ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో టిటి అకాడెమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 20: ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అకాడెమీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సౌత్ జోన్ ర్యాకింగ్ నేషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్ 2016 పోటీలను విశాఖలో గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో కొమ్మాదిలో రూపుదిద్దుకోనున్న క్రీడా ప్రాంగణంలో టిటి అకాడెమీకి స్థలం కేటాయించేందుకు అంగీకరించారు. అంతర్జాతీయ పోటీల్లో రాణించేవిధంగా క్రీడాకారులను తీర్చిదిద్దే బాధ్యత ఈ అకాడెమీ తీసుకోవాలని కోరారు. దేశంలో క్రీడలకు ప్రాధాన్యం కొరవడిందన్నారు. అయతే, 125 కోట్లమంది ప్రజానీకం ఉన్న భారతదేశంలో గత ఒలింపిక్స్‌లో తెలుగమ్మాయి పిపి సింధు సాధించిన రజత పతకం యావత్ క్రీడాలోకానికి ప్రేరణగా నిలిచిందన్నారు. చక్కటి వసతులు కల్పించి, సీనియర్ శిక్షకులను నియమించి తగిన ప్రోత్సాహం అందిస్తే మన క్రీడాకారులు మంచి ఫలితాలు సాధిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు కానుందన్నారు. తద్వారా రాష్ట్రం క్రీడాకారులకు స్వర్గ్ధామంగా మారుతుందన్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చామన్నారు. 2002లో జాతీయ క్రీడలను నిర్వహించడం ద్వారా ఉమ్మడి రాష్ట్రం ఖ్యాతిని దేశ వ్యాప్తంగా చాటామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియాలు నిర్మించామని, అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రలో క్రీడా సదుపాయాలు కొరవడ్డాయన్నారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లాల్లో పూర్తి వసతులతో కూడిన స్టేడియంల నిర్మాణం చేపట్టనున్నట్టు వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో క్రీడలను ప్రోత్సహించే దిశగా మండల కేంద్రాల్లో వచ్చే ఏడాది లోగా క్రీడా ప్రాంగణాలను నిర్మించనున్నట్టు వెల్లడించారు. ఇక మీదట విశాఖలోఏటా ఒక జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తామన్నారు. సౌత్ జోన్ ర్యాంకింగ్ టిటి పోటీల్లో సుమారు 700 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, వీరంతా క్రీడా స్ఫూర్తితో ఆడాలని హితవు పలికారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి ఆర్చరీ అకాడెమీ ఏర్పాటుకు ముందుకు రావడం పట్ల సిఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆర్చరీ అకాడెమీకి అవసరమైన వౌలిక సదుపాయాలను ప్రభుత్వ పరంగా కల్పించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. క్రీడా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా మంత్రులు సిసెచ్ అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, టిటి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ప్రభాత్ చతుర్వేది, విశాఖ టిటి ఫెడరేషన్ ప్రతినిధి భాస్కరరావు, ఎమ్మెల్సీ శర్మ తదితరులు పాల్గొన్నారు. టేబుల్ టెన్నిస్ నెంబర్ వన్ క్రీడాకారిణి మోనిక బాత్రాతో టెన్నిస్ ఆడి క్రీడలను సిఎం చంద్రబాబు ప్రారంభించారు.

చిత్రం..టిటి నెంబర్ వన్ క్రీడాకారిణి
మోనికా బాత్రాతో టెన్నిస్ ఆడుతున్న సిఎం