ఆంధ్రప్రదేశ్‌

‘సుప్రీం’ తీర్పునూ వక్రీకరిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 18: స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరిస్తూ చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతులు ఎదురుదాడికి దిగడం వారి ఆలోచనా తీరుకు అద్దం పడుతోందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం నామమాత్రపు చర్యలు తీసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాడమాడుతోందని విమర్శించారు. స్థానిక ఎన్నికల వాయిదాపై సుప్రీం తీర్పును స్వాగతిస్తూ ఈ తీర్పును సైతం వక్రీకరిస్తున్న వైసీపీ నేతల తీరును తప్పుబట్టారు. బుధవారం మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వానికి అసలు బాధ్యత ఉందా అంటూ మండిపడ్డారు.
ఎన్నికల వాయిదాపై ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లారని నిలదీస్తూ తద్వారా ఏం సాధించారని ప్రశ్నించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ యత్నిస్తోందని ఆరోపించారు. దేశంలో కరోనా విస్తరణ వల్లే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిందన్నారు. ఈవిషయంలో జోక్యం చేసుకోలేమని భారత అత్యున్నత న్యాయస్థానం కూడా స్పష్టంచేసిందన్నారు. అయితే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల కమిషన్‌ను తిడుతూ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిర్ణయం తీసుకుందని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. చివరకు సుప్రీంకోర్టు తీర్పును సైతం వక్రీకరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారంటే వీరికి బుద్ధి జ్ఞానం ఉందా అంటూ నిప్పులు చెరిగారు. ఎన్నికల కోడ్, అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగిన మీరు 14వ ఆర్థిక సంఘం నిధులపై ఎక్కడైనా ప్రస్తావించారా అంటూ ప్రశ్నించారు. కరోనా వచ్చినవారిలో 9శాతం మంది మరణించారని, జగన్ ప్రభుత్వానికి కరోనా విషయంలో కనీస అవగాహన లోపించిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా క్వారంటైన్ పెట్టారా, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఐసోలేషన్ వార్డులు పెడతారా అంటూ నిలదీశారు. ప్రపంచమంతా కరోనాపై ముందస్తు చర్యలు తీసుకుంటుంటే ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. భారతీయ విద్యార్థులు విదేశాల్లోని విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారని తెలిపారు. దేశంలో కరోనా ప్రస్తుతం 2వ దశలో ఉందని, మూడవ దశ వస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. మాహారాష్ట్ర నుంచి ఎవరు వచ్చినా స్క్రీన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, మరోవైపు భారత్‌లో దూరప్రాంత రైళ్లన్నీ రద్దుచేశారని, పాక్‌కు వస్తే భారతదేశానికి రావడం పెద్దకష్టం కాదని చెప్పారు. ఇప్పటికే 150 దేశాలకు కరోనా పాకిందని, విదేశాల నుండి అసలు రాష్ట్రానికి ఎంతమంది వచ్చారో ప్రభుత్వం తెలపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 11వేల మంది రాష్ట్రానికి వచ్చారని, వీరికి వైద్య పరీక్షలు నిర్వహించారా అంటూ ప్రశ్నించారు. తనను, తన పార్టీని తిట్టడం తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. ఈసందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీడీపీ రూపొందించిన కరపత్రాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. విలేఖరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్, టీడీఎల్పీ ఉప నేత కింజారపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పాల్గొన్నారు.

*చిత్రం... మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు