ఆంధ్రప్రదేశ్‌

ఉగ్ర దేశాలకు ఆర్థిక సాయం కట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఉగ్రవాద దేశాలకు ఆర్థిక సాయం అందించే దేశాలు, ఆర్థిక సంస్థలను పూర్తిగా నియంత్రించడంతోపాటు ఆయా దేశాలను ఏకాకి చేసేందుకు ఉద్దేశించిన చర్యల్లో భారత్ తనవంతు పాత్ర పోషిస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఉద్ఘాటించారు. విశాఖలో బుధవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల ఆర్థిక మూలాలను సమూలంగా తుంచేయడమే ‘నో మనీ ఫర్ టెర్రర్’ ప్రధాన లక్ష్యమన్నారు. పారిస్‌లో మొదలైన ఈతరహా సదస్సులు ఇటీవల మెల్‌బోర్న్‌లో జరిగేంత వరకూ కొనసాగుతూ వస్తున్నాయన్నారు. భారత్ సహా అనేక దేశాలు ఉగ్రవాద బాధిత దేశాలుగా నిత్యం అనేక హింసాత్మక సంఘటనలు ఎదుర్కొంటున్నాయన్నారు. అటువంటి ఉగ్రవాద ప్రేరేపిత దేశాలకు ఆర్థిక సాయం అందించే దేశాలు, సంస్థలను బహిష్కరించడం ద్వారా వాటికి సరైన గుణపాఠం చెప్పాలన్న నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనిలో భాగంగానే వచ్చే ఏడాది నో మనీ ఫర్ టెర్రర్ సదస్సును భారత్‌లో నిర్వహించాలని తాను చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపారన్నారు. మనకు పక్కనే ఉన్న పాకిస్తాన్ నిరంతరం భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు శతవిధాలుగా యత్నిస్తోందని ఆరోపించారు. ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేయడం నుంచి వారికి ఆర్థిక సహకారం అందించడంతోపాటు నకిలీ కరెన్సీని భారత్‌లో చెలామణి చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం పాక్ కుట్రగా పేర్కొన్నారు. దీనిపై భారత ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంభిస్తోందని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత దేశంలో ఎంతో క్లిష్టమైన పలు సమస్యల్ని అవలీలగా పరిష్కరించారన్నారు.
బలమైన ప్రధానులుగా చెప్పుకునే జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కశ్మీర్ సమస్యను పరిష్కరించలేక పోయారన్నారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండటాన్ని మెజారిటీ వర్గాలు జీర్ణించుకోలేక పోయాయని, అందుకే జమ్ము-కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370ని రద్దు చేసి, ప్రజలందరికీ సమన్యాయం అందేలా చర్యలు తీసుకున్నారన్నారు. ఇక దశాబ్ధాలుగా వీడని చిక్కుముడి అయోధ్య రామ జన్మభూమి సమస్యకు సుప్రీంకోర్టు ద్వారా సానుకూల పరిష్కారాన్ని కనుగొన్నారన్నారు. ఇక త్రిపుల్ తలాక్ బిల్లు వంటి సంచలన నిర్ణయాలు నరేంద్ర మోదీ ప్రధానిగా తీసుకోగలిగారన్నారు. సమర్ధవంతమైన నాయకత్వానికి ఇంకేం నిదర్శనం కావాలన్నారు. ఇక ప్రజాసంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఎక్కడా రాజీలేకుండా పనిచేస్తోందన్నారు. సబ్‌కే సాత్, సబ్‌కే వికాస్ నినాదంతో ప్రధాని మోదీ సబ్‌కా విశ్వాస్ పొందగలిగారన్నారు. జమ్ము-కశ్మీర్‌లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులే ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
వైసీపీ కక్షసాధింపు చర్యలు సరికాదు
గత ప్రభుత్వ తీరుతో విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు వైసీపీని ఆదరించి ఆఖండ మెజారిటీతో గెలిపించారని, అయితే వైసీపీ ప్రభుత్వం విపక్షాలను రాజకీయంగా వేధిస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో బీజేపీ సహా వివిధ రాజకీయ పక్షాలను రాజకీయ దురుద్దేశ్యంతో వేధింపులకు గురిచేసే విధానాలు మార్చుకోవాలన్నారు. రాష్ట్రంలో మాతృభాషను విస్మరించి ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలన్న నిర్ణయం సరికాదని, మాతృభాషను కాపాడుకుంటూనే ఆంగ్లమాధ్యమాన్ని అమలుచేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని సూచించారు. భారత ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడును ఉద్దేశించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించే విషయంలో రాష్ట్ర బీజేపీకి పూర్తి స్వేచ్ఛ ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన శక్తిగా ఎదిగేందుకు తమ వ్యూహాలు తమకున్నాయన్నారు.