ఆంధ్రప్రదేశ్‌

పేద పిల్లలు పెద్ద స్థాయికి ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, నవంబర్ 21: పోటీ ప్రపంచంలో అందరితో సమానంగా పేదల పిల్లలు పోటీపడాలనే సదుద్దేశంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇతరులతో పోటీపడలేక పేదల పిల్లలు డ్రైవర్లుగా, వాచ్‌మెన్లుగా ఉండిపోరాదని, డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్‌లుగా ఎదగడానికే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొమనాపల్లిలో గురువారం జరిగిన బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన ఐదారు నెలల్లోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే తమపై అపనిందలు వేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇకపై ఆంగ్ల మాధ్యమం వద్దంటూ మీ వద్దకు వచ్చే నాయకులు, మీడియా వారిని మీ పిల్లలు, మనుమలు ఏ మీడియంలో చదువుతున్నారు, మీకు ఇంగ్లీషు మీడియం మాకు తెలుగు మీడియమా అని నిలదీయాలని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రైతులకు అండగా నిలవడానికి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి, 46 లక్షల మందికి రూ.13,500 వంతున ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేల వంతున ఆర్థిక సాయం అందించామన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశామని, అందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. ‘నాడు-నేడు’ పేరిట రాష్ట్రంలోని పాఠశాలలను సమూలంగా మార్చేస్తున్నామన్నారు. ప్రభుత్వాసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలను సైతం ‘నాడు-నేడు’ పేరిట అభివృద్ధి చేస్తున్నామన్నారు. బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాస్‌గా మార్చడానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి కృషిచేయడమే తప్పుగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎంతమంది శత్రువులు ఏకమైనా తట్టుకుని నిలబడతానని స్పష్టంచేశారు. ఇప్పటికే ఇన్ని పథకాలు ప్రవేశపెట్టామని, ముందు ముందు మరింత జనరంజకమైన పాలన అందిస్తామన్నారు.
ఆంగ్ల మాధ్యమం విషయంలో ముఖ్యమంత్రి వెంటే...
అంతకుముందు మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ జనరంజక పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఇసుక, ఇంగ్లీషు అంటూ అర్థంపర్థంలేని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేదల పిల్లల అభ్యున్నతికి ప్రవేశపెడుతున్న ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకించడం దారుణమన్నారు. ఇంగ్లీషు కావాలనుకునే వారంతా చప్పట్లతో మద్దతు తెలపాలని సభకు హాజరైన ప్రజలను కోరారు. ఆంగ్ల మాధ్యమానికి తామంతా మద్దతిస్తున్నామని, ఈ విషయంలో ముఖ్యమంత్రి వెంటే నడుస్తామని కన్నబాబు ప్రకటించారు.
*చిత్రం... ట్యాబ్‌లో బటన్ నొక్కి, వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి