ఆంధ్రప్రదేశ్‌

రాజధాని ఉద్యమం ఉధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 28: మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, అమరావతినే ఆంధ్ర రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు, వివిధ జేఏసిలు, ఐకాసాలు చేపట్టిన ఉద్యమం ఉద్ధృతమవుతోంది. మంగళవారం నాటికి రైతుల నిరసనలు, ఆందోళనలు 42వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, నవులూరు, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, నిడమర్రు తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున మహాధర్నాలు, దీక్షలు నిర్వహించారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారన్న అక్కసుతో మండలిని రద్దు చేయడంపై రాజధాని ప్రాంత రైతులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి నిరసనగా వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా కృష్ణానదిలో రైతులు, మహిళలు జలదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 40 రోజులకు పైగా తాము పలు రూపాల్లో నిరసన, ఆందోళనలు చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్పందించక పోవడం శోచనీయమన్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కోరిన వెంటనే తాము భూములు ఇస్తే ఈ రోజు ఇలా రోడ్లపాలు చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. జై ఆంధ్రప్రదేశ్, సేవ్ అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి శాసనమండలి చైర్మన్ షరీఫ్‌పై ప్రశంసలు కురిపించారు. కాగా రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తుళ్లూరులో చేపట్టిన ఆందోళనలో భాగంగా రైతులతో పాటు మహిళలు సైతం భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. ఆకుపచ్చ రంగు జెండాలు చేతపట్టి తుళ్లూరు వీధుల్లో కలియదిరుగుతూ సేవ్ అమరావతి నినాదాలతో హోరెత్తించారు. ఈ బైకు ర్యాలీకి తుళ్లూరుతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇలా ఉండగా అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు సంఘీభావం తెలిపేందుకు కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన రైతులు, నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు ఇక్కడకు తరలివచ్చి తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. కాగా రాయచూర్ రైతులు అంతకుముందు మంగళగిరిలోని ఎన్‌టీఆర్ భవన్‌కు వెళ్లి చంద్రబాబును కలిశారు. రాయచూర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో అమరావతి రైతుల ఉద్యమ నిర్వహణకు సుమారు 3 లక్షల రూపాయలకు పైగా విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా రాయచూర్ రైతులు మాట్లాడుతూ కర్ణాటకలోని ఆంధ్రుల మద్దతు రాజధాని అమరావతి రైతులకు ఉందని, అవసరమైతే రాష్టప్రతికి తామంతా కర్ణాటక నుండే వినతులు పంపుతామని చంద్రబాబుకు తెలిపారు. రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాలను తిరుగుతూ రైతులు, రైతు కూలీలను చైతన్య పరుస్తామన్నారు. కాగా రాజధాని రైతుల దీక్షలు, ఉద్యమాలకు విరాళాలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఎన్‌ఆర్‌ఐలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు తమవంతుగా అమరావతి ఉద్యమ జేఏసి నిధికి ఆర్థికసాయం అందజేయడంతో పాటు రాజధాని పరిధి గ్రామాల్లో పర్యటించి రైతులకు మద్దతు తెలియజేస్తున్నారు. ఇలా ఉండగా గడిచిన 40 రోజులుగా అమరావతి రాజధాని కోసం జరుగుతున్న ఆందోళనలో పాల్గొంటూ వస్తున్న మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన రంగిశెట్టి వెంకటేశ్వరరావు (50) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ఆ కుటుంబానికి తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా ఇటీవల తెనాలిలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై దాడి, దీక్షా శిబిరానికి నిప్పుపెట్టిన ఘటనను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జేఏసి నేతలు బుధవారం నిర్వహించ తలపెట్టిన తెనాలి పర్యటనకు పోలీసులు బ్రేక్ వేశారు. 144 సెక్షన్, 30 పోలీసు యాక్ట్ అమలులో ఉందని, ఈ సమయంలో పర్యటనలు నిర్వహించడం తగదని విజ్ఞప్తి చేయడంతో పర్యటనను చంద్రబాబు వాయిదా వేసుకున్నారు. అయితే ఫిబ్రవరి 4వ తేదీన యథావిధిగా జేఏసీ నేతల పర్యటన జరగనుంది.
*చిత్రాలు.. జలదీక్ష చేపట్టిన రైతులు, మహిళలు
*నల్ల బెలూన్లు ఎగరేస్తున్న రైతులు