ఆంధ్రప్రదేశ్‌

రాజధాని బంద్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 22: రాజధాని ప్రాంతంలో రైతులు, మహిళలపై పోలీసుల దాడులను నిరసిస్తూ అమరావతి పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం తలపెట్టిన రాజధాని ప్రాంత 29 గ్రామాల బంద్ విజయవంతమైంది. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల్లో ఎక్కడికక్కడ దుకాణాలు, హోటళ్లు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను యాజమాన్యాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు మద్దతు పలికారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో మహిళలు, రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి సేవ్ అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనలను వ్యక్తం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే రైతులు, మహిళలు ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడకుండా ప్రశాంతంగా బంద్‌ను పాటించారు. రాజధాని గ్రామాల్లో చేపట్టిన బంద్‌కు మహిళా జేఏసీ, టీడీపీ నేతలు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అలాగే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు, మరో నేత బాబురావు తదితరులు సైతం బంద్‌కు మద్దతు తెలిపారు. కాగా రాష్ట్రానికి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని, మూడు రాజధానుల ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం శనివారం నాటికి 67వ రోజుకు చేరుకుంది. మహిళా జేఏసీ నేతలు ఆయా గ్రామాల్లో పర్యటించి మహిళలు, రైతులు నిర్వహిస్తున్న రిలే దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మహిళా జేఏసీ నేతలు మాట్లాడుతూ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను అవమానించడం తగదంటూ మండిపడ్డారు. మహిళలు స్నానాలు చేసే చోట డ్రోన్‌లు తిప్పుతూ సంస్కారం మరచి మహిళలను మనోవేదనకు గురి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునే వరకూ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టంచేశారు. ఈనెల 26వ తేదీన విజయవాడలో అమరావతి కోసం 24 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. మందడం, వెలగపూడి, గ్రామాల్లో రైతులు నిర్వహిస్తున్న దీక్షా శిబిరాలను గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సందర్శించి వారికి మద్దతు తెలిపారు. వెలగపూడిలో 24 గంటల నిరసన దీక్ష చేస్తున్న 21 మంది మహిళలతో దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా జయదేవ్ మాట్లాడుతూ రాజధాని పరిధిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై వేసిన సిట్‌కు భయపడేది లేదని స్పష్టం చేశారు. రాజకీయ కక్షతో వేసిన సిట్‌పై తమకు నమ్మకం లేదని, నిజంగా అవినీతి జరిగినట్లు భావిస్తే సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం అంటే మరో నాలుగేళ్లు ఉద్యమం చేసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎంపీగా రాజధాని రైతుల బాగోగులు చూడాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. రాజధానిలో తనకు ఒక సెంటు స్థలం కూడా లేదని తేల్చిచెప్పారు. రాజధాని ప్రాంతంలోని కృష్ణాయపాలెం రైతుల దీక్షకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పలువురు నేతలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి తరలింపు అంశం అన్ని రంగాల అభివృద్ధిని కుంటుపడేలా చేసిందన్నారు. రాజధాని తరలింపు అంశాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. చేయని నేరాలకు రైతులపై కేసులు నమోదు చేయడం తగదని హితవుపలికారు.
*చిత్రం...మందడం శిబిరంలో మాట్లాడుతున్న ఎంపీ గల్లా జయదేవ్