ఆంధ్రప్రదేశ్‌

ఏపీఏటీ ఉన్నట్టా.. లేనట్టా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (ఏపీఏటీ) ఏర్పాటుపై వివాదం నెలకొంది. అన్ని దశలూ దాటి, ఇద్దరు సభ్యుల నియామకం ఖరారైన సమయంలో ఒక సీనియర్ ఐఏఎస్ మోకాలడ్డటంతో పరిస్థితి మొదటికొచ్చింది. ప్రభుత్వ, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సీనియారిటీ, పదోన్నతులు, బదిలీలు, నియామకాలు, వేతనాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం మూడు దశాబ్దాల క్రితం ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు అధిక శాతం పెండింగ్‌లో ఉన్నందున పాలనా సౌలభ్యం కోసం రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో ట్రిబ్యునల్ ఏర్పాటైంది. పదవీ విరమణ చేసిన సీనియర్ న్యాయమూర్తి చైర్మన్‌గా ఉంటారు. ఐదుగురు సభ్యులుంటారు. ఇద్దరు న్యాయ వ్యవస్థకు చెందిన వారు, మరో ముగ్గురు పాలనా వ్యవస్థ నుంచి మొత్తం ఐదుగురు సభ్యులు నియమితులవుతున్నారు. 1969లో ప్రత్యేక తెలంగాణ, 1972లో జై ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో నాటి కేంద్ర ప్రభుత్వం 1974లో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డీ)లో 3వ విభాగం ప్రాతిపదికన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా 10 వేల కేసులకు సంబంధించి వాదనలు, తీర్పులు వెలువడేవి. ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం లేదా ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించిన సందర్భాలు లేకపోలేదు. అయితే 80 శాతం కేసులు దీని ద్వారానే పరిష్కారమయ్యేవి. 1989 నుంచి పూర్తి స్థాయిలో రాజ్యాంగంలోని 323ఏ ఆర్టికల్ ప్రకారం న్యాయాధికారాలతో రాజ్యాంగబద్ధంగా ఇది ఏర్పాటైంది. రాష్ట్ర విభజన అనంతరం 2016లో ఓ ఉద్యోగికి సంబంధించిన సమస్య పరిష్కారానికి నేరుగా హైకోర్టును ఆశ్రయించటంతో ట్రిబ్యునల్ విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో 2018 జూన్ 21వ తేదీన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు 2018 జూన్ 29న ముగ్గురు సభ్యుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఆంధ్ర, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 2018 డిసెంబర్ 24న వౌఖిక పరీక్షలు నిర్వహించి అందులో ఇద్దర్ని ఎంపిక చేసి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఆమోదం అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 19న కేంద్ర ప్రభుత్వానికి పంపారు. రాష్ట్రానికి చెందిన రిటైర్డ్
సీనియర్ ఐపీఎస్ అధికారి ఎం మాలకొండయ్య, రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి పీ మల్లికార్జునరావులను ట్రిబ్యునల్ సభ్యులుగా ఎంపికచేయాలని నిర్ణయించి ఫిబ్రవరి 22న కేంద్ర కార్యదర్శి నుంచి లేఖలు రాసింది. ట్రిబ్యునల్ సభ్యులుగా పనిచేసేందుకు తమకెలాంటి అభ్యంతరాలులేవని ఇరువురు రిటైర్డ్ అధికారులు ఫిబ్రవరి 22న రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి లిఖితపూర్వక సమ్మతిని తెలియజేశారు. ఇరువురి వ్యక్తిగత అంశాలపై సీబీఐ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు విచారించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదిక సమర్పిచాయి. ప్రధానమంత్రి నేతృత్వంలోని నియామకాల కమిటీ ట్రిబ్యునల్ సభ్యుల ఎంపికను ఈ ఏడాది జూలై 9న ఆమోదించింది. రాష్టప్రతి కూడా ఆమోదం తెలిపిన తరువాత ఈ ఏడాది జూలై 11న ఇరువురినీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సభ్యులుగా నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపారు. ఇరువురికి నెలసరి వేతనాన్ని నిర్ణయించి 65 సంవత్సరాలు ప్రామాణికంగా ఐదేళ్ల పాటు బాధ్యతల్లో కొనసాగాలని లేఖలు అందాయి. అంత వరకు బాగానే ఉంది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మోకాలడ్డారు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని ముఖ్యమంత్రికి వివరించకుండానే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో షార్ట్‌నోట్ కింద సదరు అధికారి ఈ అంశాన్ని చేర్చారు. సాధారణంగా అజెండాలోని అంశాలు మినహా మిగిలిన షార్ట్‌నోట్‌లను మంత్రులు అంత సీరియస్‌గా పరిగణించరు. ఇదే విషయాన్ని ఆ అధికారి అనుకూలంగా వాడుకున్నారు. అనంతరం ఏపీఏటీ ఏర్పాటు అనవసరమని చెబుతూ ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన ట్రిబ్యునల్‌ను రద్దు చేయటం వల్ల రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు న్యాయ పరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, హైకోర్టులో పెండింగ్ కేసులు అనేకం ఉన్నందున అప్పటికప్పుడు పరిష్కారం కావని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వాదిస్తున్నాయి. దీనిపై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రభుత్వం తరఫున తగిన అఫిడవిట్లు సమర్పించాల్సిందిగా అడ్వొకేట్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ పరంగా వినిపిస్తున్న వాదనలకు హైకోర్టు నుంచి సానుకూల స్పందన రాలేదు. తగిన అఫిడవిట్లతో తిరిగి ఈ నెల 21న హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి ఆదేశాలను కూడా గతంలో పనిచేసిన సీఎస్ విస్మరించటం వల్ల ఈ అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రతిష్టాత్మకంగా మారనుంది. స్వయానా ప్రధానమంత్రి, సుప్రీం, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తుల నిర్ణయాన్ని తప్పు పట్టినట్లవుతుందనే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. కాగా ట్రిబ్యునల్ రద్దు నిర్ణయాన్ని ఏపీ ఎన్జీవోలు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగ వర్గాల సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్ వేదికగా పనిచేస్తుందని చెప్తున్నారు. తెలంగాణలో కూడా ట్రిబ్యునల్ ఏర్పాటు డిమాండ్ ముందుకొస్తోంది. దేశం మొత్తంగా పది రాష్ట్రాల్లో ట్రిబ్యునళ్లు పనిచేస్తున్నాయి. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రద్దు చేయగా హర్యానా రాష్ట్రం పునరుద్ధరించింది. ఉద్యోగులపై తీసుకునే క్రమశిక్షణ చర్యలను సైతం సవాల్ చేస్తూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తున్నారని, దీనికితోడు నిర్వహణ వ్యయం కూడా ప్రభుత్వంపై భారమవుతుందనేది ప్రభుత్వ వర్గాల వాదన. అయితే ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న కేసులను ఎలా పరిష్కరిస్తారు? ట్రిబ్యునల్ సభ్యులుగా నియమితులైన వారికి ఐదేళ్ల పాటు వేతనాలు ఎలా చెల్లిస్తారు? ట్రిబ్యునల్ రద్దుకు గల కారణాలను వివరించాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. మరోవైపు హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై 21న తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ట్రిబ్యునల్ రద్దు నిర్ణయం రాజ్యాంగ పదవులు, నియామకాలను అనుమానించినట్లవుతుందనే వాదనలు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు దీనిపై చర్చకు ఆస్కారం ఇవ్వకుండా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వయంగా ప్రకటించిన గతంలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా హైకోర్టులో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పిటిషన్‌లు దాఖలు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.