ఆంధ్రప్రదేశ్‌

రాజధాని తరలింపు తప్పదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 23: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపు తప్పదనే సంకేతాలు ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. గత తెలుగుదేశం ప్రభుత్వం రైతుల వద్ద నుంచి 33వేల 500 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణానికి సమీకరించింది. ఇదికాక అటవీ, దేవాదాయ భూములతో కలుపుకుని మొత్తం 50వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు సింగపూర్ ప్రభుత్వం, సంస్థలు మాస్టర్ ప్లాన్‌ను అందించాయి.
రాజధానికి భూ సమీకరణను మొదటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అవసరమైన మేరకు వినియోగించుకుని మిగిలిన భూమిని రైతులకు తిరిగిస్తామని కూడా ప్రకటించారు. భూ సమీకరణతో రైతుల వద్ద నుంచి తీసుకున్న భూమిని తెలుగుదేశం ప్రభుత్వం అయిన వారికి ధారాదత్తం చేసిందని, చదరపు అడుగు రూ. 3వేలకు నిర్మించాల్సి ఉంటే 10వేలు వెచ్చించిందనే ఆరోపణలను తెరపైకి తీసుకురావటంతో పాటు రాజధానిపై సమగ్ర విచారణతో పాటు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి నివేదిక సిద్ధం చేసేందుకు నిపుణుల కమిటీని నియమించింది. దీంతో భూ సమీకరణ కింద భూములిచ్చిన రైతుల్లో ఆందోళన మొదలైంది. బీజేపీతో సహా ప్రతిపక్ష పార్టీలు రాజధాని తరలింపును సహించేది లేదని తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో కర్నూలులో హైకోర్టు బెంచ్, హెచ్‌ఓడీ కార్యాలయాలు ఏర్పాటుచేసే అంశాలే ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న రాజధాని తరలించబోరనే భావన రైతుల్లో కలిగింది. తరలింపు వివాదం నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిస్థాయిలో కుదేలైంది. గత కొద్దిరోజులుగా ఈ విషయమై మంత్రులు, ప్రభుత్వం తటస్థంగా వ్యవహరించారు.
ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ బుధవారం ప్రాథమిక నివేదికను అందించటంతో ఇది మరోసారి తెరపైకి వచ్చింది. రాజధాని ప్రాజెక్ట్‌లు, నిర్మాణాలు, అవకతవకలపై పీటర్, పొన్నాడ సూర్యప్రకాశ్, అబ్దుల్ బషీర్, నారాయణరెడ్డి, ఇఎన్ రాజు, ఆదిశేషు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ ప్రాథమిక నివేదికను సమర్పించినట్లు సమాచారం. రాజధానిలో ప్రతి ప్రాజెక్ట్‌ను, నిర్మాణాలను ప్రభుత్వం పునస్సమీక్షించాలని కమిటీ నివేదిక సూచించినట్లు తెలియవచ్చింది. నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, అవసరానికి మించి రెట్టింపు వ్యయం చేశారని కమిటీ గుర్తించింది. సుమారు రూ. 30వేల కోట్ల మేర ప్రజాధనం దుబారా జరిగిందని నివేదికలో గత ప్రభుత్వంపై అభియోగాలు మోపినట్లు తెలిసింది. ఇప్పటికే 75 శాతం పూర్తయిన టవర్లు, ప్రాజెక్ట్‌లను ఏం చేయాలనే అంశం ప్రభుత్వ నిర్ణయానికి వదిలేసింది. రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, సూచనల కోసం గత నెల 13వ తేదీన మరో నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ విజయవాడలోని హోటల్ గేట్‌వేలో బుధవారం సమావేశమయింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు జరిపి వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరపాలని కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ఆంతరంగికంగా జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలను ప్రభుత్వానికి ప్రతిపాదించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వెలగపూడిలో శాశ్వత సచివాలయం, శాసనసభ నిర్మాణాలతో పాటు రాయపూడి, నేలపాడు ప్రాంతాల్లో జడ్జిలు, ఐఏఎస్ అధికారుల నివాస భవనాలు, ఎమ్మెల్యేలు, మంత్రుల క్వార్టర్లు వివిధ దశల్లో ఉన్నాయి. త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగే అవకాశం ఉంది. రాజధాని ప్రాథికార అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) వివిధ వర్గాల ప్రజలకు రాజధానిలో అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి ప్రారంభించిన ‘హ్యాపీనెస్ట్’ ప్రాజెక్ట్‌ను కూడా ప్రభుత్వం తిరగదోడుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు కూడా రివర్స్ టెండరింగ్ నిర్వహించాలనే యోచనతో ఉన్నట్లు తెలిసింది. రాజధానిలో ఇప్పటికే వివిధ పారిశ్రామిక వేత్తలు, విద్యా సంస్థలకు కేటాయించిన భూముల వ్యవహారంపై కూడా నిపుణుల కమిటీ సిఫార్సుల కనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.