ఆంధ్రప్రదేశ్‌

దీక్ష రోజే బాబుకు దెబ్బ మీద దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఇసుక సమస్యపై టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు 12 గంటల దీక్ష చేపట్టిన రోజే వైసీపీ వ్యూహాత్మకంగా ఆయనకు దెబ్బ మీద దెబ్బ తగిలేలా చేసింది. దీక్ష విజయవంతమైన సంతృప్తి చంద్రబాబుకు దక్కకుండా వ్యవహరించింది. కృష్ణా జిల్లాలో బలమైన నాయకులుగా పేరున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ గురువారమే బహిరంగంగా పార్టీ అధినేత చంద్రబాబుపై ధిక్కార స్వరం వినిపించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి నడుస్తానని ఎమ్మెల్యే వంశీ ప్రకటించగా, దేవినేని అవినాష్ ఏకంగా ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఏది ఏమైనా దీక్షా శిబిరంలో చంద్రబాబుకు కార్యకర్తలు ఇచ్చిన ఉత్సాహం, ఆత్మస్థైర్యాన్ని అటు అవినాష్ ఇటు వంశీ దెబ్బ తీసారనే చెప్పవచ్చు. బాబు శిబిరం నుంచే మధ్యమధ్యలో ముఖ్య అనుచరుల ద్వారా వీరిరువురి గురించి ఆరా తీస్తూ గడిపారు. కృష్ణాలో కమ్మ సామాజిక వర్గంలో బలీయమైన దేవినేని నెహ్రూ వర్గానికి ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న అవినాష్ వ్యూహాత్మకంగా పార్టీపైన, చంద్రబాబుపైన విమర్శలు గుప్పిస్తూ వైకాపా కండువా కప్పుకున్నారు. ఇదే సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వంశీ సంచలనాత్మక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే సీఎం జగన్‌కు మద్దతునిస్తానన్నారు. మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలను తనబాటలోకి తీసుకువచ్చి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా కూడా చేస్తానంటూ నర్మగర్భంగా చెప్పారు. దీంతో త్వరలో టీడీపీని వీడనున్న నలుగైదుగురు ఎమ్మెల్యేలు ఎవరన్నది దీక్షా శిబిరంలోనే చర్చనీయాంశంగా మారింది. గతంలో వైకాపా నుంచి గెలుపొందిన
23 మంది ఎమ్మెల్యేలు తమ పదవీకాలం ముగిసే వరకు రాజీనామాలు చేయకుండా వైకాపా ఎమ్మెల్యేగానే ఉంటూ టీడీపీలో కొనసాగారు. నలుగురైతే మంత్రులుగా పని చేశారు. ప్రస్తుతం ఇదే విధానాన్ని కొనసాగించాలన్నది వంశీ వ్యూహంగా స్పష్టమవుతున్నది. గడచిన నెల రోజులుగా వంశీ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ వస్తున్నారు. చంద్రబాబు పక్షాన ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ వెళ్లి రాయబారాలు నడిపారు. అయినా ఫలితం లేదు. కేసులు పట్ల భయం ఉంటే పార్టీపరంగా న్యాయస్థానాల్లో పోరాడతామన్న చంద్రబాబు హామీని కూడా వంశీ విశ్వాసంలోకి తీసుకోలేదు. వంశీ ఎటూ వెళ్లిపోయారు ఇక మిగలిన ఎమ్మెల్యేల్లో ఎవరూ గీత దాటకుండా చూసుకోవాలన్న నిర్ణయంతో బాబు ఉన్నట్లు కన్పిస్తోంది.
బాబుపై నిప్పులు కురిపించిన వంశీ
40 ఏళ్లపాటు ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగిన చంద్రబాబు అధికారం పోయి ఐదారు నెలలు కూడా ఉండలేక పోతున్నారంటూ మీడియా ఎదుట ఎమ్మెల్యే వంశీ దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన కూడా పోకముందే ఉద్యమాలా అని ప్రశ్నించారు. వరదలు, ప్రకృతి వల్ల ఇసుక తీయడం కుదురుతుందా అంటూ వరదలు, వర్షాల్లో కూడా ఇసుక తీసే పరిజ్ఞానం బాబుకు ఉందేమోనని ఎద్దేవా చేశారు. డబ్బున్న వారి పిల్లలతో సమానంగా పేద పిల్లలు కూడా ఆంగ్ల మాధ్యమంలో చదవాలన్న జగన్ ఆలోచనను తాను సమర్థిస్తున్నానన్నారు. బాబు ఎన్నికలకు ముందు ఒక మాట... తర్వాత మరోమాట చెబుతున్నారన్నారు. పదేళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్‌ను ఫణంగా పెట్టి ప్రచారం చేస్తే ఆయన్నికూడా దూరంగా పెట్టారని అన్నారు. అసలు ఏ ఎన్నికల్లోనూ టీడీపీ ఒంటరిగా పోటీ చేసి గెలువలేదన్నారు. జగన్‌ను ప్రజలు మెచ్చారు...అందుకే మద్దతు నివ్వాల్సిన అవసరం ఉందన్నారు. అయితే కేసులు తనకేమి కొత్తకాదు, టీడీపీలో ఉన్న సమయంలోనే ఎన్నో కేసులు ఎదుర్కొన్నానని అన్నారు. తొలుత రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నా అయితే స్థానికుల అభిప్రాయం మేర తన నిర్ణయాన్ని మార్చుకున్నానంటూ టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటునే వైకాపాకు మద్దతు ఇవ్వదలిచానన్నారు.
దేవినేని వర్గాన్ని దూరంగా పెట్టారు: అవినాష్
టీడీపీలో చేరినప్పటి నుంచి తమ అధినేత చంద్రబాబు మాటే నా బాటగా నిబద్ధతతో పని చేసినప్పటికీ జిల్లాలో తమ వర్గాన్ని ఉద్దేశ్యపూర్వకంగా దూరంగా ఉంచుతూ వచ్చినందునే పార్టీని వీడాల్సి వచ్చిందని అవినాష్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తన తండ్రి నెహ్రూ చెప్పినట్లుగా తన వ్యక్తిగత జీవితం కంటే తననే నమ్ముకున్న వారి శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. టీడీపీలో నిబద్ధతతో పని చేసే వారికి ప్రాధాన్యత లేదని, భజన చేసే వారికి నాయకత్వం వత్తాసు పలుకటం తన మనస్సును ఎంతో గాయపరిచాయని అన్నారు. చంద్రబాబు పై తనకు గౌరవం ఎప్పటికీ అలానే ఉంటుందన్నారు. ఇలాఉంటే అవినాష్ గురువారం సాయంత్రం తన అనుచరులతో కలిసి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

*చిత్రం... ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన దేవినేని అవినాష్