ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచి దసరా ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 30: దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో అత్యంత ప్రాధాన్యత కల్గిన శక్తి పీఠం.. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాలు శననివారం తెల్లవారుఝాము నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 11వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల నిర్వహణకు దాదాపు ఏడుకోట్ల రూపాయలు పైగా వెచ్చిస్తున్నారు. ఇప్పటికే రంగు రంగుల విద్యుద్దీప అలంకరణల మధ్య ఇంద్రకీలాద్రి ఉత్సవ శోభతో శోభాయమానంగా విరాజిల్లుతున్నది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం తెల్లవారుఝాము రెండు గంటల నుంచి అమ్మవారి స్నపన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముందుగా మేళతాళాలతో పవిత్ర కృష్ణానదీ జలాలను తీసుకువస్తారు.
సుప్రభాతం తరువాత వేద మంత్రాల మధ్య పంచ సూక్తులతో స్నపనాభిషేకం ప్రారంభిస్తారు. సుప్రభాత సేవ, బాలభోగ నివేదన, నిత్యార్చనాధికాలు నిర్వహించి తొలిరోజున అమ్మవారిని శ్రీ స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా అలంకరిస్తారు. అమ్మవారికి హారతులు ఇచ్చిన అనంతరం జేజేలు పలుకుతూ ఆలయ తలుపులు తెరచి సరిగ్గా ఉదయం 9 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇక రాత్రి 11 గంటల వరకు దర్శనం నిరంతరాయంగా కొనసాగుతుంది. ఉత్సవాలు సందర్భంగా ఆలయంలో నిత్యం జరిగే ఇతరత్రా ఆర్జిత సేవలన్నింటిని ఈ 11 రోజులపాటు తాత్కాలికంగా రద్దుచేసారు. ఈ 11 రోజులపాటు 11 అలంకారాలుంటాయి. ఇక మూలా నక్షత్రం రోజు ప్రత్యేక లక్ష కుంకుమార్చన టిక్కెట్లు రెండు షిఫ్టులకు ఫుల్ అయ్యాయి. మూడో షిఫ్టులో కూడా దాదాపు పూర్తయ్యాయి. రెండోరోజు నుంచి వేకువఝామున మూడు గంటల నుంచి అమ్మవారి దర్శనం లభిస్తుంది. 8వ తేదీ మూలానక్షత్రం సందర్భంగా సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 5వ తేదీ సాయంత్రం శ్రీ మల్లిఖార్జున మహామండపంలో అర్చక సన్మాన సభ జరుగుతుంది. ఈ సందర్భంగా అర్చక స్వాములను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ వైవి అనూరాధ సత్కరిస్తారు. 9వ తేదీ సాయంత్రం జరిగే వేద విద్వత్ సభలో రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్‌వి ప్రసాద్ వేద పండితులను సత్కరిస్తారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.సూర్యకుమారి, పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌ల నేతృత్వంలో ఆలయ ప్రాంగణంలోను, క్యూలైన్లలోను విస్తృత ఏర్పాట్లు జరిగాయి.
నేటినుంచి శ్రీశైలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
శ్రీశైలం: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలంలో శనివారం నుంచి శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శనివారం మొదటిరోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి స్వామి, అమ్మవార్లకు రావణ వాహనసేవ నిర్వహిస్తారు. ఉత్సవాల ప్రారంభం రోజు అమ్మవారు, స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. దసరా ఉత్సవాలకు దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.

చిత్రం.. విద్యుద్దీపాలంకరణలో అలరారుతున్న ఇంద్రకీలాద్రి