ఆంధ్రప్రదేశ్‌

నోటీసుపై చర్చకు పట్టుబట్టిన టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 21: రాష్ట్ర శాసన మండలి సమావేశం వాడివేడిగా జరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల నినాదాలతో హోరెత్తింది. రూల్ 71 కింద ఇచ్చిన నోటీసుపై ముందుగా చర్చ జరపాలని టీడీపీ డిమాండ్ చేస్తూ సభ కార్యకలాపాలను స్తంభింప చేసింది. ప్రభుత్వ బిజినెస్‌కు ప్రాధాన్యత ఇస్తూ బిల్లులపై చర్చ ముందుగా జరపాలని ప్రభుత్వం తరపున మంత్రులు డిమాండ్ చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో నాలుగు సార్లు మండలి వాయిదా పడింది. శాసన మండలి సమావేశాలు మంగళవారం ప్రారంభం కాగానే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు పెట్టేందుకు ప్రయత్నించడాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. రూల్ 71 కింద ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఇచ్చిన నోటీసుపై ముందుగా చర్చకు అనుమతించాలని శాసన మండలి చైర్మన్ షరీఫ్‌ను టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు కోరారు. మండలిలో సభ్యుల మెజారిటీని లెక్కించి చర్చకు అనుమతిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.
దీనిపై వెంటనే చర్చ ప్రారంభించాలని కోరారు. దీనిపై మంత్రి బుగ్గన స్పందిస్తూ రెండు బిల్లులు అసెంబ్లీలో అమోదం పొందాయని, ఈ ప్రక్రియను మధ్యలో ఆపవద్దని కోరారు. మంత్రి మాటలు విచిత్రంగా ఉన్నాయని, బిల్లులు ఆమోదం పొందాక ఇంక ప్రశ్నించే అవకాశం ఏమి ఉంటుందని యనమల ప్రశ్నించారు. మంత్రి వర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని తమపై రుద్దవద్దని సూచించారు. తాము ఇచ్చిన నోటీసుపై ముందుగా చర్చ జరపాలని, చైర్మన్ కూడా రూలింగ్ ఇచ్చారని యనమల వ్యాఖ్యానించారు. రూల్ 71 కింద ఇచ్చిన నోటీసుపై వారం రోజుల్లోగా చర్చ జరపవచ్చని, ప్రభుత్వ బిల్లులకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి బుగ్గన కోరారు. చైర్మన్ రూలింగ్ ఇచ్చారు కనుక తాము ఇచ్చిన నోటీసుపై చర్చ జరపాలని యనమల డిమాండ్ చేశారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ, తాను ఇప్పటికే నోటీసు కింద చర్చకు అనుమతిస్తూ రూలింగ్ ఇచ్చానని, అయితే ఎంత సేపు దీనిపై చర్చ చేద్దామన్న అంశాన్ని తన చాంబర్‌లో కలిసి నిర్ణయిద్దామన్నారు. బిల్లులపై చర్చను ఆపేందుకు డొంక తిరుగుడుగా వస్తే ఊరుకోమని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. నోటీసు, బిల్లులపై చర్చలపై నిర్ణయం తీసుకునేందుకు కొంతసేపు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. దాదాపు గంట సేపటి తరువాత మండలి తిరిగి సమావేశమైంది. రూల్ 71 కింద నోటీసుపై రెండు గంటలు చర్చించి, తరువాత బిల్లులపై చర్చిద్దామని చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. దీనిపై బుగ్గన అభ్యంతరం తెలిపారు. కొత్త సంప్రదాయాలను తీసుకురావద్దని, దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారుతుందని సూచించారు. ప్రభుత్వ బిల్లులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. రూల్ 71 కింద నోటీసును అసమ్మతి తెలిపేందుకు తప్ప, మండలిలో బిజినెస్ ఆపేందుకు కాదని స్పష్టం చేశారు. అదే సబ్జెక్టు బిల్లులో కూడా ఉందని, అందులో మాట్లాడవచ్చన్నారు. దీంతో మంత్రులు సహా వైకాపా సభ్యులు లేచి నిలబడి అభ్యంతరం తెలిపారు. ముందుగా బిల్లులపై చర్చ జరపాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. తాను రూలింగ్ ఇచ్చానని చైర్మన్ తెలిపారు. ఇది సరికాదని, ఏ పార్టీకి సంబంధం లేని చైర్‌లో ఉన్నారని గుర్తు చేశారు. దీంతో చైర్మన్‌ని బెదిరించవద్దని టీడీపీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. నిబంధనలకు లోబడి నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. బిల్లులను వాయిదా వేయమని ఉందా అని ప్రశ్నించారు. ఆ నోటీసుకు రూల్ 71 వర్తించదని స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని చైర్మన్‌కు సూచించారు. మంత్రులు సహా వైకాపా సభ్యులు నిలబడి తమ అభ్యంతరాన్ని తెలిపారు. దీనిపై యనమల స్పందిస్తూ, పాలసీని వ్యతిరేకిస్తున్నామని, ముందు తమ నోటీసుపై చర్చ జరగాలన్నారు. చర్చకు ప్రభుత్వం అడ్డుపడటం విచిత్రంగా ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకునే ప్రయత్నం సరికాదని, దయచేసి ప్రోత్సహించవద్దని చైర్మన్‌కు మంత్రి బొత్స సూచించారు. ఒక దశలో బిల్లులు ప్రాధాన్యత అంశం కాదని రూలింగ్ ఇవ్వాలని చైర్మన్‌ను మంత్రి బొత్స కోరారు. చైర్మన్‌కు ఆదేశాలు ఇవ్వడం సరికాదని టీడీసీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ సంప్రదాయం అమలు చేస్తే, ఇక ప్రభుత్వ బిజినెస్ జరగదని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. చైర్మన్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నారని టీడీపీ ఆరోపించింది. వాగ్వివాదాల నేపథ్యంలో వైకాపా సభ్యులు ఇక్బాల్, జంగా కృష్ణమూర్తి తదితరులు పోడియంలోకి వచ్చారు. దీంతో టీడీపీ సభ్యులు షేమ్.. షేమ్ అంటూ నినాదాలు చేశారు. 13 మంది మంత్రులు, వైకాపా సభ్యులు నిలబడి బిల్లులపై ముందుగా చర్చ జరపాలని డిమాండ్ చేశారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ యనమల లేచి అసెంబ్లీ నుంచి శాసన మండలికి వచ్చిన బిల్లులపై చర్చకు రెండు రోజుల సమయం ఉంటుందని తెలిపారు.
విచక్షణా అధికారం రాజకీయాల కోసం కాకుండా, ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని, సభ ఔన్నత్యం కాపాడాలని చైర్మన్‌ను బొత్స కోరారు. సభలో మచ్చగా ఉండిపోతుందన్నారు. చైర్మన్‌తో మంత్రులు బిల్లులపై చర్చకు పట్టుబట్టారు. ముందుగా తమ నోటీసుపై చర్చించాకే, బిల్లులపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను కొంతసేపు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. మరోసారి సభ మధ్యాహ్నం 1.04 గంటలకు సమావేశమైంది. కానీ గందరగోళం నెలకొనడంతో పది నిమిషాల తరువాత వాయిదా పడింది. తిరిగి సభ మూడు గంటల తరువాత సాయంత్రం 4.20 గంటలకు సమావేశమైంది. ముందుగా నోటీసుపై చర్చ, తరువాత బిల్లుపై చర్చిద్దామని చైర్మన్ ప్రకటించారు.
వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడంతో తెలుగుదేశం పార్టీ అడ్డుకట్టవేసింది. ఉదయం నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ మండలిలో కార్యకలాపాలు స్తంభించాయి.