ఆంధ్రప్రదేశ్‌

ఉన్నత చదువుల ఫీజుల భారం మేమే భరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 11: ఉన్నత చదువులకు ఇప్పటి వరకూ చాలీచాలని ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చే వారని ఇక మీదట ఆ విధానానికి ఫుల్‌స్టాప్ పెట్టి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. భారతరత్న జనాబ్ వౌలానా అబుల్ కలాం ఆజాద్ 132వ జయంతి వేడుకలు, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఏపీజే అబ్దుల్ కలాం విద్యా పురస్కార అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని సోమవారం విజయవాడలోని ఏ కనె్వన్షన్ సెంటర్‌లో రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుగా భారత రత్న వౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ తదితర ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ చాలీచాలక మిగిలిన ఫీజు వారు సొంతంగా కట్టుకోలేక అర్ధంతరంగా చదువులు ఆపేసే పరిస్థితి ఉందన్నారు. దీనికి ఫుల్‌స్టాప్ పెడుతూ ఇకపై పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వబోతున్నామని ఆయన వెల్లడించారు. హాస్టల్, మెస్ ఖర్చుల కోసం వారి తల్లులకు కూడా రూ. 20వేలు ప్రోత్సాహకంగా అందించనున్నామని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో మార్పులు తీసుకురాబోతున్నామని, ఉద్యోగాలు పొందడానికి వీలుగా కోర్సుల్లో మార్పులు తీసుకురానున్నామని, ప్రతి ఏటా అప్రంటీస్‌షిప్‌ను కూడా ప్రవేశపెట్టనున్నామన్నారు. భారతదేశ తొలి
విద్యాశాఖ మంత్రిగా పని చేసిన భారత రత్న వౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 11వ తేదీన దేశమంతటా జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారన్నారు. మన రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేసిన దివంగత వైఎస్ ఈరోజును మైనార్టీ వెల్ఫేర్ డేగా ప్రకటించారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తొలిదశగా 1 నుండి 6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతున్నామన్నారు. అదే సమయంలో తెలుగు, ఉర్దూ భాషల సబ్జెక్టులను తప్పనిసరి చేస్తున్నామన్నారు. ఆ తరువాత 4 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఒక క్లాసు చొప్పున 7 నుండి 10వ తరగతి వరకు కూడా ఇంగ్లీషు మీడియాన్ని అమలు చేస్తామని, పాఠశాలల్లో ఇంగ్లీషు ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా డిసెంబర్, జనవరి నెలలో అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. మదర్సాలను గురించి ఆలోచన చేయాలని డిప్యూటీ సీఎం అంజాద్ భాషా తనను కోరారని మదర్సాలకు మంచి చేసేందుకు మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించానన్నారు. మదర్సాలలో చదువుకునే పిల్లలు సాంప్రదాయ విద్యతోపాటు ఇంగ్లీషు మీడియం కూడా అభ్యసించాలని సూచిస్తూ వారికి కూడా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. వచ్చే మార్చి నుండి వైఎస్‌ఆర్ పెళ్లి కానుక లక్ష రూపాయలకు పెంచి అమలులోకి తీసుకురాబోతున్నామని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా వౌజంలు, వౌలానాలకు ఇస్తానన్న రూ. 15వేలు ఇస్తామని అయితే తనకు మార్చి వరకు సమయం ఇవ్వాలని వారికి విజ్ఞప్తి చేశారు.
ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ ప్రథమ విద్యాశాఖ మంత్రి, భారతరత్న వౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ విద్యాభివృద్ధితోనే సమాజం అభివృద్ధి చెందుతుందని అంబేద్కర్ చెప్పిన మాటలను ప్రభుత్వం ఆచరణలో పెట్టిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు. అబ్దుల్ కలాం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ 10వ తరగతి, ఇంటర్, పాలిటెక్నిక్, డిగ్రీల్లో ప్రతిభ చూపిన వారికి పురస్కారాలు అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ పురస్కారం కింద రూ.20 వేలు, ట్యాబ్‌ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, వసంత కృష్ణ ప్రసాద్, కొక్కిలిగడ్డ రక్షణనిధి, దూలం నాగేశ్వరరావు, జోగి రమేష్, ప్రభుత్వ సలహాదారు తలశిల రఘురాం, ఉర్దూ అకాడమీ చైర్మన్ మహ్మద్ నౌమన్, ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, విద్యాశాఖ కార్యదర్శి సుజాతా శర్మ, కలెక్టర్ ఇంతియాజ్, మైనార్టీ సంక్షేమశాఖ డైరెక్టర్ శారద తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... అబుల్ కలాం ఆజాద్ 132వ జయంతి వేడుకల్లో విద్యార్థినికి ప్రతిభా పురస్కారం అందజేస్తున్న జగన్మోహన్ రెడ్డి