ఆంధ్రప్రదేశ్‌

‘మృగాళ్ల’కు ఉరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 11: మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. చిన్నారులపై లైంగిక దాడులు, మహిళలపై సామూహిక అత్యాచారాలు, యాసిడ్ దాడులు, పాశవికంగా హతమార్చటం తదితర నేరాల తీవ్రతను బట్టి ఉరి శిక్ష నుంచి జీవిత ఖైదు పడేలా ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా చట్ట సవరణ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. శంషాబాద్‌లో గత కొద్ది రోజుల క్రితం జరిగిన దిశ ఉదంతంపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇలాంటి మానవ మృగాలకు మూడు వారాల్లో 21వ రోజునే శిక్షపడేలా చట్టాల్లో మార్పులు తీసుకువస్తామని ప్రకటించారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం-2019 (ఏపీ దిశ యాక్ట్), ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్ట్ ఫర్ స్పెసిఫైడ్ అఫెనె్సస్ అగైనెస్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ యాక్ట్-2019కు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ చట్టాల ప్రకారం మహిళలపై అత్యాచారాలు లాంటి క్రూరమైన నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించే ఆధారాలు ఉంటే ఉరి శిక్ష తప్పని సరి చేస్తూ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. (కన్‌క్లూజివ్ ఎవిడెన్స్) కింద 21 రోజుల్లో తీర్పు చెప్పేందుకు వీలుగా జిల్లాల్లో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వారం రోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తి అనంతరం మొత్తం 21 రోజుల్లో తీర్పునిచ్చే విధంగా చట్ట సవరణ చేసింది. ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ రూపొందించిన బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనుంది. అత్యాచారాలు, సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడు లు, వేధింపులు, లైంగిక వేధింపులు, సోషల్ మీడియా ద్వారా మహిళల పట్ల అసభ్యకర పోస్టింగ్‌లు, చిన్నారులపై లైంగిక దాడులు తదితర క్రూరమైన నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు
చేయటం ద్వారా సత్వర న్యాయం లక్ష్యంగా చట్టాలకు పదును పెట్టింది. సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగిచేలా పోస్టింగ్‌లు పెడితే ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 354 (ఈ) కింద చర్యలు తీసుకునేలా బిల్లులో అంశాలు చేర్చారు. తొలిసారి తప్పు జరిగితే రెండేళ్ల జైలు, రెండోసారి పునరావృతమైతే నాలుగేళ్ల వరకు జైలు శిక్ష, మెయిల్స్, సోషల్ మీడియా, డిజిటల్ మీడియాల్లో మహిళల హక్కులకు, గౌరవానికి భంగం కలిగించినా ఇదే రకమైన శిక్ష విధించేలా చట్టసవరణ బిల్లుకు రూపకల్పన చేశారు. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354 (ఎఫ్) కింద పదేళ్ల నుంచి 14 సంవత్సరాల వరకు జీవిత ఖైదు విధించేలా శిక్షను అమలు చేయనున్నారు. పోస్కో చట్టం కింద ఇప్పటి వరకు 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉండేది. ఈ శిక్షను పెంచుతూ బిల్లులో అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కాపు ఉద్యమ కేసులు ఎత్తివేత
కాపులకు బీసీ రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా రాష్టవ్య్రాప్తంగా నమోదైన కేసుల ఉపసంహరణకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తుని రైలు దగ్ధం సంఘటన సహా కాపు ఉద్యమ సందర్భంగా నమోదైన కేసులను ఉపసంహరించేందుకు కేబినెట్ ఆమోదం లభించింది. భోగాపురం భూ సేకరణ సందర్భంగా నమోదైన కేసులను కూడా ఎత్తివేయాలని తీర్మానించింది.
వైఎస్సార్ పింఛన్ మార్గదర్శకాలు సడలింపు
వైఎస్సార్ పింఛన్ పథకంలో నిబంధనల సడలింపునకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. గతంలో ఉన్న మార్గదర్శకాలను సవరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలసరి ఆదాయం రూ. 10వేలు, పట్టణాల్లో రూ. 12వేల లోపు ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తుంది. ఆదాయ పరిమితి పెంపుతో పాటు 3 ఎకరాల మాగాణి, పదెకరాల మెట్ట లేదా రెండూ కలిపి పదెకరాల్లోపుఉన్న వారు కూడా అర్హులుగా ప్రకటించింది. సొంత కారు ఉంటే అనర్హులు. ట్యాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు ఉన్న వారికి మినహాయింపు నిచ్చింది. పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగుల్లో ఇళ్లు ఉన్న వారు కూడా అర్హులుగా గుర్తిస్తారు. కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లించే వారిని అనర్హులుగా పరిగణిస్తారు.
ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు
రాష్ట్రంలో పేద వర్గాలకు బీమా సదుపాయాన్ని అమలు చేసేందుకు ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 101 కోట్లతో షేర్ క్యాపిటల్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ సమ్మతించింది.
మిల్లెట్, పల్సెస్ బోర్డు ముసాయిదాలకు ఆమోదం
ఏపీ మిల్లెట్ బోర్డు చట్టం -2019, ఏపీ పల్సెస్ బోర్డు చట్టం-2019 ముసాయిదా బిల్లులను మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. కరవు, వర్షాభావ ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు మిల్లెట్ బోర్డును, అపరాలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పల్సెస్ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ రుణ పరిమితిని మరో రూ. 3వేల కోట్లకు పెంచేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ప్రస్తుతం కార్పొరేషన్‌కు రూ. 2 వేల కోట్ల రుణ పరపతి ఉంది. ఏపీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ ముసాయిదా బిల్లును కూడా కేబినెట్ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ టాక్స్ ఆన్ ప్రొఫెషన్స్, ట్రేడ్స్, కౌలింగ్స్ అండ్ ఎంప్లాయిమెంట్ అమెండ్‌మెంట్ బిల్-2019, ఏపీ కోఆపరేటివ్ సోసైటీస్ (ఏపీసీఎస్) చట్టం 1964 సెక్షన్-21 ఏ (1)(ఈ) సవరణలకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది.
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం ఏర్పాటు
ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీని విలీనం చేసేందుకు కొత్తగా ఏపీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రవాణా, రోడ్లు- రహదారులు- భవనాల శాఖలోనే ఈ విభాగం ఏర్పాటవుతుంది. ఆర్టీసీలో వివిధ కేటగిరిల్లో ఉన్న 51,488 మంది ఉద్యోగుల సంఖ్యకు తగ్గట్టుగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించింది. ప్రస్తుతం ఉన్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవలను కొనసాగించాలని కూడా నిర్ణయించింది.
గ్రామ సచివాలయ పర్యవేక్షణకు కొత్త విభాగం
గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల పర్యవేక్షణకు ప్రభుత్వంలో కొత్త శాఖను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం లభించింది. గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాలపై సమీక్ష, పర్యవేక్షణలకు బలమైన యంత్రాంగం ఏర్పాటు చేయటమే దీని ముఖ్య ఉద్దేశమని మంత్రివర్గం అభిప్రాయ పడింది. లక్ష్యాల సాధనకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకునే దిశగా అడుగులు వేయాలని సూచనలిచ్చింది. ఉద్యోగుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవటంతో పాటు వారిలో లక్ష్యాలపై స్పష్టత తీసుకు రావటం, భాగస్వామ్యం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించేందుకే ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
అక్రమ మద్యం కేసుల్లో కఠిన శిక్ష
రాష్ట్రంలో అక్రమ మద్యం తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా కఠిన శిక్షలకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లును కేబిటెన్ ఆమోదించింది. ఈ నేరాలను నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తారు. 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష అమలవుతుంది. మొదటి సారి పట్టుబడితే రూ. 2లక్షల జరిమానా, రెండోసారి కేసు నమోదైతే రూ. 5లక్షలు జరిమానా విధిస్తారు. బార్లలో మద్యం అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ ఫీజు కంటే 2 రెట్లు జరిమానా, రెండోసారి తప్పుచేస్తే లైసెన్స్ రద్దు చేసే విధంగా ముసాయిదా బిల్లుకు రూపకల్పన జరిగింది.
వీఓఏ, సంఘమిత్ర, యానిమేటర్ల వేతనాలు పెంపు
రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వీఓఏ, సంఘమిత్ర, యానిమేటర్లకు జీతాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం సమర్ధించింది. నెలకు రూ. 10వేలకు వేతనాలు పెంచేందుకు ఆమోదం తెలిపింది. దీనివల్ల 27,797 మందికి లబ్ధి చేకూరుతుంది.
పంగూరులో ఇండస్ట్రియల్ పార్క్
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పంగూరులో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అవసరమైన 15 ఎకరాల 28 సెంట్ల భూమిని ఏపీఐఐసీకి కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదించింది.
అన్ని పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన అనంతరం ఆపై ఒక్కో ఏడాది ఒక్కో తరగతి చొప్పున ఇంగ్లీష్‌ను అమలు చేసేందుకు కేబినెట్ సమ్మతించింది. కాగా రాష్ట్ర సాంస్కృతిక విభాగం కమిషన్ చైర్‌పర్సన్‌గా వంగపండు ఉష నియామకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన అసైన్డ్ భూములకు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్ల కేటాయింపును రద్దు చేసేందుకు మంత్రివర్గ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. 2016 ఫిబ్రవరి 17న అప్పటి ప్రభుత్వం జారీచేసిన జీవో 41 ప్రకారం ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన అసైన్డ్ భూములకు నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించారు. వీటిని ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్-1977) నాటి చట్టాన్ని ఉల్లంఘించటమే అవుతుందని కేబినెట్ అభిప్రాయపడింది. అసలైన అసైన్డ్ దారులకు నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయించాలని నిర్ణయించింది.
ఏపీ విశ్వ విద్యాలయాల చట్ట సవరణ
రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఏపీ స్టేట్ యూనివర్శిటీ యాక్ట్‌లో సవరణలు తీసుకు వచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
కడపలో ఆర్కిటెక్చర్, కర్నూలులో క్లస్టర్ వర్శిటీల ఏర్పాటు
కడప జిల్లాలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వ విద్యాలయం ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం లభించింది. యూనివర్శిటీలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఏర్పాటవుతుంది. రెండు కాలేజీల్లో ఐదు విభాగాలు ఏర్పాటు కానున్నాయి. ఇదిలా ఉండగా కర్నూలులో క్లస్టర్ యూనివర్శిటీ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల, కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను విలీనం చేస్తూ క్లస్టర్ యూనివర్శిటీగా ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై మంత్రిమండలి సానుకూలంగా స్పందించింది.

*చిత్రం...ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి