ఆంధ్రప్రదేశ్‌

నేడు బాబు ఇసుక దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 13: రాష్ట్రంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా గురువారం విజయవాడ ధర్నా చౌక్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 12 గంటల నిరసన దీక్ష నిర్వహించనున్నారు. ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదేలై లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, పనులు కోల్పోయిన వారికి నెలకు రూ.10వేల చొప్పున ప్రభుత్వం వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో నిర్వహించే ఈ నిరసన దీక్షకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ నేతలతో కలసి జనసేన విశాఖపట్నంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాంగ్ మార్చ్ నిర్వహించిన సంగతి విదితమే. ప్రభుత్వం ఇసుక కొరతను తాత్కాలికంగా పరిగణిస్తోందని నూతన విధానం ద్వారా ప్రజలకు మేలు జరగదని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ హయాంలో అమలుచేసిన ఉచిత ఇసుక పథకాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దుచేసి ఎక్కడికక్కడ ధరలు నిర్ణయిస్తోందని ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చి నిర్మాణ రంగాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. వరదల కారణంగా ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయనే ప్రభుత్వ వాదనను టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. హైదరాబాద్, ఇతర
రాష్ట్రాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, ఇసుక మాఫియాలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రమేయం ఉందంటూ టీడీపీ చార్జిషీట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఓ వైపు అక్రమ రవాణా చేస్తూ మరోవైపు భవన నిర్మాణ కార్మికులను వీధిన పడేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇసుక కొరత తీర్చి భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలనే డిమాండ్‌తో నిర్వహిస్తున్న ఈ దీక్షకు అన్నివర్గాల ప్రజలు మద్దతివ్వాలని టీడీపీ అధినేత విజ్ఞప్తి చేశారు. ఇసుక కొరతను వైసీపీ నేతలే సృష్టిస్తున్నారని శాండ్ మాఫియాగా ఏర్పడి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకుంటూ నిరుపేదలు, రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికుల జీవితాలను పణంగా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా విజయవాడ ధర్నా చౌక్‌లో జరిగే నిరసన దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి భవన నిర్మాణ కార్మికులతో పాటు టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున హాజరవుతారని అంచనా వేస్తున్నారు. విజయవాడ ధర్నాచౌక్‌లో చంద్రబాబు దీక్ష ఏర్పాట్లను బుధవారం టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు కింజారపు అచ్చన్నాయుడు, వర్ల రామయ్య పరిశీలించారు. దీక్షకు వామపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు ఇసుక దీక్షపై రాష్ట్ర కేబినెట్ భేటీలో విస్తృత చర్చ జరిగినట్లు సమాచారం. ఇసుక కొరత కారణంగా ప్రభుత్వంపై ఎలాంటి అపవాదు పడకుండా అవసరమైన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. సహచర మంత్రులకు సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇసుక మాఫియాలో తనకు భాగస్వామ్యం ఉందని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు నిరసనగా ధర్నాచౌక్ లోనే తాను ప్రతి దీక్ష చేస్తానని పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి ప్రకటించారు. తనకు అనుమతివ్వాలంటూ పార్థసారధి హోంమంత్రి, పోలీస్ ఉన్నతాధికారులతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్‌లను స్వయంగా కోరారు. గత కొద్దిరోజుల క్రితం ఇదే స్థలంలో బీజేపీ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ధర్నా నిర్వహించింది. తాజాగా టీడీపీ అధినేత దీక్ష ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది. చంద్రబాబు దీక్షను భగ్నం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వినికిడి. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై జరిగిన కీలక చర్చలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు సూచనలు చేసినట్లు తెలియవచ్చింది. ఎమ్మెల్యే పార్థసారధి పోటీ దీక్ష ప్రకటనతో శాంతి భద్రతల చర్యల్లో భాగంగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.
*చిత్రం... చంద్రబాబు దీక్ష చేయనున్న వేదికను పరిశీలిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు