కృష్ణ

ఎర్రజెండాలు ఏకం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 26: మావోయిస్టులు అజ్ఞాతాన్ని వీడి ప్రజా స్రవంతిలోకి రావాలని, ఎర్రజెండాలన్నీ ఏకమై ప్రజా సమస్యలపై ఉద్యమించాల్సిన తరుణమిదేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఉద్ఘాటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బిజెపికి దమ్ము, ధైర్యం ఉంటే తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపిలు, నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి ఉప ఎన్నికల్లో గెలుపొందాలని ఆయన సవాల్ విసిరారు. ప్రత్యేక హోదాను ప్రకటించకుంటే శీతాకాలం పార్లమెంటు సమావేశాల తర్వాత తమ పార్టీ ఎంపిలు రాజీనామా చేస్తారని వైసిపి అధినేత వైఎస్ జగన్ ప్రకటించారన్నారు. అయితే వైసిపి కంటే ఎన్నికల హామీని విస్మరించిన బిజెపి తమ ఎంపిలు, ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు. స్థానిక విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి, టిడిపి సహాయం తీసుకొని ఏ ఒక్కరూ గెలిచినా తాము ప్రత్యేక హోదా విషయాన్ని మర్చిపోతామని స్పష్టం చేశారు. ప్యాకేజీనే మహద్బాగ్యమంటూ కేంద్రాన్ని అడుక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, ఆత్మాభిమానాన్ని కేంద్రం వద్ద ఫణంగా పెడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత పేరుతో సిఎం మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఎపి పునర్విభజన చట్టంలో షెడ్యూల్ 9, 10లో ఉన్న 107 ప్రభుత్వ సంస్థల విభజన పూర్తి కాకుండానే హైదరాబాద్‌ను వదిలి వచ్చేయడానికి నోటుకు ఓటు కేసే ప్రధాన కారణమన్నారు. హోదా కావాలని రాష్ట్రంలో 90 శాతం ప్రజలు కోరుతున్న విషయాన్ని తమ ప్రజాబ్యాలెట్ ద్వారా స్పష్టమైందన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నవంబర్ 10న అనంతపురంలో నిర్వహించ తలపెట్టిన కార్యక్రమానికి సిపిఐ తరపున సంపూర్ణ మద్దతును ప్రకటించారు. రాష్ట్ర సరిహద్దు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌ను ప్రజాతంత్రవాదులందరూ ఖండించాలన్నారు. రాష్ట్ర డిజిపి సాంబశివరావు కట్టుకథ చెబుతున్నారని, ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రీ స్కూల్స్‌గా అంగన్‌వాడీ కేంద్రాలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 26: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ పౌష్టికాహారం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పీతల సుజాత వెల్లడించారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమంపై 13 జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పౌష్టికాహారాన్ని అందించే విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ఎలాంటి అలసత్వం వహించరాదని మంత్రి ఆదేశించారు. ఇందుకు సిడిపిఒలు బాధ్యత వహించాలన్నారు. ప్రధానంగా ఏజన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధతో పౌష్టికాహార పంపిణీ జరగాలన్నారు. నరేగా పనులతో అంగన్‌వాడీ భవనాలను వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. కానె్వంట్ తరహాలోనే అంగన్ వాడీలను ప్రీస్కూల్స్‌గా రూపొందిస్తామని తెలిపారు. రాష్టమ్రంతా ఒకే యూనిఫాం ఉండేలా మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. ఇప్పటి వరకు 13వేల అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేసిందని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు. త్వరలో 181 హెల్ప్‌లైన్ ఏర్పాటవుతుందని, మహిళా సమస్యలను ఈ హెల్ప్‌లైన్ ద్వారా సేకరిస్తామన్నారు. బాల్య వివాహాలు జరక్కుండా నియంత్రించే గ్రామాలకు ప్రత్యేక అవార్డులు ప్రకటిస్తామన్నారు.

కృష్ణా వర్సిటీ అంతర కళాశాలల క్రీడా పోటీల తేదీల్లో మార్పులు
విజయవాడ (స్పోర్ట్స్), అక్టోబర్ 26: కృష్ణా విశ్వవిద్యాలయం అంతర కళాశాలల క్రీడాపోటీల తేదీల్లో స్వల్ప మార్పులు ఏర్పడినట్లు వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డా.ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. నవంబర్‌లో 10న నలందా డిగ్రీ కళాశాలలో బాక్సింగ్ (పురుషులు), 11న మచిలీపట్నం కృష్ణావర్సిటీ క్యాంపస్‌లో వాలీబాల్ (పురుషులు), 14న క్రికెట్ (పురుషుల) జోనల్స్, 15న మారిస్‌స్టెల్లా కళాశాలలో బాస్కెట్‌బాల్ (మహిళలు), 18న నందిగామ కెవిఆర్ కళాశాలలో బాస్కెట్‌బాల్ (పురుషులు), 22న కెవిఆర్ కళాశాలలో వాలీబాల్ (మహిళలు), 25న మాంటీస్సోరీ మహిళా కళాశాలలోకబడ్డీ (మహిళలు), 30న శాతవాహన కళాశాలలో ఆర్చరీ (పురుషులు/మహిళలు) జరుగతాయన్నారు. డిసెంబర్‌లో 1న మొవ్వ విఎస్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్రికెట్ (పురుషులు) ఇంటర్ జోనల్, 2న పిబి సిద్ధార్థ కళాశాలలో హ్యండ్‌బాల్ (పురుషులు), 5న కెబిఎన్ కళాశాలలో హ్యండ్‌బాల్ (మహిళలు), 7న నున్న వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో కబడ్డీ (పురుషులు), 9న మచిలీపట్నం నోబుల్ కళాశాలలో ఫుట్‌బాల్ (పురుషులు), 12న నలందా డిగ్రీ కళాశాలలో హకీ (పురుషులు), 15న ఎఎన్‌ఆర్ కళాశాలలో వెయిట్‌లిఫ్టింగ్, పవర్‌లిఫ్టింగ్ (పురుషులు/మహిళలు), బెస్ట్ఫిజిక్యూ (పురుషులు), 19న నున్న వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో అథ్లెటిక్స్ (పురుషులు/మహిళలు) విభాగాల్లో జరుగుతాయని పేర్కొన్నారు. 2017 జనవరిలో 3న నూజివీడు డిఎఆర్ కళాశాలలో బాల్‌బ్యాడ్మింటన్ (పురుషులు), 6న శ్రీదుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఖోఖో(మహిళలు), 7న కెబిఎన్ కళాశాలలో టేబుల్‌టెన్నిస్ (పురుషులు/మహిళలు), 10న మైలవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖోఖో (పురుషులు), 20న శాతవాహన కళాశాలలో నెట్‌బాల్ (పురుషులు), 24న పిబి సిద్ధార్థ కళాశాలలో సాఫ్ట్‌బాల్ (పురుషులు), 28న బాల్‌బ్యాడ్మింటన్ (మహిళలు) విభాగాల్లో టోర్నమెంట్స్ జరుగుతాయని పేర్కొన్నారు.

2019 జాతీయ క్రీడలు జరిగేనా?
విజయవాడ (స్పోర్ట్స్), అక్టోబర్ 26: ఆంధ్రప్రదేశ్‌లో 2019 జాతీయక్రీడలు జరిగే అవకాశం దాదాపుగా చేజారిపోయినట్లేనని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్‌కె పురుషోత్తం తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేఖరుల సమావేశం జరిగింది. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత ఒలింపిక్ సంఘం తమను గుర్తించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ అదికారులు మాత్రం తమను గుర్తించడంలేదన్నారు. 18నెలలుగా ఒలింపిక్ సంఘ కార్యక్రమాలకు అడ్డుపడుతూ, క్రీడాభివృద్ధికి సహకరించడం లేదని పేర్కొన్నారు. ఏ క్రీడా సంఘంలోను లేనివారు వచ్చి కోర్టులలో కేసులు వేసి క్రీడాభివృద్ధికి మోకాలడ్డుతున్నారని, రాష్ట్రంలో జితీయక్రీడల నిర్వహణ లేనట్లేనన్నారు. ముఖ్యమంత్రికి వాస్తవాలు తేలియజేయకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని తమను ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళే అవకాశం కల్పించడం లేదని వాపోయారు. గౌహతిలో జరిగిన భారత ఒలింపిక్ సంఘ సమావేశంలో రాష్ట్రం నుండి రూ.50లక్షలు జాతీయ క్రీడల నిర్వహణకు బిడ్ దాఖలు వేయడం జరిగిందని, తరువాత రూ.4.50కోట్లను డిడి రూపంలో ఎపిఒఎకు సమాచారం లేకుండా శాప్ అధికారులు ఐఒఎకు పంపడంతో దానిని వారు వెనుకకు పంపి ప్రోటోకాల్ ప్రకారం ఎపిఒఎ ద్వారా పంపలని సూచించడం జరిగిందన్నారు. అయినప్పటికీ శాప్ అధికారులు ఎపిఒఎను గుర్తించకుండా వ్యవహరిస్తుండటంతో ఐఒఎ జాతీయక్రీడలను కేటాయించలేదని పేర్కొన్నారు. పలు దాఫలుగా ఐఒఎ శాప్ అధికారులకు లేఖలు రాయడం జరిగిందని, ఇప్పటికైనా శాప్ అధికారులు సహకరిస్తే రాష్ట్రంలో 2021 జాతీయక్రీడలు నిర్వహించే అవకాశం ఉంటుందని, 2018 జనవరిలో యూత్ జాతీయక్రీడలు జరుగనున్నాయని వాటిని ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వడానికి ఐఒఎ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అధ్యక్షుడిగా ఉన్న గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ ఎక్కడ ఉన్నారో తమకు తెలియదని, వారు తమకు అందుబాటులోనికి రావడం లేదన్నారు. విశాఖపట్నం నుండి హర్షవర్ధన్, అనంతపురం నుండి జెసి పవన్‌రెడ్డి, కృష్ణాజిల్లా నుండి కెపిరావులు క్రీడాభివృద్ధికి అడ్డుపడుతున్నారని, ఎ క్రీడ నుండి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నరో తెలియకుండా ఎపిఒఎను నాశనం చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎపిఒఎ ఉపాధ్యక్షులు ఎ రమణారావు, బి వెంకట్రామయ్య, కోశాధికారి పద్మనాభం, తదితరులు పాల్గొన్నారు.

గుట్కా నిల్వలపై టాస్క్ఫోర్స్ దాడులు
విజయవాడ (క్రైం), అక్టోబర్ 26: నగరంలోని నిషేధిత గుట్కా నిల్వలపై టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. పోలీసుల కథనం ప్రకారం పటమట పోలీస్టేషన్ పరిధిలోని నిడమానూరు గ్రామంలో తళ్ళం సుధాకర్ అనే వ్యక్తి పెద్ద ఎత్తున గుట్కా, ఖైనీ ప్యాకెట్లు నిల్వ ఉంచినట్లు అందిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఏసిపి పి మురళీధర్, సిఐ సురేష్‌రెడ్డి ఆధ్వర్యాన సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుధాకర్‌కు చెందిన ఓ గోడౌన్‌ను తనిఖీ చేసి సుమారు 11లక్షల 12వేల రూపాయలు విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్‌లు కలిగిన 55 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పటమట పోలీసులకు అప్పగించారు.

జనచైతన్య యాత్రల ద్వారా
ప్రభుత్వ పనితీరు తెలుసుకుంటాం
మైలవరం, అక్టోబర్ 26: ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో చేసిన పనితీరును తెలుసుకునేందుకే నవంబర్ 1 నుండి రాష్టవ్య్రాప్తంగా జనచైతన్య యాత్రలు అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. మైలవరం నియోజకవర్గంలో 20రోజులు, జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో ఐదేసి రోజులు జనచైతన్య యాత్రల్లో తాను పాల్గొననున్నట్లు తెలిపారు. గడచిన రెండున్నరేళ్లలో జరిగిన అభివృద్ధిని ఈ చైతన్య యాత్రల ద్వారా తెలియజెప్పాలన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం, చంద్రన్న బీమా నమోదు కార్యక్రమాలను కూడా ముమ్మరం చేయాలన్నారు. రాష్ట్రంలో నాలుగు వేల మంది చంద్రన్న బీమాతో లబ్ధి పొందారని మంత్రి ఉమ తెలిపారు. పట్టిసీమ ద్వారా ఈ ఏడాది పది టీఎంసిల నీటిని రప్పించి 10 లక్షల ఎకరాల పంటలను సస్యశ్యామలం చేసినట్లు తెలిపారు. ఇది ముమ్మాటికీ తెలుగుదేశం ప్రభుత్వ ఘనతేనన్నారు. కానీ కళ్లుండీ చూడలేని కబోదులు పట్టిసీమ బూటకమని మాట్లాడుతున్నారని, గోదావరి నీటిలో వాళ్లు కొట్టుకుపోక తప్పదన్నారు. నాగార్జునసాగరు, శ్రీశైలం ద్వారా బుధవారం ఐదు టీఎంసిలు విడుదల చేశామని, నవంబర్ 15నాటికి మూడవ జోన్‌కు నీరు వస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకుని అమ్ముకునే వైసీపీ నాయకులు తాను మైలవరం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని గడపగడపకు తిరిగి అవాస్తవాలు చెబుతున్నారని, వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. వైసీపీ నాయకులంతా ఆర్థిక నేరగాళ్లని, వారికి అధికారం వస్తుందని కలలు కంటున్నారన్నారు. రాజధాని నిర్మాణం ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమని ప్రజలు గెలిపించారని, మళ్లీ ఆయనకే ఓటేసి అధికారంలోకి తేవటానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఉమ స్పష్టం చేశారు. బాబు చేస్తున్న అభివృద్ధిని చూసే వైసిపి నుండి 20మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరారని, అనేక మంది నేతలు, కార్యకర్తలు కూడా చేరుతున్నారని ఉమ అన్నారు. రాష్ట్భ్రావృద్ధి ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో అన్ని రోగాలకు వైద్యసేవలను అందిస్తున్నామని, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా బాలింతలకు పూర్తిస్థాయి వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఇవికాక సీఎం రిలీఫ్ ఫండ్ నుండి పేదల వైద్యానికి అయ్యే వ్యయాన్ని భరిస్తున్నట్లు తెలిపారు. పేదలకు ఇసుక ఉచితంగా అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి ఉమ వివరించారు. పార్టీ నేతలు కోమటి సుధాకర్, ఏఎంసి చైర్మన్ ధనేకుల సాంబశివరావు, ఎంపిపి లక్ష్మి, జెడ్పీటిసి రాము, కుమార్‌రెడ్డి, విజయబాబు, ఉయ్యూరు నరశింహారావు, తదితరులు పాల్గొన్నారు. ముందుగా మంత్రి ఉమ పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంతకుముందు ఆయన స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులను పరామర్శించి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.