ఆంధ్రప్రదేశ్‌

ఆర్డినెన్స్ దిశగా అడుగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 13: రాష్ట్ర శాసనసభ, మండలిని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 174 క్లాజ్ 2 సబ్‌క్లాజ్ (ఏ) ప్రకారం అసెంబ్లీ, మండలిని ప్రోరోగ్ చేస్తున్నట్లు వివరించారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గత నెలలో జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదించి శాసనమండలికి పంపింది. అయితే ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవటం, ఆపై ప్రభుత్వం మండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపటం తెలిసిందే. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మండలి చైర్మన్ సెలక్ట్ కమిటీ ఏర్పాటు దిశగా పావులు కదుపుతున్నారు. మరోవైపు మండలి రద్దుకు ఇంకా రెండేళ్ల వ్యవధి పడుతుందనే ప్రచారం జరుగుతోంది. వీటిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్చించిన సంగతి విదితమే. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాల్సిందిగా ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఒక వేళ మండలి రద్దుకు వ్యవధి పట్టినప్పటికీ మరో నెల రోజుల్లోపే తుది నిర్ణయం తీసుకోవటం ద్వారా మూడు రాజధానులపై ముందుకు వెళ్లాలనే యోచనతో ముఖ్యమంత్రి ఉన్నారు. ఇందులో భాగంగా శాసనసభ, మండలి ప్రోరోగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రోరోగ్ వల్ల సాంకేతికపరమైన ఇబ్బందులు ఉండబోవని ప్రభుత్వం భావిస్తోంది. ఆ రెండు బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్ తీసుకు వచ్చేందుకే ప్రభుత్వం ఉభయ సభల ప్రోరోగ్‌కు సిఫార్సు చేసిందని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై న్యాయ నిపుణులతో సంప్రతింపులు జరుపుతున్నాయి. కాగా వచ్చే నెల 15వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాల నిర్వహణకు మరోవైపు సర్కార్ కసరత్తు జరుపుతోంది. నెల రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో బడ్జెట్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణలు తీసుకువస్తూ చట్టసవరణ బిల్లుతో పాటు ఇతర బిల్లులను ఆమోదించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే సెలక్ట్ కమిటీ ప్రతిపాదన చట్టబద్ధంగా చెల్లదని ప్రభుత్వం వాదిస్తోంది. దీనిపై అవసరమైతే కోర్టులో గట్టిగా వాదించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఉగాది నాటికి రాజధాని తరలింపు ప్రక్రియ పూర్తిచేయాలని ముందుగా భావించినా బడ్జెట్ సమావేశాల తరువాత తరలించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. అయితే జూన్ కల్లా విద్యాసంవత్సరం
ప్రారంభం కానుండటంతో ఉద్యోగుల పరంగా నెల, రెండు నెలలు ముందుగానే తరలింపు ప్రక్రియ ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రతిపక్షాలు వాదిస్తున్నట్లుగా ప్రోరోగ్ అంశంలో సాంకేతిక ఇబ్బందులను కూడా పరిశీలిస్తోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్, భూ సేకరణ చట్టం ఆర్టినెన్స్‌లు తెచ్చే సందర్భంలో కూడా పార్లమెంటును ప్రోరోగ్ చేశారని అధికార పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. రాజ్యసభ సమావేశాలు నడుస్తుండగానే ప్రోరోగ్ చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు. పార్లమెంట్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సందర్భాలను పరిగణనలోకి తీసుకుని మూడు రాజధానులపై ఆర్డినెన్స్ జారీకి ప్రభుత్వం కసరత్తు జరుపుతున్నట్లు సమాచారం.
*చిత్రం... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్