ఆంధ్రప్రదేశ్‌

కర్నూలు ఎస్పీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 22: తన భర్త భార్గవరామ్‌కు వ్యాపార భాగస్వామ్యులతో ఉన్న సాధారణ విభేదాలను అడ్డం పెట్టుకుని అక్రమంగా కేసు నమోదు చేసి కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వ్యక్తిగతంగా వేధిస్తున్నారని మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలో మంగళవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. అక్కడా న్యాయం జరగకపోతే రాష్టప్రతి వద్దకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. ఎస్పీ వేధిస్తున్నారనడానికి తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. ఆయా ఆధారాలను బహిరంగపర్చకుండా గవర్నర్‌కు ఇవ్వడానికి ప్రధాన కారణం పోలీస్ వ్యవస్థపై తమకున్న గౌరవమేనన్నారు. ఒకరిద్దరు అధికారులు తప్పు చేసినంత మాత్రాన వ్యవస్థ తీరును కించపరచలేనని ఆమె తెలిపారు. తన భర్త భార్గవరామ్‌కు ఇతర భాగస్వామ్య వ్యాపారులతో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయని వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. అయితే ఆ విభేదాలను అడ్డుపెట్టుకుని అక్రమంగా కేసు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. కేసు కోర్టుకు వెళ్లిన తరువాత అక్రమమో సక్రమమో తేలుతుందని, అయితే తాము కోర్టు నుంచి అరెస్టు కాకుండా బెయిల్ తెచ్చుకున్నా అరెస్టు చేయడానికి ఎస్పీ ప్రయత్నించడం దారుణమన్నారు. బెయిల్ వచ్చిన విషయం పోలీస్ అధికారులకు తెలుపడమే కాకుండా న్యాయవాదుల ద్వారా నోటీసులు కూడా ఇచ్చామని పేర్కొన్నారు. అయినా పదేపదే ఆయనను అరెస్టు చేయడానికి ఎస్పీ కిందిస్థాయి పోలీసులను పంపాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఎస్పీ ఒత్తిడి కారణంగానే తాము వస్తున్నామని ఎస్పీతోనే మాట్లాడాలని కిందిస్థాయి పోలీస్ అధికారులు తనతో అన్న మాటలు రికార్డింగ్‌లో ఉన్నాయని వివరించారు. బెంగళూరులో ఉంటున్న తన చెల్లెలి ఇంటికి కూడా పోలీసులు వెళ్లి ఆమె మామను భార్గవ విషయంలో ప్రశ్నించడం చట్టబద్ధమా అని ప్రశ్నించారు. ఈకేసుకు వారికి సంబంధం ఏమిటో ఎస్పీ స్పష్టం చేయాల్సి ఉంటుందని ఆమె అన్నారు. ప్రస్తుతం తన కుటుంబంపై కక్షగట్టడానికి కారణం యురేనియం తవ్వకాలను అడ్డుకోవడమేనని అన్నారు. యురేనియం తవ్వకాలపై ప్రజల్లో అవగాహన పెంచి వారి మద్దతు కూడగట్టడంతో తవ్వకాలు నిలిపి వెళ్లిపోయారని ఆమె గుర్తుచేశారు. ఇదే విషయంపై తాను పులివెందుల వెళ్లి వచ్చిన రెండు రోజులకే భార్గవ్‌రామ్‌పై కేసు నమోదు చేశారని ఆమె తెలిపారు. కేసు నమోదు చేసినా, కోర్టులో బెయిల్ వచ్చిన తరువాత ఎస్పీ వ్యక్తిగతంగా తీసుకుని వేధించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. స్వయంగా ఎస్పీనే వేధిస్తున్నారా లేక ఆయనపై ఇంకా ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా అన్నది తేలాల్సి ఉందన్నారు. జిల్లాలో హత్యలు, భారీ ఎత్తున దొంగతనాలు జరుగుతున్నాయని ఆ కేసులపై ఎస్పీ దృష్టి పెడితే బాగుంటుందని ఆమె సూచించారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తమ ప్రత్యర్థులపై కేసులు నమోదు చేయమని ఏ రోజూ డిమాండ్ చేయలేదని ఆమె అన్నారు. తనభర్త భార్గవరామ్‌ను ఇకముందు వేధించినా, ఆయనకు ఏదైనా నష్టం తలపెట్టినా జిల్లా ఎస్పీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అఖిలప్రియ అన్నారు.