ఆంధ్రప్రదేశ్‌

ప్రజల మేలుకే రద్దు నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 27: ప్రజలకు మేలు చేసేందుకే శాసనమండలి రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. చట్టసభలు విశ్వసనీయతకు కేంద్రాలు కావాలన్నారు. ప్రజలచే నేరుగా ఎన్నుకైన ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అడుగడుగునా అడ్డుకునే ఇలాంటి సభలు అనవసరమని వ్యాఖ్యానించారు. శాసనమండలి రద్దు తీర్మానంపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చలో చివరగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పెద్దల సభలు ప్రభుత్వాన్ని గౌరవిస్తూ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని, రాజకీయ దురుద్దేశంతో పక్కదారి పట్టించేవి కారాదన్నారు. ప్రజలచే ఎన్నికైన సభలు హుందాగా పనిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (2) ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏర్పాటైన శాసనసభ నేరుగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మేధావులు తక్కువగా ఉన్నందున శాసనసభకు సలహాలిచ్చేందుకు పెద్దలసభను ముందుకు తెచ్చారని ప్రస్తుతం శాసనసభలోనే ఐఏఎస్ స్థాయి నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుకున్న విద్యావంతులనేక మంది ఉండగా ఇంక మండలి ఎందుకని ప్రశ్నించారు. ఆర్థిక విషయాల్లో కూడా ఏటా మండలిపై రూ. 60 కోట్ల భారం పడుతోందని అంటే ఐదేళ్లకు రూ. 300 కోట్ల ప్రజాధనం వృధా అవుతుందని తెలిపారు. దేశం మొత్తంగా ఆరు రాష్ట్రాల్లో మినహా మిగిలిన 22 రాష్ట్రాల్లోలేని సభలు మనకెందుకని ప్రశ్నించారు. రాజ్యాంగంలో సైతం మండలి రద్దు, పునరుద్ధరణ అధికారాలు శాసనసభకు కేటాయించారని గుర్తుచేశారు. రాజకీయాలకు వేదికగా మారుతున్న మండలిని రద్దు చేయాలని అసోం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ తీర్మానించుకున్నాయని తెలిపారు. రాష్ట్ర కేబినెట్ కూడా శాసనసభకే తప్ప మండలికి జవాబుదారీ కాదన్నారు. ప్రజా ప్రయోజనాలపై చిత్తశుద్ధిలేని మండలిపై డబ్బుఖర్చు దండగన్నారు. రూపాయి కూడా దీనిపై ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. దిగజారుడు
రాజకీయాలకు ఆలవాలమైన మండలిని రద్దు చేస్తేనే మంచిదని, ప్రజలు కూడా దీనిపై సానుకూలంగా స్పందిస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర శాసనమండలిలో గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు దురదృష్ట కరమన్నారు. పేదలకు ఆంగ్ల విద్యతో ప్రపంచస్థాయిలో పోటీకి నిలబడే అంశంపై ప్రతిపాదించిన బిల్లుతో పాటు ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేసే బిల్లులను మండలి వ్యతిరేకించటం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రజోపయోగ కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డు తగులుతూ జాప్యం చేయటం వల్ల నష్టం జరుగుతుందన్నారు. అభివృద్ధి కేంద్రీకరణ వల్ల రాష్ట్రం ఇప్పటికే చాలా నష్టపోయిందని, ప్రాంతీయ అసమానతలు నివురు గప్పిన నిప్పులా రగులుతున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల సమతుల అభివృద్ధికి ప్రవేశపెట్టిన బిల్లులను వ్యతిరేకించటంతో పాటు సెలక్ట్ కమిటీకి పంపటం, అందులోనూ అప్రజాస్వామికంగా చైర్మన్ వ్యవహరించటం వెనుక రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనేది తేలిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ మనుగడ సాధ్యపడాలంటే ప్రజా ప్రయోజనాలు నెరవేరాలంటే ఈ వ్యవస్థకు చరమగీతం పాడాల్సి ఉందన్నారు. మండలి రద్దు అంశానికి సంబంధించి రకరకాల దుష్ప్రచారం సాగుతోందని, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్సీలకు డబ్బు ఎర వేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఖండించారు. చేసిన తప్పును సరిదిద్దుకుంటారనే మూడు రోజుల గడువు ఇచ్చామన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబులా దిగజారుడు రాజకీయాలు చేసేందుకు తాము అధికారంలోకి రాలేదన్నారు. రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకురావాలనేదే తమ ప్రయత్నంగా చెప్పారు. 1983లో ఓ వ్యక్తి ప్రయోజనాలకే మండలిని రద్దు చేశారని, ఇప్పుడు ప్రజలందరి ప్రయోజనాలే ప్రామాణికంగా రద్దు చేస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. మండలి పునరుద్ధరణ సందర్భంగా చంద్రబాబు ఉమ్మడి శాసనసభలో చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా సభలో ప్రదర్శించారు. నాడు వైఎస్ ప్రభుత్వం మండలిని పునరుద్ధరిస్తే ప్రజాభిప్రాయం తీసుకోవాలని, మండలి అనవసరమని చెప్పి ఇప్పుడు వ్యతిరేకించటంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్యాకేజీని సమర్థించటం, మొదట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెగపొగిడి, ఎన్డీయే నుంచి వైదొలగిన అనంతరం కాంగ్రెస్‌తో చేతులు కలపటం రాహుల్ గాంధీని చంద్రబాబు ప్రశంసించటం వంటివి రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఏ విషయంలోనూ ఆయనకు స్థిరత్వం లేదన్నారు. శాసనసభలో ఆంగ్ల మాధ్యమాన్ని సమర్థిస్తూ మండలిలో వ్యతిరేకించేలా రాజకీయాలు చేస్తారని విమర్శించారు. తనకు పిల్లనిచ్చిన మామను సైతం వెన్నుపోటు పొడిచే సంస్కృతి చంద్రబాబుదని వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో రైతులను మోసగించి సింగపూర్, మలేషియా అంటూ బాహుబలి గ్రాఫిక్స్‌ను తెరపైకి తెచ్చి వంచించారని ధ్వజమెత్తారు. తాము వాస్తవికతతో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే భావనతోనే బిల్లులు ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. రైతులకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ కంటే మెరుగ్గా తమ ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. రైతులకు పదేళ్ల కౌలు గడువును 15 ఏళ్లకు పెంచటంతో పాటు రాజధానిలో భూమిలేని రైతు కూలీలకు ఇచ్చే పింఛన్‌ను రూ. 5వేలకు రెట్టింపు చేశామని, అసైన్డ్ భూముల రైతులకు కూడా నివాస స్థలాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే అన్నిరకాల వసతులు కలిగిన విశాఖపట్నంలో పాలనా రాజధానిని, 1937 శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం న్యాయసమ్మతంగా కర్నూలులో ఏర్పాటు చేయాల్సిన హైకోర్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే అన్యాయమెలా అవుతుందని నిలదీశారు. సభలు, మండళ్లు ప్రజలకు మేలు చేసేవిగా ఉండాలని కుట్రలు, రాజకీయ కోణంతో నష్టం కలిగించేవిగా ఉండకూడదనే ఉద్దేశంతోనే మండలి రద్దుకు నిర్ణయం తీసుకున్నట్లు తన ప్రసంగాన్ని ముగించారు.

*చిత్రం... అసెంబ్లీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి