ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీకి అ‘టెన్షన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 18: మూడు రాజధానుల ప్రతిపాదనల నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలకు అటు ప్రభుత్వం, ఇటు రైతులు, రాజకీయ పక్షాల్లో అ‘టెన్షన్’ నెలకొంది. సమావేశాలను స్తంభింప చేసేందుకు రాజధాని ప్రాంత రైతులు, ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా చలో అసెంబ్లీ, జైల్ భరో కార్యక్రమాలకు అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. మరోవైపు రైతులు
గత 32 రోజులుగా గ్రామాల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. రాజధాని తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉప సంహరించుకోవాలనే డిమాండ్‌తో అసెంబ్లీ ముట్టడికి సమాయత్తమవుతున్నారు. గత నెల రోజులుగా అమరావతి గ్రామాల్లో జన జీవనం స్తంభించింది. సచివాలయానికి వెళ్లే రహదార్లను రైతులు దిగ్బంధించారు. రోడ్లపైనే ఆందోళన నిర్వహిస్తున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో తరచు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో రాజధాని గ్రామాల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. 20 నుంచి మూడు రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. రాజధాని వికేంద్రీకరణపై కీలక బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రతిఘటించేందుకు రాజధాని రైతులు, ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. దీంతో నిఘా తీవ్రతరం చేయటంతో పాటు భారీగా పోలీస్ బలగాలను తరలిస్తున్నారు. సచివాలయం, శాసనసభ మార్గంలో మందడం, వెలగపూడి వద్ద రైతులు ఆందోళన కొనసాగుతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు అనే్వషిస్తున్నారు. సమావేశాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ మార్గంలో రాకపోకలు కొనసాగించేందుకు కొత్తగా మరో రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణాయపాలెం చెరువు మీదుగా సచివాలయానికి గతంలో ఏర్పాటుచేసిన రోడ్డు శిథిలావస్థకు చేరుకుంది. సమావేశాల సందర్భంగా ముఖ్యుల రాకపోకల కోసం ప్రస్తుతం ఈ రహదారికి మరమ్మతులు జరుపుతున్నారు. సచివాలయ మార్గంలో మందడం, వెలగపూడి గ్రామాల రైతులు రోడ్లపై ఆందోళన కొనసాగిస్తున్నందున ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కొత్త రూటుకు మెరుగులు దిద్దుతున్నారు. భద్రతా బలగాలను మొహరించటంతో పాటు జేఏసీ నేతలు, ప్రతిపక్ష నాయకులు, రైతులకు నేరుగా నోటీసులు అందజేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. సమావేశాల సందర్భంగా సభలు, సమావేశాలు, ఆందోళనలకు అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవనే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో సమావేశాల ముందు నుంచే ఉత్కంఠత నెలకొంది. రాజధానిపై మూడు కమిటీల నివేదికలపై చర్చించేందుకు 20వ తేదీన ఉదయం 9 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. అనంతరం 10 గంటలకు బీఏసీలో సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారు. 11 గంటల నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయి. మూడు రాజధానులపై ప్రభుత్వం ప్రకటన చేయనుండటంతో ఆందోళన ముమ్మరం చేయాలని రైతులు నిర్ణయించారు. దీంతో అడుగడుగునా పోలీసులు పహారా కాస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులకు నోటీసులు అందుతున్నాయి. గ్రామాల్లో రైతులు, రాజకీయ నేతల కదలికలపై నిఘా పెంచారు.