ఆంధ్రప్రదేశ్‌

కమలంలో కుమ్ములాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: ఏపి బిజెపిలో అంతర్గత కుమ్ములాటలు రోడ్డెక్కాయి. విజయవాడ నగర బిజెపి అధ్యక్షుడు, బీసీ వర్గానికి చెందిన డాక్టర్ ఉమామహేశ్వరరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ, రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు తీసుకున్న నిర్ణయంపై పార్టీలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చాలాకాలం నుంచి ఒక వర్గాన్ని సవాల్ చేస్తున్న రాజును వ్యూహాత్మకంగా తప్పించారని, ఇది మిగిలిన సామాజిక వర్గాలను అణచివేసే కుట్ర గానే బిజెపి సీనియర్లు భావిస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో పార్టీకి అన్యాయం జరుగుతోందని, బెజవాడ కనకదుర్గ ఆలయ కమిటీలో పార్టీ నేతలకు స్థానం కల్పించలేని మంత్రులు రాజీనామా చేయాలంటూ, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాష్ట్ర కార్యాలయంలో హల్‌చల్ చేశారు. కుర్చీలు పగులగొట్టారు. దీనికి స్పందించిన రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ఆ ఘటనకు నగర పార్టీ అధ్యక్షుడు రాజును బాధ్యుడిగా చేస్తూ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారం చాలాకాలం నుంచి రాష్ట్ర బిజెపిలో నెలకొన్న వర్గ రాజకీయాలను బట్టబయలు చేసింది.
రాష్ట్రంలో బిజెపిని కులపార్టీగా మార్చి, తెదేపాకు తోకపార్టీగా మారుస్తున్నారన్న విమర్శలు చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి. అన్ని జిల్లా పార్టీల్లోనూ ఈ వర్గమే పెత్తనం చేస్తోందని, మిగిలిన కులాలను పైకి రానీయకుండా అణచి వేస్తుందన్న విమర్శలూ లేకపోలేదు. ముఖ్యంగా మిగిలిన కులాలు, ప్రముఖ నేతలు పార్టీలోకి రాకపోవడానికి ఇదే కారణమంటున్నారు. ఆ వర్గానికి వ్యతిరేకంగా ఎవరైనా నేత తెరపైకి వస్తే, వారికి వ్యతిరేకంగా ఆ వర్గ మీడియాలో వ్యతిరేకంగా కథనాలు రాయించడం, రాష్ట్ర స్థాయిలో అణచివేయడం రివాజయిందని విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పార్టీ ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వంటి ఇతర కులాలకు చెందిన వారు ప్రతిభ, సమర్థత ఉన్నా ఇంకా ఎదగకపోవడానికి కారణం, ఈ కుల రాజకీయమేనన్న వ్యాఖ్యలు పార్టీలో బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పురంధ్రీశ్వరి, కావూరి సాంబశివరావు సొంత సామాజికవర్గమే అయినప్పటికీ వారిద్దరూ చంద్రబాబుకు వ్యతిరేకమయినందున, వారిని కూడా దూరంగా పెడుతున్న పరిస్థితిపై పార్టీలో చాలాకాలం నుంచి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ వర్గాన్ని వ్యతిరేకిస్తున్న రాజును సస్పెండ్ చేయడంతో అవి ముదురుపాకాన పడినట్టయింది.
బీసీ కులానికి చెందిన రాజు చాలాకాలం నుంచి అంకితభావంతో పనిచేస్తూ, ఎన్నికల్లో గెలిచిన నేతను షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆందోళన ఘటన సాకుగా తీసుకుని రాజును సస్పెండ్ చేయడం ద్వారా, ఒక వర్గం తన ప్రతీకారం తీర్చుకుందని పార్టీ సీనియర్లు విశే్లషిస్తున్నారు. ఈ విధంగా బీసీ వర్గానికి చెందిన నేతపై వేటు వేయడం ద్వారా, పార్టీ బీసీలకు వ్యతిరేకమన్న సంకేతాలు వెళితే ప్రజలకు బీసీలు ఎలా చేరువవుతారని ప్రశ్నిస్తున్నారు.
తాజా ఘటనను నిరసిస్తూ, రాష్ట్ర పార్టీలో నెలకొన్న కుల రాజకీయాలను వివరిస్తూ పార్టీ సీనియర్లు ఢిల్లీకి ఫిర్యాదులు పంపినట్లు సమాచారం. ఒక వర్గానికి ధారాదత్తం చేస్తే ఎన్ని దశాబ్దాలయినా పార్టీ ఎదగదని, వీరి నీడ నుంచి పార్టీని తప్పిస్తే తప్ప మనుగడ కష్టమని వారు తమ ఫిర్యాదులో స్పష్టం చేయడంతోపాటు, రాజుపై విధించిన సస్పెన్షన్‌ను తొలగించి బీసీల్లో వ్యతిరేకత రాకుండా చూడాలని కోరినట్లు తెలిసింది. రాష్ట్ర అధ్యక్షుడి పదవీకాలం ముగిసినందున, ఆయనకు సస్పెండ్ చేసే అధికారం లేదని కూడా తమ ఫిర్యాదులో స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.