ఆంధ్రప్రదేశ్‌

నా ఇటుక.. నా రాజధాని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 16: రాష్ట్ర రాజధాని అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా పిడుగు పడినట్లు రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డట్లయింది. దీంతో రాజధాని అమరావతి ప్రాంత ప్రజలు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమారు నాలుగు వారాలుగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టిన ప్రజలకు ప్రతిపక్ష తెలుగుదేశం, బీజేపీ, జనసేన, సీపీఐ బహిరంగ మద్దతు ప్రకటించాయి. అమరావతి పూర్తిస్థాయి రాజధాని కాకుండా కేవలం శాసనసభ సమావేశాలకు మాత్రమే పరిమితం కానుందని స్పష్టమైన సంకేతాలు
ఇచ్చిన ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి విరాళాల స్వీకరణ మాత్రం నిలిపివేయలేదు. ‘నా ఇటుక-నా అమరావతి’ పేర గత తెలుగుదేశం ప్రభుత్వం ఒక వెబ్‌సైట్ ప్రారంభించి ఆన్‌లైన్‌లో విరాళాల స్వీకరణకు 2014 ఆగస్టు 8న శ్రీకారం చుట్టింది. నాటి నుంచి నేటి వరకు అమరావతి నగర నిర్మాణానికి విరాళాల స్వీకరణ కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ఉద్యమం నడుస్తున్నా విరాళాలు ఇచ్చే వారు ఇస్తూనే ఉన్నారు. కాగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకున్న అనేక నిర్ణయాలను రద్దు చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అమరావతి విరాళాల స్వీకరణ కార్యక్రమాన్ని మాత్రం రద్దు చేయలేదు. అంతేగాకుండా అమరావతిలో ఏమీ లేదని చెబుతూనే నిర్మాణం పూర్తయి కార్యకలాపాలు ప్రారంభించిన భవనాలు, నిర్మాణంలో ఉన్న భవనాలతో పాటు రహదారులు, పార్కులు వంటివన్నీ అమరావతి వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నాయి. ఈ వెబ్‌సైట్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణల ఫోటోలు మాత్రమే కొత్తవి. ఇతర అన్ని వివరాలు గత ప్రభుత్వంలో పొందుపర్చినవే కావడం విశేషం. గత ప్రభుత్వం ప్రజల నుంచి విరాళాలు స్వీకరిస్తూనే అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ దాతలను ఆకర్శించే ప్రయత్నం చేసింది. అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలతో పాటు నిర్మాణంలో ఉన్న భవనాలు, రహదారులు వంటివన్నీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఈ వెబ్‌సైట్‌లో దాతలు ఒక్కో ఇటుక రూ. 10 వంతున ఎన్ని ఇటుకలైనా కొనవచ్చని స్పష్టం చేశారు. విరాళాలు ఇచ్చిన దాతలకు పలు రాయితీలు కూడా కల్పించారు. దీంతో దాతలు అమరావతి నిర్మాణానికి విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే ప్రభుత్వం ఆశించినంతగా కాకపోయినా ఓ మోస్తారుగా స్పందించారు. అమరావతి నగర నిర్మాణానికి 2014 ఆగస్టు 8వ తేదీ నుంచి 2020 జనవరి 16వ తేదీ వరకు 2,28,800 మంది దాతలు 57,98,502 లక్షల ఇటుకలు కొనుగోలు చేసి రూ.5,79,85,020ను విరాళంగా అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రాబాబు ఉన్నంత వరకు విరాళాలు బాగానే వచ్చినా ఆ తరువాత మందగించాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 90 మంది రూ.17,240 మాత్రమే విరాళంగా ఇచ్చారు. కాగా రాజధానుల అంశంపై సీఎం తన అభిప్రాయాన్ని తెలిపిన గత ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి 31 వరకు 15 మంది రూ.590 విరాళంగా ఆన్‌లైన్‌లో ఇచ్చారు. ఒకవైపు ఉద్యమం కొనసాగుతున్నా అమరావతికి విరాళాలు ఇచ్చే వారు ఇస్తూనే ఉన్నారు. ఈనెలలో ఇప్పటి వరకు 15 మంది రూ.7,380 అమరావతి నిర్మాణం కోసం విరాళం ఇచ్చారు. రాజధాని అంశం వేడివేడిగా ఉన్నప్పటికీ దాతలు విరాళాలు ఇవ్వడంలో ఏదో మతలబు ఉంటుందని విశే్లషకులు అనుమానిస్తుండటం గమనార్హం.

'చిత్రం...నిర్మాణం తుది దశలో ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల నివాస గృహాల సముదాయాలు