రాష్ట్రీయం

విత్తనం...విషం! నవ్యాంధ్రలో నకిలీ జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: నకిలీ విత్తనాలు దేశానికి అన్నం పెట్టే రైతు జీవితాలను కబళిస్తున్నాయి. గత కొద్దిరోజుల నుంచి గుంటూరు జిల్లాలో నకిలీ విత్తనాల దందా రైతుల ఆత్మహత్యలకు కారణమవుతోంది. అధిక దిగుబడి ఆశతో నాలుగింతల రేటుకు కొన్న విత్తనాలు రైతుల మెడ మీద కత్తిగా మారిన పరిస్థితిలో, తిలా పాపం తలా పిడికెడు మాదిరిగా పెద్దగద్దల పాత్రలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంపెనీలు, డీలర్లు ఉమ్మడిగా ఆడిన ఈ నకిలీ చదరంగంలో ఒక కీలక నేత భార్య ప్రముఖ పాత్ర పోషించినట్లు విమర్శలున్నాయి.
గుంటూరు, తూర్పు గోదావరిలో నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు ఇప్పటికి ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. నకిలీ విత్తనాల వ్యవహారం వెలుగులోకి రాగానే కావేరీ కంపెనీపై వేటు వేసిన వ్యవసాయ శాఖ వాటిని అమ్మిన డీలర్లను మాత్రం వదిలేసింది. పైగా వారిని రక్షించే పనిలో పడింది. గుంటూరు జిల్లాలో ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రముఖుడి భార్య డీలర్లను రక్షిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకూ పోస్టింగులు, బదిలీలలో అంతా తానై చక్రం తిప్పుతున్న సంగతి బహిరంగ రహస్యమే. నకిలీలలు వెలుగులోకి వచ్చిన వెంటనే వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతోపాటు అక్రమార్కులు గుంటూరులో భేటీ అయి, కేసుల నుంచి తప్పించుకునే పథకం వేసిన విషయం మీడియాలోనూ వెలుగుచూసింది.
కర్నాటక నుంచి విత్తనాలు దిగుమతి చేసుకుంటుండగా, ఈసారి అక్కడ ఉత్పత్తి పడిపోవడంతో నకిలీ కంపెనీలు రంగంలోకి దిగాయి. ఒక్కో రకం కంపెనీ విత్తనాలను డూప్లికేట్ చేసి డీలర్ల ద్వారా కోట్లకు పడగలెత్తిన వైనం రైతుల ఆత్మహత్యకు కారణమవుతోంది. ఉన్న డిమాండ్‌ను అడ్డుపెట్టుకుని ఒక రకం విత్తనాలను 10 వేలకు కొని 40 వేలకు అమ్మితే, మరొక రకం విత్తనాలను 30 వేలకు కొని లక్ష రూపాయలకు అమ్మకాలు సాగించిన వ్యవహారం జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు తెలిసినా వౌనంగా ఉండటమే ఈ దారుణానికి కారణమంటున్నారు. ఇప్పటివరకూ జిల్లా వ్యవసాయ ముఖ్య అధికారిపై ఎలాంటి చర్యలూ లేవు.
ఈ అక్రమ వ్యవహారం మీడియాకెక్కి, రైతులు రోడ్డెక్కడంతో దిద్దుబాటుకు దిగిన వ్యవసాయ మంత్రి పుల్లారావు పిడి యాక్టు ప్రయోగిస్తామని హెచ్చరించారు. అయితే ఇప్పటివరకూ కేవలం కంపెనీలపైనే తప్ప, వాటిని రైతులకు అమ్మిన డీలర్లపై ఒక్క కేసు గానీ, ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న వ్యవసాయశాఖ జిల్లా స్థాయి అధికారులపైగాని ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడాన్నిబట్టి, దీనిని సమాధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఆరుగురు డీలర్ల లైసెన్సుల రద్దు, జీవా కంపెనీకి చెందిన 19 మంది డీలర్లు, బ్రహ్మపుత్ర కంపెనీకి చెందిన 28మంది డీలర్లకు కేవలం షోకాజు నోటీసులిచ్చి సరిపెట్టడమే ఈ అనుమానాలకు కారణం.
ముక్కుసూటి అధికారిగా పేరున్న ఏపి వ్యవసాయశాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి రంగంలోకి దిగి, విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు ఎంతకు కొనుగోలు చేసి ఎంత ధరకు అమ్మారన్న దానిపై విచారణకు ఆదేశించడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దానితో తాము అమ్మిన రైతులకు విత్తనాల ధర చెల్లించి తమ పేర్లు రాకుండా చూసుకుంటున్నారు. డీలర్లతో కుమ్మక్కయిన వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు డీలర్లతో రహస్య భేటీ అయినట్లు సమాచారం. ఎంతకయితే విత్తనాలు అమ్మారో అదే డబ్బును రైతులకు వాపసు చేసేలా చూసుకోవాలని, లేకపోతే ఇది తమ మెడకు చుట్టుకుంటుందని డీలర్లను ఆదేశించినట్లు తెలిసింది. పనిలోపనిగా ఒక ప్రముఖడి భార్యను ప్రసన్నం చేసుకుని కేసులు లేకుండా చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా వ్యవసాయశాఖలో పోస్టింగులకు లక్షల్లో డిమాండ్ ఉన్న నేపథ్యంలో, నకిలీ విత్తన కంపెనీలు, బయో ఉత్పత్తి కేంద్రాల నుంచి వస్తున్న నకిలీలకు రైతులు బలవుతున్నారు.
అయితే, ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన కోణం కూడా ఉంది. డీలర్లు-రైతులకు ఉన్న అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని, గ్రామాల్లో పలుకుబడి ఉన్న పెద్ద రైతుల ద్వారానే ఈ నకిలీ విత్తనాలను మిగిలిన రైతులకు అంటగడుతున్నారు. ఫలానా కంపెనీ విత్తనాలు వాడినందుకే తమకు అంత దిగుబడి వచ్చింది కాబట్టి, మీరు కూడా వాడమని సిఫారసు చేస్తున్న వైనం అన్ని జిల్లాల్లోనూ ఉంది.
ట్రయల్ రన్ మార్కెట్ పేరుతో వేల క్వింటాళ్ల విత్తనాలు అమ్ముతున్న పరిస్థితి నెలకొన్నా ఎలాంటి చర్యలు లేవు. ఏడేళ్ల పరిశోధన తర్వాతనే మార్కెట్‌లోకి విత్తనాలు విడుదల చేయాల్సి ఉండగా

వీటిని పాటిస్తున్న కంపెనీలు తక్కువే. కర్నాటకలోని ఎల్లివర్ణ, కొప్పల్, జగంద్రగడ్డ వంటి ప్రాంతాల్లోని ఆర్ అండ్ డి ప్లాంట్ల నుంచి కిలో మిర్చి విత్తనాలను 10 వేలకు కొని, వాటికి ట్రూత్‌ఫుల్ లేబుళ్లు వేసి నాలుగురెట్ల లాభాలతో ట్రయల్ మార్కెట్ చేస్తున్నాయన్న ఆరోపణలున్నా ఎలాంటి విచారణ జరగకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
కిలో 10 వేలకు కొని వాటిని పది గ్రాముల ప్యాకెట్లలోకి మార్చి, 650 వరకూ అమ్ముతున్నా వ్యవసాయ, మార్కెట్, విజిలెన్స్ విభాగాలు మొద్దునిద్ర వీడటం లేదు. కొన్ని వందల కంపెనీలకు ప్లాంట్లు,బ్రీడర్లు లేకపోయినా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. ఇంతవరకూ ఆర్ అండ్ డి ప్లాంట్లపై దాడులు జరగలేదు. అక్కడ ఒకే ప్లాంటులో 10-12 విత్తన కంపెనీలు తయారవుతున్నట్లు నమోదుచేస్తున్నా ఎలాంటి చర్యలు లేవు. ఒకే ప్లాంటులో లెక్కలేనన్ని కంపెనీలు లేబుళ్లు వేసుకుని మార్కెట్‌లోకి వస్తున్నా ఏ అధికారి డీలర్లపై దాడులు చేసిన సందర్భాలు లేవు.
గుంటూరు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో విత్తన తయారీ అధికంగా ఉంది. ‘నకిలీ విత్తనాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అమ్మినవారే కాదు, కొన్నవారూ శిక్షార్హులే. దీనిపై నివేదికకు ఆదేశించాం. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఇందులో అధికారులున్నా వదిలేది లేదు. ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గేది లేదు. ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తోంది. రుణమాఫీ, సబ్సిడీకి వేల కోట్లు ఖర్చు పెడుతుంటే కొందరు డబ్బుల ఆశకు రైతులను బలిచేస్తుంటే ప్రభుత్వం సహించదు. డీలర్లపైనా చర్యలుంటాయ’ని ఏపి వ్యవసాయశాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి చెప్పారు.

గుంటూరులో నకిలీ విత్తనాలతో నష్టపోయన రైతులకు పరిహారం చెల్లించాలని ఆందోళన చేస్తున్న దృశ్యం (ఫైల్ ఫొటో)

మార్తి సుబ్రహ్మణ్యం