ఆంధ్రప్రదేశ్‌

ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 4: అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి ముందుచూపులేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. రైతుల సంక్షేమం, ధరల నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. బుధవారం ఇక్కడ ఓ హోటల్‌లో విలేఖరులతో మాట్లాడుతూ గత 4 రోజులుగా రాయలసీమలో పర్యటిస్తున్నపుడు ప్రజలు, రైతులు వైసీపీ 6 నెలల పాలనలో జరుగుతున్న నష్టాలను, కష్టాలను తనకు తెలియజేశారన్నారు. పసుపుధరకు గిట్టుబాటు ధర అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఉల్లిని కూడా ప్రజలకు అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఉల్లి కోసం గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడాల్సిన దుస్థితి నెలకొందన గృహిణులు వాపోతున్నారన్నారు.
నిత్యావసర ధరలు సామాన్య ప్రజలు కొనుగోలు చేసే పరిస్థితి కనబడటం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అంశాలపై ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారన్నారు. హిందూత్వానికి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలను వైకాపా నాయకులు వక్రీకరించారని పవన్ ఆరోపించారు. తాను లౌకిక వాదినని, హిందూ మతాన్ని ఎలా గౌరవిస్తానో... ఇతర మతాలను కూడా అంతే గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. అలాగని హిందూ క్షేత్రాల్లో అన్యమత ప్రచారాన్ని తాను స్వాగతించనన్నారు. విజయవాడలో కనకదుర్గమ్మ క్షేత్రంలో కృష్ణాపుష్కర ఘాట్‌లో 40 మందిని మతమార్పిడి చేస్తే వైకాపా ప్రభుత్వానికి కనబడలేదా అంటూ నిప్పులు చెరిగారు. హైందవ పరిరక్షణపై చిత్తశుద్ధిలేని వైకాపా నాయకులు, ప్రతినిధుల గురించే తాను మాట్లాడుతున్నానే తప్ప ఏనాడూ హిందూత్వం గురించి తప్పుగా మాట్లాడలేదన్నారు. చిత్తూరు జిల్లాలో మన్నవరం ప్రాజెక్ట్, కడప ఉక్కు కర్మాగారాన్ని ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటుచేయలేక పోతున్నారని ప్రశ్నించారు. కియా కార్ల తయారీ సంస్థ పరిశ్రమలు ఏర్పాటుచేస్తే వారిని బెదిరించి వెనక్కు పంపించారని, ఇలా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే పరిశ్రమను వెనక్కి పంపితే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎంత సేపూ గత ప్రభుత్వం వైఫల్యాల గురించి మాట్లాడుతున్నారని, వారి వైఫల్యాలు సరే వైసీపీ ప్రభుత్వం ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని ఆయన ప్రశ్నించారు. కడప జిల్లాలో యురేనియం తవ్వకాలు చేపట్టడంతో తుమ్మలపల్లిలో ప్రజలకు క్యాన్సర్, చర్మవ్యాధులు సోకి ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యురేనియం శుద్ధి కర్మాగారం అవసరమా అని ప్రశ్నించారు. విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ రెండూ అవసరమేనన్నారు. అలా అని ఆంధ్రులకు మాతృభాష అయిన తెలుగును మాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. రాష్ట్రంలోని ఇతర భాషల పాఠశాలలో కూడా ఆ భాషల విద్యను తొలగించి ఆంగ్లభాషను ప్రవేశపెడతారా.. ప్రభుత్వం తేల్చి చెప్పాలన్నారు. హిందూ ధర్మపరిరక్షణకు ఏమి చేయబోతోందో వైకాపా ప్రభుత్వం తేల్చి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పీఎసీ చైర్మన్ నాదెళ్లమనోహర్, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు.
*చిత్రం... తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్