ఆంధ్రప్రదేశ్‌

ఉత్తరాంధ్రలో కుంభవృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు జనజీవనం స్తంభించింది. రవాణా వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మంగళ,బుధ వారాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వంశధార, నాగావళి, తోటపల్లి, జంఝావతి, బహుదా, శారదనది, ఇతర ప్రాంతాల్లో రిజర్వాయర్లు, నదులు వరదనీటితో పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సముద్రతీర ప్రాంతాల ప్రజలను, మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లలో అధికార యంత్రాంగాలు తలమునకలయ్యాయి. మత్స్యకారులను చేపలవేటకు వెళ్లరాదని దండోరా వేసి హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైమరీ, హైస్కూల్స్‌కు సెలవు ప్రకటించడంతో మూతపడ్డాయి. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్ల నీటిమట్టాలు ప్రమాద స్థాయి చేరుకుంటే దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. వరదనీటికి శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం అలికాం-బత్తిలి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. మూడు జిల్లాల్లో పంట పొలాలు నీటమునిగిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు కోల్పోతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాలకు వ్యాపారాలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అనేక గ్రామాల్లోకి, ఇళ్ళల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళ, బుధవారం రాత్రంతా నిద్రలేకుండా ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. విజయనగరం జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. భారీ వర్షాలకు పట్టణాలు, గ్రామాల్లోని రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నారు.
విశాఖ జిల్లాలో..
జిల్లాలోని రిజర్వాయర్లలో పూర్తిస్థాయికి నీటి మట్టాలకు చేరుకుంటున్నాయి. రైవాడ రిజర్వాయర్ నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలకు విశాఖ జిల్లాలో 257 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనావేశారు.అలాగే మత్స్యకారులకు చెందిన 8 బోట్లకు నష్టం వాటిల్లగా రూ.12 లక్షలు నష్టంగా అంచనా వేశారు. జిల్లాలో రెండు ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా, 14 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు విశాఖ శివారులోని ప్రఖ్యాత బౌద్దారామం తొట్లకొండకు భారీనష్టం వాటిల్లింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా తొట్లకొండలోని బౌద్ధ స్థూపం కొంత భాగం కుప్పకూలింది. ఇక విశాఖ నగరంలోని చెంగల్రావుపేట, ఆదర్శనగర్‌లో ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో విశాఖనగరంలోని చావులమదుం అండర్‌బ్రిడ్జి, జ్ఞానాపురం, తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి అవంతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు.
*చిత్రాలు.. విశాఖనగరంలోని చావుల మదుం అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిలిచిపోయిన దృశ్యం
* సింహాచలం మెట్ల మార్గంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదనీరు
*వర్షాలకు కూలిన తొట్లకొండపై ఉన్న బౌద్ధస్థూపం