ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో 30లక్షల హ్యాపీ హోమ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: బలహీన వర్గాల ప్రజలకు గృహ నిర్మాణం పథకంలో ప్రభు త్వం నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టనుంది. దేశంలోనే తొలిసారిగా ఇండో - స్విస్ ఇంధన సామర్థ్య సాంకేతికతను బలహీన వర్గాల గృహ నిర్మాణంలో వినియోగించనున్నారు. సుమారు 30లక్షల ఇళ్లలో ఈ నూతన సాంకేతికత ఉపయోగించటం ద్వారా ఇళ్లలో ఉష్ణోగ్రత 4నుంచి 8డిగ్రీల వరకు తగ్గటంతో పాటు కనీసం 20శాతం మేర విద్యుత్ ఆదా చేయాలని సంకల్పించారు. స్విట్జర్లాండ్ ప్రభు త్వ విభాగమైన ఫెడరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ (ఎఫ్‌డీఎఫ్‌ఈ) సహకారంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ)
ఈ సాంకేతికతను ఆంధ్రప్రదేశ్‌కు అందించనుంది. రాష్ట్రంలో పేద, బలహీన వర్గాలకు 14,097 జగనన్న కాలనీల్లో 30లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వెనువెంటనే బీఈఈ ప్రతినిధులు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్‌ను ఇటీవలే కలిసి రాష్ట్రంలో బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్ (బీప్) అమలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీనికింద తొలిసారిగా దేశంలో ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్ - రెసిడెన్షియల్ (ఈసీబీసీ-ఆర్) ప్రకారం ఇండో - స్విస్ ఇంధన సామర్థ్య సాంకేతికతను బలహీన వర్గాల గృహాలకు అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర ఇంధన శాఖకు చెందిన ఏపీ ఎనర్జీ కన్సర్వేషన్ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) ఇందుకు సహకారం అందిస్తుందని తెలిపారు. దీనిపై హౌసింగ్, ఏపీఎస్‌ఈసీఎం, బీప్ అధికారులతో అజయ్ జైన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే నాలుగేళ్లలో బలహీన వర్గాలకు 30లక్షల గృహాలు నిర్మించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న ఈ గృహ నిర్మాణ కార్యక్రమం దేశంలోనే అతిపెద్దది కావచ్చన్నారు. ఈ గృహాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలు అమలు చేయాలని, తద్వారా పేదలకు ఉన్నత జీవన ప్రమాణాలు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు. ప్రతి పేదవానికి తనకంటూ సొంతిల్లు ఉండాలనే కలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి దృఢ సంకల్పంతో ఉన్నారని అజయ్ జైన్ వివరించారు. అలాగని ఏదోరకంగా నిర్మాణాలు జరిపి చేతులు దులుపుకోరాదని స్పష్టం చేశారన్నారు. లబ్ధిదారుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా అన్ని సౌకర్యాలతో అందమైన, ఆరోగ్యకరమైన హ్యాపీ హోమ్స్ నిర్మించి ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారని చెప్పారు. పేదలకు ఇళ్లు ఇవ్వడమంటే వారికేదో మేలుచేసినట్లు మాత్రమేకాదని, దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఇది ఉపకరిస్తుందనేది ముఖ్యమంత్రి అభిమతంగా తెలిపారు. ఆర్థిక, సామాజిక పురోగతిలో పేద, బలహీన వర్గాలు ప్రధాన పాత్ర పోషిస్తున్న అంశాన్ని సీఎం గుర్తుచేశారని వివరించారు.
ఈ గృహాలు 300 - 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. లివింగ్ రూమ్, బెడ్ రూం, కిచెన్, వరండా, టాయిలెట్ల సౌకర్యాలు ఉంటాయి. ఇంటి మొత్తం విస్తీర్ణంలో 16.66 శాతం ఓపెన్ ఏరియా ఉంటుంది. సీలింగ్ దగ్గరలో గ్లాస్ ఫిట్టింగ్ ఇండే కిటికీలు అమరుస్తారు. ఇంటి పైకప్పు, గోడలను పర్యావరణ హితమైన మెటీరియల్‌తో నిర్మిస్తున్నందు వల్ల సాధారణ గృహాలతో పోలిస్తే ఇంటి లోపల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఈసీబీసీ-ఆర్ ప్రకారం ఇంధన సామర్థ్య, సాంకేతికతతో నిర్మిస్తున్నందువల్ల, పగటిపూట ఇంటి లోపల సహజమైన వెలుతురు పెరగడం, చల్లదనం ఏర్పడటం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది. తద్వారా లబ్ధిదారులకు విద్యుత్ బిల్లులు తగ్గటంతో పాటు ఇల్లు సౌకర్యవంతంగా ఉంటుంది.
మన రాష్ట్రంలో నిర్మిస్తున్న ఈ 30లక్షల ఇంధన సామర్థ్య గృహాలు దేశానికే కొత్త నమూనాగా ఉంటాయని, బహుశా ప్రపంచంలోనే ఇలాంటివి అతి తక్కువ ఉంటాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అభిప్రాయపడ్డారని అజయ్ జైన్ తెలిపారు. పేదల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఇది దోహపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. బీఈఈ అధికారులు మాట్లాడుతూ ఈసీబీసీ - రెసిడెన్షియల్ కోడ్ వినియోగం వల్ల గృహనిర్మాణ వ్యయం కొంతమేర తగ్గుతుందని, బలహీన వర్గాల గృహ నిర్మాణాలకు ఇది ఓ వరమన్నారు. ఈ సాంకేతికతతో ఇళ్లు నిర్మిస్తే స్థానిక ఉష్ణోగ్రతలను బట్టి 4నుంచి 8డిగ్రీల వరకు ఇంటిలోపల ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉందని, గాలి, వెలుతురు పుష్కలంగా వస్తాయని, కనీసం 20 శాతం మేర విద్యుత్ బిల్లులు ఆదా చేసుకునే వీలుంటుందని చెప్పారు. 30లక్షల ఇళ్లలో ఎల్‌ఈడీ లైట్లు, అత్యుత్తమ ఇంధన సామర్ధ్యం కలిగిన ఫ్యాన్లు, ఇతర ఎనర్జీ ఎఫీషియంట్ ఉపకరణాలు అమర్చేందుకు సహకరించాల్సిందిగా రాష్ట్ర ఇంధన శాఖకు చెందిన ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫీషియంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీ సీడ్కో)ను అజయ్ జైన్ కోరారు. బీఈఈ, ఈఈఎస్‌ఎల్, ఏపీ ఎస్‌ఈసీఎం సహకారంతో దశలవారీగా 30లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య చర్యలు అమలు చేయాలని కోరారు. అటు లబ్ధిదారులు, ఇటు విద్యుత్ సంస్థలకు కూడా ఇది ప్రయోజనకరమని అధికారులు అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రికల్ వర్క్స్‌కు సంబంధించి ఏపీ సీడ్కో కన్సల్టెన్సీ సర్వీసులు అందజేస్తుంది. ఈసీబీసీ - రెసిడెన్షియల్ కోడ్ అమలుపై గృహ నిర్మాణ శాఖ అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా ఏపీ సీడ్కో, ఏపీఎస్‌ఈసీఎంలను కోరారు. గృహ నిర్మాణ శాఖలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలును ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ స్వాగతించారు. దీనివల్ల 30లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయని, భవిష్యత్‌లో బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకాల అమలుకు ఇదో గీటురాయి అవుతుందన్నారు. ఈ విషయంలో ఇంధన శాఖ పూర్తి సహకారం అందిస్తుందని ప్రకటించారు. దేశంలో ఈసీబీసీ - రెసిడెన్షియల్ కోసం మూడు రాష్ట్రాలు నామినేట్ కాగా, అందులో ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేయటం పట్ల బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇది మన రాష్ట్రానికి ప్రతిష్టాత్మకం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.