ఆంధ్రప్రదేశ్‌

తండ్రికి తగిన తనయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 26: విద్యావేత్తగా, అర్థశాస్త్రంలో పట్టు ఉన్న వ్యక్తిగా, 105 దేవాలయాల అనువంశిక ధర్మకర్తగా, 15 విద్యా సంస్థల చైర్మన్‌గా మాజీమంత్రి, విజయనగరం రాజవంశీకుడు పూసపాటి ఆనందగజపతిరాజు (65) జిల్లాప్రజల మన్ననలు పొందారు. రాజకీయాలతో ఆయన ప్రజలకు సన్నిహితం అవకపోయినా, దేవాలయాల అనువంశిక ధర్మకర్తగా, మన్సాస్ విద్యా సంస్థల ద్వారా పేదకుటుంబాలకు విద్యను అందించిన వ్యక్తిగా వేలాది కుటుంబాలకు చేరువయ్యారు. తండ్రి స్వర్గీయ పివిజి.రాజు తనకు చెందిన వేలాది ఎకరాల భూములను పేదరైతులకు, ఆలయాలకు, విద్యాసంస్థలకు ఇవ్వటం ద్వారా పేరుప్రఖ్యాతులు సంపాదించగా ఆయన కోవలోనే ఆనందగజపతిరాజు విద్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇతోధిక సహాయం అందించారు. విజయనగరం సంస్థాన చివరి రాజు స్వర్గీయ పివిజి రాజు పెద్దకుమారుడు అయిన ఆనందగజపతిరాజు 1950 జూలై 17న ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం చెన్నైలో జరిగింది. అనంతరం ఉన్నత విద్యాభ్యాసం చెన్నై లయోలా కళాశాల, విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ, గ్వాలియర్‌లోని సింధియా యూనివర్సిటీ, ఫ్లోరిడాలోని స్టాన్‌స్టన్ యూనివర్సిటీలో జరిగింది. అర్థశాస్త్రంలో ఆనందగజపతిరాజు మంచిపట్టు సాధించారు. మొదట్లో లోకదళ్ పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1983లో స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన టిడిపిలో చేరి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్య, వైద్య,ఆరోగ్యశాఖలు నిర్వహించారు. 1985లో జరిగిన లోకసభ ఎన్నికల్లో బొబ్బిలి లోకసభ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆ తరువాత ఆయన టిడిపికి దూరమై కాంగ్రెస్‌లో చేరి మరోసారి ఎంపిగా ఎన్నికయ్యారు.
అప్పన్నతో ఎనలేని అనుబంధం
సింహాచలం: చారిత్రక ప్రాధాన్యత కలిగిన సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవాలయంతో పూసపాటి వంశీయులకు శతాబ్దాల కాలంగా అనుబంధం కొనసాగుతోంది. 1713 నుండి నేటి వరకు పూసపాటి వంశీయులు దేవాలయ అనువంశిక ధర్మకర్తలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆనంద గజపతిరాజు పదవ ధర్మకర్తగా దేవాలయానికి నిస్వార్థ సేవలు అందించారు.
ఈ దేవాలయంలో స్వామి సుప్రభాత సేవ తరువాత రాజగురువులైన కుమార వెంకటాచార్యులతో పాటు పూసపాటి వంశీయుల పేరుతో తొలిపూజ చేయడం సనాతనంగా వస్తున్న సంప్రదాయం. 1995 నవంబర్ 14న తండ్రి పూసపాటి విజయరామ గజపతిరాజు మరణానంతరం ఆనంద గజపతిరాజు సింహాచలం దేవాలయం కేంద్రంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో 108 దేవాలయాలకు ధర్మకర్తగా బాధ్యతలు చేపట్టారు. సింహాచలేశుని చందనోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలలో తొలిదర్శన భాగ్యాన్ని అందుకునే అదృష్టాన్ని పొందారు. స్వామివారి తిరు కల్యాణ మహోత్సవంలో రాజవంశీయుల తరఫున పట్టువస్త్రాలను సమర్పించడం, స్వామి వారి రథయాత్రను ప్రారంభించడం ఆనందగజపతిరాజుకు దక్కిన మహాద్భాగ్యం. దేవాలయంలో జరిగే విశేష ఉత్సవాలలో అవకాశం ఉన్నప్పుడల్లా ఆనందగజపతిరాజు కుటుంబ సమేతంగా పాల్గొనేవారు.