్వం సైరా సినిమాకు మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటంతో కృతజ్ఞతా
పూర్వకంగా జగన్‌ను చిరంజీవి కలిశారనే ప్రచారం జరుగుతోంది. సైరా సినిమాకు వినోదపు పన్ను రాయితీపై కూడా ఇరువురు చర్చించినట్లు తెలిసింది. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ సందర్భంగా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు చిరంజీవి ప్రాధాన్యత ఇవ్వటం భవిష్యత్ వ్యూహంలో భాగమేనని గుసగుసలు వినవస్తున్నాయి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ నుంచి ఎదురవుతున్న నెగిటివ్ ఎఫెక్ట్‌ను చిరంజీవితో సాన్నిహిత్యం ద్వారా దెబ్బతీయాలనే వ్యూహంతో జగన్ ఆహ్వానం పలికారనే వాదనలు కూడా వినవస్తున్నాయి. సైరా చిత్ర నిర్మాత, చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ కూడా జగన్‌ను కలుసుకోవాల్సి ఉండగా అనివార్య కారణాల రాలేకపోయినట్లు సమాచారం.
*చిత్రం...తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పుష్పగుచ్ఛాన్ని అందిస్తున్న చిరంజీవి