ఆంధ్రప్రదేశ్‌

ప్రశ్నిస్తే దాడులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 4: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి పరిపాలన సామర్థ్యం లేదని, దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే భౌతిక, మానసిక దాడులు చేస్తున్నారని మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జగన్ ఆంధ్రప్రదేశ్‌ను భయానక రాష్ట్రంగా మార్చారని ఆయన ధ్వజమెత్తారు. కర్నూలులో ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేవలం సీఎం మొండి వైఖరి కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ అంతర్జాతీయసంస్థ కూడా ముందుకు రాలేదని అన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించేందుకు తాను ఐదేళ్లు పడిన కష్టాన్ని జగన్
5 నెలల్లోనే నీరుగార్చారని వాపోయారు. జగన్ వ్యవహారశైలిపై కేంద్రం పలుమార్లు హెచ్చరించినా వినకపోవడం, కనీసం ఆచరణలో పెట్టకపోవడంతో కేంద్రం కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగన్ వాటిని కొనసాగించడానికి ప్రభుత్వ భూములను అమ్ముతామని అనడం ఆయనకు పాలన చేతకాదు అనడానికి నిదర్శనం అన్నారు. జీఎస్టీ వసూళ్లల్లో గణనీయంగా తగ్గుదల కనిపించడం, ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బనం పెరుగుదల వంటి కారణాలతో నిత్యావసర వస్తువుల ధరలతో పాటు ఇతర అవసరాలకు ప్రజలు పెట్టే ఖర్చు గణనీయంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యం ధర ఎందుకు పెంచాల్సి వచ్చిందో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. పెరిగిన మద్యం ధరల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎటు పోతోందని ఆయన ప్రశ్నించారు. ఇసుక అక్రమంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, తదితర ప్రాంతాలకు పోలీసుల రక్షణతో తరలిస్తున్నారని ఆయన విమర్శించారు. ఐదేళ్ల కాలంలో తాను రూ.1.14 లక్షల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకు సంపదను సృష్టిస్తే ఈ ముఖ్యమంత్రి ప్రజల ఆస్తులను అమ్మకానికి పెట్టి ప్రజలు దివాళా తీసే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. వైసీపీ రంగుల కోసం రూ.1400 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. గతంలో టన్ను బొగ్గు రూ.1600 ఉండగా దానిని ఈ ప్రభుత్వం రూ.3,700కు కొనుగోలు చేస్తోందన్నారు. తన హయాంలో ఒక యూనిట్ విద్యుత్ రూ.4.60కు ఉత్పత్తి అయ్యేదని, అదే విద్యుత్ ఉత్పత్తి ఖర్చు ప్రస్తుతం రూ.11కు పైగా పెరిగిందని అన్నారు. రాజధాని అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఎలాంటి ఖర్చులు చేయకుండా రాజధాని ప్రాంతమైన అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు కింద తీసుకున్నామన్నారు. సీఎం బాబాయి వైయస్ వివేకానందరెడ్డి హత్య కారకులు ఇంటి దొంగలేనని తేలిపోవడంతో జగన్ నోరు మెదపడం లేదని అన్నారు. హత్య జరిగిన సమయంలో తమపై ఆరోపణలు చేస్తూ సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్ ఇప్పుడు ఎందుకు ఆ ఊసు ఎత్తడం లేదని ప్రశ్నించారు.

*చిత్రం... కర్నూలులో విలేఖరులతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు